assistants
-
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్‌రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్‌లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్‌కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ ఈపీడీసీఎల్‌లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్‌లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు తెలిపారు. -
సమ్మెకు దిగిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు
హన్మకొండ : జిల్లాలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ–డీఆర్)లు సమ్మెకు దిగారు. కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన వారు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో చివరకు సమ్మె అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలు గురువారం నుంచి సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా నియమితులైన తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఎన్నిమార్లు వినతిపత్రాలు అందించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం ఇప్పటివరకు రూ.6వేల గౌరవ వేతనం ఇస్తోందని వాపోయారు. ఇకనైనా తమను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని, మూడేళ్ల సర్వీస్ పూర్తయిన వారకి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఇజ్జగిరి సతీష్, నాయకులు పూజారి సురేష్, ఎడ్ల రవి, దివ్య, శ్వేత, పద్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
బదిలీలకు రాజకీయ గండం
నెల్లూరు : (టౌన్) ఎప్పుడో జరగాల్సిన ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలకు రాజకీయ గండం ఏర్పడింది. రాజకీయ జోక్యంతో బదిలీలు ఆగిపోయాయి. బదిలీలు జరగకపోతే తాము డిప్యూటీ తహశీల్దార్లుగా ఉద్యోగోన్నతి కోల్పోతామని సీనియర్ అసిస్టెంట్లు, జరిగితే సీనియార్టీ కోల్పోతామని ఆర్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితమే బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ కూడా పూర్తయినప్పటికీ, సీనియర్ అసిస్టెంట్లు ఆప్షన్లు ఎంచుకున్నప్పటికీ కలెక్టర్ బదిలీలపై ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రాజకీయ జోక్యంతో ఆర్ఐలు బదిలీలను అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ తహశీల్దారులుగా ఉద్యోగోన్నతి పొందాలంటే కనీసం రెండేళ్లు ఆర్ఐలుగా పనిచేసిన అనుభవం ఉండి తీరాలనే నిబంధన ఉంది. మండల రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లో ఏళ్ల తరబడి సీనియర్ అసిస్టెంట్లుగా అనేక మంది పనిచేస్తున్నారు. ఇదే క్యాడర్ అర్హత కలిగిన వారు గతంలో జూని యర్ అసిస్టెంట్ల నుంచి నేరుగా ఉద్యోగోన్నతిపై ఆర్ఐలు (రెవెన్యూ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేయని 25 మంది ఆర్ఐలను ప్రస్తుతం సీని యర్ అసిస్టెంట్లుగా బదిలీ చేయాలి. ఇప్పటి వరకు ఆర్ఐలుగా పనిచేయని 20 మంది సీనియర్ అసిస్టెంట్లను ఆర్ఐలుగా బదిలీ చేయాల్సి ఉంది. కలెక్టర్‌కు తలనొప్పిగా మారిన వైనం ఆర్ఐలకు జీతంతో పాటు పైఆదాయం, గౌరవ, మర్యాదలు ఎక్కువే. పైగా రాజకీయ నాయకులతో తత్సం బంధాలు ఉంటాయి. నాలుగు రాళ్లు వెనుకేసుకునే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్న పలువురు ఆర్ఐలు సీనియర్ అసిస్టెంట్లుగా వెళ్లేం దుకు సిద్ధపడటం లేదని ప్రచారం జరుగుతోంది. అనేక మంది ఆర్ఐలు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి వద్దకు వెళ్లి తమ బదిలీలు ఆపాలని పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల నుంచి ఆర్ఐలు అధికార పార్టీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు నేరుగా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఫలానా ఆర్ఐను బదిలీ చేయొద్దని మౌఖికంగా హుకుం జారీ చేస్తున్నారట. ఒక వేళ బదిలీ చేసినా పక్క మండలంలో ఆర్ఐగానే బదిలీ చేయాలని, సీనియర్ అసిస్టెంట్‌గా చేయొద్దని సూచనలిస్తున్నారట. రాజకీయ జోక్యం పెరిగే సరికి బదిలీల వ్యవహారం కలెక్టర్‌కు తల నొప్పులు తెచ్చిపెడుతున్నాయని కలెక్టరేట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఆర్వో పరిధిలోనే బదిలీలు జరగాలి వాస్తవానికి డీఆర్వో నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే బదిలీలు జరగాలి. కాకుంటే డీఆర్వో చేసిన బదిలీల ఫైల్‌పై కలెక్టర్ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ తలనొప్పులు పడలేక డీఆర్వో ఈ బదిలీల జోలికి పోలేదని తెలిసింది. డిపార్టుమెంట్ హెడ్‌గా నేరుగా కలెక్టర్ బదిలీలు చేద్దామన్నా సిఫార్సులు ఆగలేదు. చివరకు బుధవారం రాత్రి కలెక్టర్ టేబుల్ వద్దకు సంబంధిత అధికారులు బదిలీల ఫైల్ తీసుకెళ్లినా ప్రస్తుతానికి కలెక్టర్ పక్కన పెట్టమన్నారట. దీంతో తమకు ఉద్యోగోన్నతిలో అన్యాయం జరుగుతుందని సీనియర్ అసిస్టెంట్లు వాపోతున్నారు. రెండు రోజుల్లో లాటరీ ద్వారా బదిలీలు : బదిలీలకు సంబంధించిన ఫైలుపై కలెక్టర్ కసరత్తు చేస్తున్నారు. లాటరీ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ నిర్ణయించారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ద్వారా బదిలీలు చేపడుతాం. - నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి