
ప్రపంచ జనాభా కోటి నుంచి వంద కోట్లకు చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. కానీ ఎప్పుడైతే సైన్సు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గి, జన విస్ఫోటనం పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ మార్కుకు చేరుకుంది. ఇది 2030లో సుమారు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. మనిషి సగటు జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 నుండి 2019 వరకు 72.6 ఏళ్లకు పెరిగింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా 1980లలో వన్–చైల్డ్ విధానం అమలు చేయడానికి ముందు జన్మించిన తరాలు నేడు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. రాబోయే పదేళ్ళలో 55 అంతకంటే ఎక్కువ వయసు గల 12.39 కోట్ల మంది అక్కడ ఉండబోతున్నారు. చైనా జనాభా సగటు వయసు 1990లో 25 ఏళ్లు ఉండగా, 2020లో 38 ఏళ్లకు పెరిగింది. జనాభా సంక్షో భాన్ని నివారించడానికి దశాబ్దాల నాటి వన్–చైల్డ్ పాలసీని సడలించి నప్పటికీ, చైనా జనన రేటు 2017 నుండి స్థిరంగా క్షీణించింది. ప్రధాన నగరాల్లో పిల్లలను పెంచడానికి అధిక వ్యయంతో పోరాడుతున్న జంటలు, మహిళా సాధికారత పెరగడం వల్ల సహజంగానే ప్రసవాలను ఆలస్యం చేయడం లేదా నివారించడం దీనికి కారణం. జనాభా నియంత్రణ విధానాన్ని తీసివేస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వానికి జనాభా శాస్త్రవేత్తలు సూచించారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ టెక్నాలజీ సాయంతో ప్రతికూల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చుననే వాదన కూడా చైనాలో ఉంది.
మరోవైపు 2027 నాటికి చైనా జనాభాను భారతదేశం అధిగమిస్తుందని అంచనా. అయితే భారతదేశంలో ప్రపంచం లోనే అత్యధిక కౌమారులు, యువకులు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం, భారతదేశంలో ప్రతి ఐదవ వ్యక్తి కౌమార దశలో (10–19 సంవత్సరాలు) ఉన్నారు. మొత్తం 23.65 కోట్లు. అయితే దేశ భవిష్యత్తు కార్మికుల సంఖ్య పెంచడం కంటే, ప్రతి కార్మికుడి నైపుణ్యాలు, ఉత్పత్తి విలువను పెంచడం మీద ఆధారపడి ఉంటుంది. స్వాతంత్య్ర కాలంలో దేశ జనాభా 35 కోట్లు. అప్పటి నుండి నాలుగు రెట్లు పెరిగింది. 2019లో ఇది 1.37 బిలియన్లు. జనాభా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. అధిక జనాభా వల్ల సహజ వనరులను వేగంగా వినియోగించుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా పెరుగుతున్న జనాభా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దృష్ట్యా 2019 ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ’జనాభా విస్ఫోటనం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని ప్రకటించారు. జనాభా విషయంలో సామాజిక అవగాహన చాలా అవసరమని నొక్కి వక్కా ణించారు.
దేశాల మధ్య జనాభా అసమతుల్యత కారణంగా విపత్కర పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒక రాష్ట్రం, దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా పటిష్టమైన విధానాన్ని అవలంబిం చాలి. తద్వారా పటిష్టమైన మానవ వనరులను ఏర్పరుచుకోవడా నికి అవకాశం ఉంటుంది. అది ప్రకృతి పైన భారాన్ని తగ్గించి, మానవ, జీవజాతుల శ్రేయస్సుకు దోహదకారి అవుతుంది.
చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్,
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘ 91825 52078
(నేడు ప్రపంచ జనాభా దినోత్సవం)