జనాభా పెరుగుదలలో ఉత్తరప్రదేశ్, బిహార్ వాటా 33 శాతం
ఉత్తర, తూర్పు భారత్‌లోనే 52 శాతం జనాభా
దక్షిణాదిలో తగ్గిన జనాభా వృద్ధి రేటు
ఎస్‌బీఐ ఎకనామిక్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతుండగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం తగ్గేదే లేదంటున్నాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎకనామిక్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక వెల్లడించింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జనాభా లెక్కలకు ముందస్తుగా.. ‘ద ఫైన్ ప్రింట్స్ ఆఫ్ రేపిడ్లీ ఛేంజింగ్ నేషన్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. 2001–2011 మధ్య దేశ జనాభా వృద్ధి రేటు 1.63 శాతం ఉండగా.. 2011–24లో 1.2 శాతానికి తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గనుండగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 6.4 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతోందని వెల్లడించింది. పెరిగిన జనాభాలో 33 శాతం కేవలం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. అలాగే దేశంలో 52 శాతం జనాభా ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లోనే ఉందని నివేదిక తెలిపింది. దేశంలో 64.4 శాతం మంది పనిచేసే వయసులో ఉన్నారని.. 2031 నాటికి 65.2 శాతానికి పెరిగే అవకాశముందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment