![Population of Telangana is 4 crore plus - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/11/niti.jpg.webp?itok=Yqw6CZZE)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనాభా ప్రస్తుతం 4.10 కోట్లు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.6గా అంచనా వేసినట్టు తెలిపింది. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరిస్తామని తెలిపింది. స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా కుటుంబ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయాలని ఆ శాఖ కోరింది.
రెండు విడతలుగా పక్షోత్సవాలు
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతలుగా పక్షోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి పక్షోత్సవం ఈ నెల 27 నుండి జూలై 10వ తేదీ వరకు, రెండో పక్షోత్సవం జూలై 11 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి పక్షం రోజుల్లో జనాభా పెరుగుదల, దానివల్ల కలిగే అనర్ధాల గురించి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో పక్షోత్సవంలో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ తాత్కాలిక పద్ధతులు, కుటుంబ నియంత్రణకు శాశ్వత పద్ధతులతో క్యాంప్‌లు నిర్వహిస్తారు.
కాపర్–టిపై అవగాహన
ఈ క్యాంపుల్లో అర్హులైన పురుషులకు వేసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ప్రసవం అయిన 48 గంటల్లో వేసే కాపర్–టి గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కాపర్–టి 10 సంవత్సరాల వరకు కూడా పని చేస్తుంది. దీనివల్ల బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండటమే కాక అధిక ప్రమాదం గల గర్భములను, మాతృ మరణాలను నివారించవచ్చు. ఈ సేవలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు
శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయిన వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన అంతర ఇంజెక్షన్ వేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. గతేడాది ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న స్త్రీల సంఖ్య 1,14,141, వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న పురుషుల సంఖ్య 3,229 అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ అదనపు సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment