revenue village
-
తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి
పాలకవీడు (హుజూర్నగర్) : గ్రామపంచాయతీలుగా మార్చిన తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని మాజీ మంత్రి రవీంద్రనాయక్ అన్నారు. మండలంలోని జాన్పహాడ్ దర్గా వద్ద జేపీఎస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 72ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 10కోట్ల మంది గిరిజనులు ఉన్నారని వీరంతా గోర్బోలీ భాష మాట్లాడుతున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో 40లక్షల మంది గిరిజనులు ఉన్నారని అన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గిరిజనులను ఎస్టీలుగా గుర్తించారని మిగిలిన రాష్ట్రాల్లో మాత్రంషెడ్యూల్ కులాలుగా పరిగణిస్తున్నారన్నారు. దేశంలో 20శాతం ఉన్న ఇతర ఆదివాసీ కులాలను 80శాతం ఉన్న గిరిజనుల్లో వీరిని కలపడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై సుదీర్ఘ పోరాటం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంబించాలని కోరారు. గిరిజన యువకులకు వెంటనే నిరుద్యోగ భృతి అందించి వారు నిస్పృహలకు లోను కాకుండా చూడాలన్నారు. నేటి నుంచి తలపెట్టిన గిరిజన చైతన్య యాత్రను వాయిదా వేస్తున్నట్లు తిరిగి ఆగస్టు 15న ఈ గిరిజన ప్రజాచైతన్య యాత్రను పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు నాగునాయక్, మధునాయక్, పీకేనాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు, హరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
దశాబ్దాలు గడిచినా గుర్తించరా..?
► ధర్మారం పంచాయతీని పట్టించుకోని అధికారులు ► రెవెన్యూ గ్రామంగా మార్చాలని గ్రామస్తుల వేడుకోలు ధర్మారం: మూడు దశాబ్ధాల క్రితం మండల కేంద్రంగా ధర్మారం ఏర్పడినా నేటికీ రెవెన్యూ గ్రామంగా గుర్తింపు పొందలేదు. భూసంబంధ సమస్యలు, ఇతర రికార్డుల కోసం స్థానికులు ఎక్కడికెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను సంప్రదిస్తే కానీ వారికి అసలు విషయం తెలియడం లేదు. ఇదే మండలంలోని బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామపరిధిలో ధర్మారం ఉందని తెలుసుకొని అవాక్కవుతున్నారు. అవసరాలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని బొమ్మారెడ్డిపల్లికి వెళ్లాల్సి రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1981కు ముందు బొమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ధర్మారం ఉండేది. ఆ తర్వాత ధర్మారంను గ్రామపంచాయతీగా ప్రభుత్వం గుర్తించింది. మండల వ్యవస్థ ఆవిర్భవించాక ధర్మారం గ్రామపంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. కార్యాలయాలన్నీ ధర్మారంలోనే.. మండల కేంద్రంగా ఆవిర్భవంచాక ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయ మార్కెట్, పశువైద్యాధికారి, వ్యవసాయ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ధర్మారంలోనే ఏర్పాటు చేశారు. కానీ ధర్మారంను బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలోనే కొనసాగిస్తున్నారు. బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ధర్మారం, ఎర్రగుంటపల్లి, కొత్తపల్లి, జక్కన్నపల్లి గ్రామాలున్నాయి. ఇందులో కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాలు చిన్న గ్రామపంచాయతీలు. ధర్మారం గ్రామపంచాయతీ మండల కేంద్రమైనప్పటికీ ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయలేదు. మిగతా మూడు గ్రామాలకు సైతం సమస్యగా మారింది. ల్యాండు వాల్యూయేషన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పేదరైతులు భూక్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉండి భారంగా మారుతుంది. సమస్యలు అనేకం.. కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలన్నింటినీ కలిపి ఒకే రెవెన్యూ గ్రామంగా పరిగణిస్తుండటంతో పలుసమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. రెవెన్యూ గ్రామానికి ఒక్క వీఆర్వోనే కేటాయిస్తుండటంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. నాలుగు గ్రామాలకు ఒక్క వీఆర్వో ఉండటంతో ఏ గ్రామరైతులకు అందుబాటులో ఉండటం లేదు. పహాణీ పత్రాలు, జమాబందీ తదితర భూసంబంధ సమస్యలు ఎదురైన సందర్భాల్లో రైతులు వీఆర్వో కోసం పరుగులు పెడుతున్నారు. భూరిజిస్ట్రేషన్ ఫీజులు అధిక శాతం బొమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీలోనే జమవుతుండటంతో ధర్మారం పంచాయతీ ఆదాయం కొంతవరకు కోల్పోతుంది. ప్రతీ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తే ఆదాయంతో పాటు సమస్యలు తలెత్తవని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ గ్రామంగా మార్చాలి ధర్మారం గ్రామపంచాయతీని రెవెన్యూ గ్రామంగా మార్చి రైతులకు సమస్యలు లేకుండా చూడాలి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన స్పందించటం లేదు. స్థానిక నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలి. – బొల్లి స్వామి ఎంపీటీసీ ధర్మారం ఇద్దరు వీఆర్వోలను నియమించాలి బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామం కింద నాలుగు గ్రామాలుండటంతో రెవెన్యూపరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇద్దరు వీఆర్వోలను నియమిస్తే ఇబ్బందులు తొలగుతాయి. నాలుగు గ్రామాలకు ఒక్క వీఆర్వో ఉండటంతో ధర్మారం రావల్సి వస్తోంది. –ఎగ్గెల స్వామి, సర్పంచు, బొమ్మారెడ్డిపల్లి -
సమ్మెకు దిగిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు
హన్మకొండ : జిల్లాలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ–డీఆర్)లు సమ్మెకు దిగారు. కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన వారు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో చివరకు సమ్మె అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలు గురువారం నుంచి సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా నియమితులైన తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఎన్నిమార్లు వినతిపత్రాలు అందించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం ఇప్పటివరకు రూ.6వేల గౌరవ వేతనం ఇస్తోందని వాపోయారు. ఇకనైనా తమను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని, మూడేళ్ల సర్వీస్ పూర్తయిన వారకి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఇజ్జగిరి సతీష్, నాయకులు పూజారి సురేష్, ఎడ్ల రవి, దివ్య, శ్వేత, పద్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.