నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
దేశమంటే మట్టి కాదోయ్...దేశమంటే మనుషులోయ్...! మహాకవి గేయానికి
ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్...!!
అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు
మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరుస్తున్న దేశం మనది. ప్రగతి
ఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి
నైపుణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే
పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం
అవసరం. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం.
ఏయూక్యాంపస్ : విశాఖ నగరానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పట్టణంలో నివసించే వారిలో అధికశాతం మంది ఇతర ప్రాంతాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఆ ప్రత్యేకత. విద్య, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో ప్రజలు నగరానికి వలస వస్తున్నారు. స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, జింక్, పోర్ట్ ట్రస్ట్ వంటి ప్రభుత్వ సంస్థలు, కోస్ట్‌గార్డ్, డాక్‌యార్డ్ వంటి రక్షణ సంస్థలతో పాటు వేలాదిగా పరిశ్రమలు ఉన్నాయి. ఇపుడు నవ్యాంధ్రలో వాణిజ్య, పారిశ్రామిక రాజధానిగా విశాఖ ముందడుగు వేస్తోంది. దీంతో ఒకనాడు పట్టణం నగరమైంది...ఇపుడు...మహానగరమైంది. కష్టించి పనిచేసే తత్వం, సానుకూల దృక్పథం ఉన్నవారిని నగరం ఎంతో ఆకర్షిస్తోంది.
ట్రాఫిక్ పద్మవ్యూహం...
గతంలో నగరంలో ఏ ప్రాంతానికైనా పావు గంటలో చేరుకునే వీలుండేది. పెరుగుతున్న వాహనాలు, ప్రజల అవసరాల కారణంగా నగరంలో ట్రాఫిక్ నానాటికి పెరిగిపోతోంది. ఎన్‌ఏడీ నుంచి మద్దిలపాలెం కూడలి వరకు జాతీయ రహదారిపైన, నగరంలోను ప్రధాన కూడళ్లో సైతం సాయంత్రం వేళల్లో ప్రయాణించాలంటేనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో సరైన సాంకేతికత వినియోగించకపోవడం, ఇరుకు రోడ్డు వెరసి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అలాగే పెరుగుతున్న జనాభాతో శాంతి భధ్రతలను కాపాడడం సవాలుగా మారుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు సరిపడినన్ని పోలీస్‌స్టేషన్లు, సిబ్బంది సైతం లేకపోవడం మరో ప్రధాన సమస్య.
చదువుల కేంద్రం
కేవలం కొద్దిపాటి ప్రభుత్వం పాఠశాలలు, ఏవీఎన్, వీఎస్‌క్రిష్ణా ప్రభుత్వ కళాశాలతో ప్రారంభమైన విశాఖ విద్యా వ్యవస్థ నేడు ముప్ఫైకి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు, వందల్లో డిగ్రీ కళాశాలు, అదే స్థాయిలో ఇంటర్ కళాశాలలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలతో విరాజిల్లుతోంది. నవ్యాంధ్రకు పెద్దదిక్కుగా నిలుస్తున్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, గీతం విశ్వవిద్యాలయం, గాయత్రీ విద్యాసంస్థలు విశాఖను విద్యల రాజధానిగా నిలుపుతున్నాయి. వైద్య రంగంలో సైతం విశాఖ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అందుకోవడానికి, పోటీ పరీక్షల్లో తమ ప్రతిభను చూపడానికి మారుమూల గ్రామాల నుంచి యువతరం పెద్దసంఖ్యలో విశాఖకు తరలి వస్తుంటారు.
లింగ వివక్ష
విద్యావంతులు నివసించే నగరంలో లింగ నిష్పత్తి కొంత ఆందోళన కలిగించే విధంగా ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 977, చిన్నారుల లింగ నిష్పత్తి కేవలం 959 మాత్రమే ఉంది. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1003 మంది స్త్రీలు ఉంటున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతంలోనే స్త్రీ జనాభా ఎక్కువగా ఉందనేది దీని ద్వారా స్పష్టమవుతోంది. పట్టణ వాసులు ఆలోచన విధానంలో మార్పురావాలనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
స్వల్పంగా తగ్గిన వృద్ధి రేటు
దేశవ్యాప్తంగా పెద్ద పది పట్టణాలలో విశాఖ స్థానం కలిగి ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా నిలిచింది. నగరంలో 1991 నుంచి 2001 మధ్యకాలంలో జనాభా వృద్ధి రేటు 16.66 శాతం ఉండగా లింగ సమానత్వం 985గా ఉంది, 2011 పాటికి కొంత మేర వృద్ధిరేటు తగ్గి 11.89 శాతంగా ఉండి లింగ సమానత్వం 1003గా నమోదైంది.
అడుగంటుతున్న నీటి వనరులు
పెరుగుతున్న జనాభాకు అవసరమైన నీటి వనరులను అందించడం ఎంతో అవసరం. నాణ్యమైన నీటిని నిత్యం అందించడానికి ప్రస్తుతం ఉన్న జన వనరులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటిని శుభ్రం చేయక పోవడం, పూడికలు తొలగించి నిల్వ సామర్ధ్యాలను పెంచే చర్యలను తరచు చేపట్టాలి. దశాబ్ధాలుగా తూతూ మంత్రంగానే వీటిని పునరుద్దరించే చర్యలు చేస్తున్నారు. ప్రధాన నీటివనరులైన మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి జలాశయాలను సంరక్షించే చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలి. వర్షాభావ పరిస్థితులు తలెత్తినపుడు వీటి విలువ, ఆవశ్యకతను గుర్తించడం కంటే ముందుగానే మేలుకోవడం మేలు. అదే విధంగా ప్రతి ఇంటిలో వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలను తప్పని సరిగా అమలు జరపాల్సి ఉంది.
పెరుగుతున్న అసంఘటిత రంగం..
నగరంలో అధిక శాతం పరిశ్రమలల్లో, ఉపాధిని వెతుక్కుంటూ గ్రామీణ ప్రజలు వస్తున్నారు. వీరికి తగిన భద్రత, రక్షణ చర్యలు సదరు సంస్థలు కల్పించడం లేదు. అలాగే వీరికి వసతి, సంక్షేమ కార్యక్రమాల అమలు కల్పించడం సమస్యగా మారుతోంది. అలాగే పరిశ్రమల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టడం, కార్మికుల భద్రతకు, సంక్షేమానికి చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.
మౌలిక వసతులపై భారం...
విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని మోదీ వాక్కులు నేటికి కార్యరూపంలో దర్శనమివ్వడం లేదు. నగరం విస్తరిస్తూ సరిహద్దులను చెరిపేస్తూ నానాటికీ పెరిగిపోతోంది. దానికితోడు జనాభా పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగడం లేదు. జీవీఎంసీ, వుడా చక్కని ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్మార్ట్‌సిటీ మారేముందు మురికి వాడలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉంది.
అంకెల్లో విశాఖ
2011 జనాభా గణన ప్రకారం....
విశాఖ జనాభా : 17,30,320
పురుషులు : 8,75,199
స్త్రీలు : 8,55,121
అక్షరాస్యులు : 12,98,896
(సగటున 82.66 శాతం అక్షరాస్యత)