భారత్‌ జనాభా పెరుగుదలలో అసమతుల్యం | Imbalanced Population Increasing In North And South India | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 11 2018 10:49 PM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

Imbalanced Population Increasing In North And South India - Sakshi

జనాభాతో భూగోళం కిటకిటలాడిపోతోంది. ప్రతీ ఏడాది అదనంగా 13 కోట్ల మంది పుట్టుకొస్తూ ఉండడంతో ఈ ఆధునిక కాలంలో కూడా కుటుంబ నియంత్రణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఈ ఏడాది కూడా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణ మానవ హక్కు అన్న నినాదాన్ని యూఎన్‌ ప్రచారం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య జనాభా పెరుగుదల ఏకరీతిలో లేకపోవడం, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ యువతరం ఎక్కువగా ఉంటే, యూరప్‌ దేశాల్లో జనాభా పెరుగుదల ఆగిపోయి వృద్ధతరం పెరిగిపోతోంది. ఈ అసమతుల్యత రకరకాల సవాళ్లను విసురుతోంది. 

క్రాస్‌ రోడ్స్‌లో భారత్‌ 
భారత్‌లో వివిధ రాష్ట్రాల మధ్య జనాభా ఏకరీతిలో పెరగకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో యువతరం ఉరకలేస్తూ ఉంటే, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. ఉత్పాదక రంగంలో భాగస్వామ్యులయ్యే జనాభా (15నుంచి 64 ఏళ్ల వయసు) కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా,  పని చెయ్యలేని జనాభా (14 ఏళ్ల కన్నా తక్కువ, 65 ఏళ్లకు పైన ఉన్నవారు) మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.  

కేరళ, పంజాబ్‌, చండీగఢ్‌లో సంతాన సాఫల్య రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల మానవ వనరుల సమస్యని ఎదుర్కొంటూ ఉంటే, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం వంటి రాష్ట్రాల్లో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. భారత్‌ జనాభాలో 44శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉంది. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కారణంగానే 2024 నాటికే చైనాను అధిగమిస్తామనే అంచనాలున్నాయి. భారత్‌ జనాభాలో 27 శాతం 14 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే, 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న జనాభా 64.7శాతంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ వెల్లడించింది.

ఇక 60 ఏళ్లకు పై బడిన జనాభా భారత్‌లో 2016 నాటికి 8.3 శాతం ఉంటే, 2050 నాటికి 19 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నాయి. సంతాన సాఫల్య రేటులో (ఒక మహిళ ఎంతమంది పిల్లల్ని కంటోందనే విషయం  ఆధారంగా అంచనా వేస్తారు)  తేడాల కారణంగా మన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తీరు ఏకరీతిగా ఉండడం లేదు. 2006లో 2.7 గా ఉన్న సంతాన సాఫల్య రేటు 2016లో  2.2 కి తగ్గింది. పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరితనం ఎదుర్కోవడం, వృద్ధ్యాప్యంలో చూసే దిక్కులేక వయసు మీద పడిన వారికి  సమస్యలు ఎక్కువైపోతున్నాయి.

వయోవృద్ధులు పెరిగిపోవడం వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్‌ ఇక సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు తరుముకొస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘వయోవృద్ధుల సంరక్షణ, ఒంటరిగా ఉండేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రక్షణ బడ్జెట్‌ కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేస్తున్నాయే తప్ప జనాభాలో అసమతుల్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు‘ అని మానవ వనరుల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక జనాభా తక్కువగా ఉన్న  రాష్ట్రాల్లో విద్య, ఉపాధి, జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆయా ప్రాంతాలకు వలసలు పెరిగిపోతున్నాయి. పేదరికంలో మగ్గిపోతున్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి పంజాబ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోతున్నాయి. అసంఘటిత రంగంలో వలసదారులు పెరిగిపోయి స్థానికులకు, వారికి మధ్య ఘర్షణలు ప్రభుత్వాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 

  • ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు
  • ప్రతీ నిముషానికి 250 మంది జననం
  • 2024 నాటికే చైనా జనాభాను దాటేయనున్న భారత్‌ 
  • 2050 నాటికి  భారత్‌లో 160 కోట్లకు పైగా జనాభా
  • 2050 నాటికి భారత్‌ జనాభాలో 65 శాతం మాత్రమే చైనా జనాభా ఉంటుందనే అంచనాలు 
  • అమెరికన్ల కంటే నైజీరియన్లు ఎక్కువగా ఉంటారు
  • గత 200 ఏళ్లలో ప్రపంచ జనాభా 600 శాతం పెరుగుదల 
  • ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో జనాభా పెరుగుదల అత్యధికం
  • పశ్చియ యూరప్, రష్యా, జపాన్‌లలో జనాభా విపరీతంగా తగ్గిపోయి ఆ దేశాలకు మానవ వనరుల కొరత 
  • 2100 నాటికి భూమిపై ఉండే జనాభా 1100 కోట్లకి చేరుకుంటుందని ఒక అంచనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement