సాక్షి, నెల్లూరు: ఎన్నికల కోలాహలం ముగిసింది. నిన్నమొన్నటి వరకు వివిధ రకాల విధుల్లో నిమగ్నమై బిజీబిజీగా గడిపిన అధికారులు, సిబ్బంది ఇప్పుడు బదిలీలపై దృష్టి సారించారు. గతంలో తాము పనిచేసిన జిల్లాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు రెండేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా జిల్లా నుంచి 50 మంది తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు బదిలీ అయ్యారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు ఇక్కడకు బదిలీపై వచ్చారు. సుమారు మూడున్నర నెలలపాటు తీరిక లేకుండా పనిచేసిన వీరు ప్రస్తుతం ఎప్పుడెప్పుడు బదిలీ చేయించుకుందామని ఎదురుచూస్తున్నారు. అలాగే ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు సైతం తిరిగి నెల్లూరుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. సీమాంధ్ర కొత్త రాష్ట్రం ఏర్పాటుకావడం, రాజధాని ఎక్కడ ఏర్పాటుచేయాలనే విషయమై రాష్ట్రంలో తీవ్రంగా చర్చలు జరగడం, అందుకు సం బంధించిన సర్వేలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. వారితో నేరుగా సంబంధాలు లేని కొందరు అధికారులు ద్వితీయశ్రేణి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
తాము జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసేది లేదనే విషయం ముందుగానే తెలిసిన వీరంతా ముఖ్యమైన ఫైళ్లను చూసే విషయంలో కాసింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కేవలం మొక్కుబడిగా మాత్రమే చిన్నచిన్న వ్యవహారాలను చక్కబెడుతున్నారు తప్ప ప్రధానమైన ఫైళ్ల జోలికి వెల్లడంలేదు. దీంతో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనులకు సంబంధించిన ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. ఇప్పుడిప్పుడే అధికారులు, సిబ్బంది కార్యాలయాలకొస్తూ ఫైళ్లని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఓ వైపు విధి నిర్వహణ వైపు దృష్టిసారించినా మరో వైపు వారి మనసంతా తాము కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకునే పనిపైనే పెట్టారు.
మనసంతా బదిలీపైనే
Published Sun, May 25 2014 2:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement