నెల్లూరు : (టౌన్) ఎప్పుడో జరగాల్సిన ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలకు రాజకీయ గండం ఏర్పడింది. రాజకీయ జోక్యంతో బదిలీలు ఆగిపోయాయి. బదిలీలు జరగకపోతే తాము డిప్యూటీ తహశీల్దార్లుగా ఉద్యోగోన్నతి కోల్పోతామని సీనియర్ అసిస్టెంట్లు, జరిగితే సీనియార్టీ కోల్పోతామని ఆర్‌ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితమే బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ కూడా పూర్తయినప్పటికీ, సీనియర్ అసిస్టెంట్‌లు ఆప్షన్లు ఎంచుకున్నప్పటికీ కలెక్టర్ బదిలీలపై ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రాజకీయ జోక్యంతో ఆర్‌ఐలు బదిలీలను అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డిప్యూటీ తహశీల్దారులుగా ఉద్యోగోన్నతి పొందాలంటే కనీసం రెండేళ్లు ఆర్‌ఐలుగా పనిచేసిన అనుభవం ఉండి తీరాలనే నిబంధన ఉంది. మండల రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో ఏళ్ల తరబడి సీనియర్ అసిస్టెంట్‌లుగా అనేక మంది పనిచేస్తున్నారు. ఇదే క్యాడర్ అర్హత కలిగిన వారు గతంలో జూని యర్ అసిస్టెంట్ల నుంచి నేరుగా ఉద్యోగోన్నతిపై ఆర్‌ఐలు (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్)గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్ అసిస్టెంట్‌లుగా పనిచేయని 25 మంది ఆర్‌ఐలను ప్రస్తుతం సీని యర్ అసిస్టెంట్‌లుగా బదిలీ చేయాలి. ఇప్పటి వరకు ఆర్‌ఐలుగా పనిచేయని 20 మంది సీనియర్ అసిస్టెంట్లను ఆర్‌ఐలుగా బదిలీ చేయాల్సి ఉంది.
కలెక్టర్‌కు తలనొప్పిగా మారిన వైనం
ఆర్‌ఐలకు జీతంతో పాటు పైఆదాయం, గౌరవ, మర్యాదలు ఎక్కువే. పైగా రాజకీయ నాయకులతో తత్సం బంధాలు ఉంటాయి. నాలుగు రాళ్లు వెనుకేసుకునే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్న పలువురు ఆర్‌ఐలు సీనియర్ అసిస్టెంట్‌లుగా వెళ్లేం దుకు సిద్ధపడటం లేదని ప్రచారం జరుగుతోంది. అనేక మంది ఆర్‌ఐలు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి వద్దకు వెళ్లి తమ బదిలీలు ఆపాలని పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల నుంచి ఆర్‌ఐలు అధికార పార్టీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు నేరుగా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఫలానా ఆర్‌ఐను బదిలీ చేయొద్దని మౌఖికంగా హుకుం జారీ చేస్తున్నారట.
ఒక వేళ బదిలీ చేసినా పక్క మండలంలో ఆర్‌ఐగానే బదిలీ చేయాలని, సీనియర్ అసిస్టెంట్‌గా చేయొద్దని సూచనలిస్తున్నారట. రాజకీయ జోక్యం పెరిగే సరికి బదిలీల వ్యవహారం కలెక్టర్‌కు తల నొప్పులు తెచ్చిపెడుతున్నాయని కలెక్టరేట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
డీఆర్వో పరిధిలోనే బదిలీలు జరగాలి
వాస్తవానికి డీఆర్వో నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే బదిలీలు జరగాలి. కాకుంటే డీఆర్వో చేసిన బదిలీల ఫైల్‌పై కలెక్టర్ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ తలనొప్పులు పడలేక డీఆర్వో ఈ బదిలీల జోలికి పోలేదని తెలిసింది. డిపార్టుమెంట్ హెడ్‌గా నేరుగా కలెక్టర్ బదిలీలు చేద్దామన్నా సిఫార్సులు ఆగలేదు. చివరకు బుధవారం రాత్రి కలెక్టర్ టేబుల్ వద్దకు సంబంధిత అధికారులు బదిలీల ఫైల్ తీసుకెళ్లినా ప్రస్తుతానికి కలెక్టర్ పక్కన పెట్టమన్నారట. దీంతో తమకు ఉద్యోగోన్నతిలో అన్యాయం జరుగుతుందని సీనియర్ అసిస్టెంట్లు వాపోతున్నారు.
రెండు రోజుల్లో
లాటరీ ద్వారా బదిలీలు :
బదిలీలకు సంబంధించిన ఫైలుపై కలెక్టర్ కసరత్తు చేస్తున్నారు. లాటరీ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ నిర్ణయించారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ద్వారా బదిలీలు చేపడుతాం.
- నాగేశ్వరరావు,
జిల్లా రెవెన్యూ అధికారి
బదిలీలకు రాజకీయ గండం
Published Fri, Aug 1 2014 2:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement