2060 దశకంలో తారాస్థాయికి
ఆపై దిగిరానున్న భారత జనాభా
50–60 ఏళ్లలో 1,030 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా
ఐక్యరాజ్యసమితి నివేదిక
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలో జనాభా విస్ఫోటం కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి కుండబద్దలు కొట్టింది. ఈ శతాబ్దం చివరిదాకా అంటే 2100 సంవత్సరందాకా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌పేరు నిలిచిపోనుందని ఐరాస ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలో 145 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభా 2060 దశకంలో ఏకంగా 170 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
‘ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ పేరిట ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలను ఐరాస అధికారి క్లేర్ మెనోంజీ వెల్లడించారు. ‘‘భారత జనసంఖ్య 170 కోట్లకు చేరుకున్నాక నెమ్మదిగా 12 శాతం క్షీణతతో కిందకు దిగొస్తుంది. ప్రస్తుత ఏడాది 820 కోట్లుగా ఉన్న ప్రపంచజనాభా 2080 దశకం మధ్యకల్లా 1030 కోట్లకు చేరుకుంటుంది.
ప్రపంచజనాభా గరిష్ట స్థాయికి చేరుకున్నాక 2100 సంవత్సరంకల్లా 1020 కోట్లకు దిగివస్తుంది. జనాభాలో ఇప్పటికే చైనాను దాటేసిన భారత్ తన జన ప్రభంజనాన్ని 2100దాకా కొనసాగిస్తుంది. అంటే అప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా భారత్ పేరిట రికార్డ్ పదిలంగా ఉండనుంది. భారత జనాభా 2054లో 169 కోట్లకు చేరుకుని 2100 నాటికి 150 కోట్లకు పడిపోనుంది’’ అని మెనోంజీ అంచనావేశారు.
చైనాలో సగం జనాభా మాయం
‘‘ప్రస్తుత ఏడాది 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 కల్లా 121 కోట్లకు పడిపోనుంది. 2100 నాటికి 63.3 కోట్లకు మరింత తగ్గనుంది. 2024 నుంచి 2054 కాలంలో చైనా జనాభా వేగంగా తగ్గిపోనుంది. ఆ కాలంలో 20.4 కోట్లు తగ్గనుంది. జపాన్‌లో 2.1 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గిపోనుంది. 2100 నాటికి చైనాలోనే అత్యంత తక్కువ సంతాన సాఫల్యతా రేటు నమోదు కావ డమే ఈ జనాభా క్షీణతకు అసలు కారణం. 2100 కల్లా చైనాలో 78.6 కోట్ల జనాభా అంతరించిపోనుంది.
126 దేశాల్లో జనాభా పైపైకి..
2054 ఏడాదిదాకా ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే పోతుందని ఐరాస అంచనావేసింది. 2100 ఏడాదిదాకా ఈ పెరు గుదల ధోరణి గరిష్టస్థాయికి చేరుకోనుంది. భారత్, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపించనుంది.
తగ్గిన చిన్నారుల మరణాలు..
ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 2023లో 5లక్షల లోపుకు దిగొచ్చాయి. ఇంత తక్కువగా నమోదవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చిన్నారుల మరణాల్లో 95 శాతం జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 73.3 ఏళ్లుగా నమోదైంది. 1995తో పోలిస్తే ఆయుర్దాయం 8.4 సంవత్సరాలు పెరగడం విశేషం. 2054 ఏడాదికల్లా ఆయుర్దాయం 77.4 సంవత్సరాలకు పెరగనుంది.
అమెరికాను దాటేయనున్న పాక్
ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు 2.25గా ఉంది. 1990లో ఇది 3.31గా ఉండటం విశేషం. సాధారణంగా ఉండాల్సిన 2.1 కన్నా తక్కువ రేటు ప్రపంచంలోని సగానికిపైగా దేశాల్లో నమోదవుతోంది. 2054కల్లా పాకిస్తాన్ జనాభా అమెరికాను అధిగమించి 38.9 కోట్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమెరికా జనాభా 34.5 కోట్లు. 2054లో పాక్‌కంటే తక్కువగా అమెరికాలో 38.4 కోట్ల జనాభా ఉండనుంది. 2100కల్లా 51.1 కోట్ల జనాభాతో మూడో అతిపెద్ద దేశంగా పాక్ అవతరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment