
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్ల కొత్త జీవితం
నెలరోజులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 39 మంది
ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధుల నిర్వహణ
ఫలితాన్నిస్తున్న నగర ట్రాఫిక్ విభాగం శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో సముచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుల మాదిరి ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ఎంపిక చేయడం ద్వారా ఉపాధి కల్పించాలని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంపిక, శిక్షణలో కట్టుదిట్టంగా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబర్ 4న గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కూడా ఇందులో పాలుపంచుకుంది.
సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అర్హులైన ట్రాన్స్‌జెండర్ల వివరాలను పోలీసులు సేకరించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు, (ఎస్టీలు 160 సెం.మీ) కలిగి ఉండాలనే నిబంధన విధించారు. శరీర దారుఢ్య పరీక్షల్లో భాగంగా 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 58 మంది హాజరు కాగా 44 మంది ఎంపికయ్యారు.
హావభావాల నుంచి అన్నీ మార్చి..
సిటీ ట్రాఫిక్ విభాగం ఆదీనంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు గోషామహల్ స్టేడియం కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 15 రోజుల ట్రైనింగ్‌లో నాలుగు రోజులు కేవలం వారి ప్రవర్తన మార్చడానికే వెచ్చించారు. ఈ ట్రాన్స్‌జెండర్లు ఏళ్ల తరబడి ఓ విధమైన హావభావాల ప్రదర్శన, విపరీత ప్రవర్తన, క్రమశిక్షణ లేని జీవనశైలికి అలవాటుపడ్డారు.
వీరిని పోలీసు విభాగంలోకి తీసుకుంటుండడం, అదీ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ట్రాఫిక్ వింగ్‌లో పని చేయించనుండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నడక, నడవడిక, హావభావాలు, మాట తీరే కాదు... ఆహారం తినే విధానాన్నీ చక్కదిద్దారు. వారిలో స్ఫూర్తి నింపడం కోసం వారికి హీరోయిన్లు, యాంకర్ల వీడియోలు చూపించారు. ఆపై ఐదో రోజు నుంచి ట్రాఫిక్ శిక్షణ మొదలైంది.
క్షేత్రస్థాయిలో సమర్థంగా విధులు
అంబర్‌పేట, బహదూర్‌పుర, బంజారాహిల్స్, బేగంపేట, బోయిన్‌పల్లి, చిక్కడపల్లి, చాంద్రాయణగుట్ట, చిలకలగూడ, జూబ్లీహిల్స్, కాచిగూడ, లంగర్‌హౌస్, మహంకాళి, మలక్‌పేట్, మారేడ్‌పల్లి, నల్లకుంట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, సంతోష్‌నగర్, తిరుమలగిరి, టోలిచౌకి.. ఈ 20 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోనూ వీరు క్షేత్రస్థాయి విధుల్లోనే ఉండటం గమనార్హం.
⇒ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల సేవలు అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పుడు అంతా తేలిగ్గా తీసుకున్నారు...
⇒ సిటీ పోలీసులు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మందిని ఎంపిక చేసిన తర్వాత శిక్షణ అయ్యే – వరకు వీళ్లు ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
⇒ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది విధుల్లో చేరనున్నారని తెలిశాక, వీళ్లు పట్టుమని పది రోజులు కూడా పని చేయరని, వివాదాలు తప్పవని భావించారు.
⇒ కానీ నెల రోజులుగా 38 మంది ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేస్తుంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
⇒ ఒకరిద్దరు ట్రాన్స్‌జెండర్లు భవిష్యత్తులో జరగబోయే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల్లోనూ పోటీపడేలా కోచింగ్ తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించడం మరింత ఆసక్తికరం.
వెన్నుతట్టి ప్రోత్సహించి..
ఎంపికైన 44 మందిలో 39 మంది మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన ఐదుగురూ అప్పటికే ఉన్న ఉద్యోగాల కారణంగా వెళ్లిపోయారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తుది జాబితా ఖరారు చేశారు. ‘సమాజంలో మీకు ఎదురవుతున్న అవమానాలు, మీ పట్ల వివక్షను చూసిన ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది.
మీ పని తీరుపైనే మీలాంటి ఇతరుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’అంటూ వెన్ను తట్టి హితవు పలికిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డిసెంబర్ 22న వీరి శిక్షణ పూర్తి అయినట్లు ప్రకటించారు. వీరి కవాతునూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో వీక్షించారు. అనంతరం డిసెంబర్ 26 నుంచి ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తమ కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పటికి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఈ ఉద్యోగం వదిలి వెళ్లగా...మిగిలిన వారు సమర్థంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment