సమ్మెకు దిగిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు
Published Fri, Sep 2 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
హన్మకొండ : జిల్లాలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ–డీఆర్)లు సమ్మెకు దిగారు. కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన వారు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో చివరకు సమ్మె అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్ వీఆర్‌ఏలు గురువారం నుంచి సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్ మాట్లాడుతూ ఏపీపీఎస్‌సీ ద్వారా నేరుగా నియమితులైన తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఎన్నిమార్లు వినతిపత్రాలు అందించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం ఇప్పటివరకు రూ.6వేల గౌరవ వేతనం ఇస్తోందని వాపోయారు. ఇకనైనా తమను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని, మూడేళ్ల సర్వీస్ పూర్తయిన వారకి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఇజ్జగిరి సతీష్, నాయకులు పూజారి సురేష్, ఎడ్ల రవి, దివ్య, శ్వేత, పద్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement