దశాబ్దాలు గడిచినా గుర్తించరా..?
► ధర్మారం పంచాయతీని పట్టించుకోని అధికారులు
► రెవెన్యూ గ్రామంగా మార్చాలని గ్రామస్తుల వేడుకోలు
ధర్మారం: మూడు దశాబ్ధాల క్రితం మండల కేంద్రంగా ధర్మారం ఏర్పడినా నేటికీ రెవెన్యూ గ్రామంగా గుర్తింపు పొందలేదు. భూసంబంధ సమస్యలు, ఇతర రికార్డుల కోసం స్థానికులు ఎక్కడికెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను సంప్రదిస్తే కానీ వారికి అసలు విషయం తెలియడం లేదు. ఇదే మండలంలోని బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామపరిధిలో ధర్మారం ఉందని తెలుసుకొని అవాక్కవుతున్నారు. అవసరాలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని బొమ్మారెడ్డిపల్లికి వెళ్లాల్సి రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1981కు ముందు బొమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ధర్మారం ఉండేది. ఆ తర్వాత ధర్మారంను గ్రామపంచాయతీగా ప్రభుత్వం గుర్తించింది. మండల వ్యవస్థ ఆవిర్భవించాక ధర్మారం గ్రామపంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు.
కార్యాలయాలన్నీ ధర్మారంలోనే..
మండల కేంద్రంగా ఆవిర్భవంచాక ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయ మార్కెట్, పశువైద్యాధికారి, వ్యవసాయ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ధర్మారంలోనే ఏర్పాటు చేశారు. కానీ ధర్మారంను బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలోనే కొనసాగిస్తున్నారు. బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ధర్మారం, ఎర్రగుంటపల్లి, కొత్తపల్లి, జక్కన్నపల్లి గ్రామాలున్నాయి. ఇందులో కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాలు చిన్న గ్రామపంచాయతీలు. ధర్మారం గ్రామపంచాయతీ మండల కేంద్రమైనప్పటికీ ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయలేదు. మిగతా మూడు గ్రామాలకు సైతం సమస్యగా మారింది. ల్యాండు వాల్యూయేషన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పేదరైతులు భూక్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉండి భారంగా మారుతుంది.
సమస్యలు అనేకం..
కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలన్నింటినీ కలిపి ఒకే రెవెన్యూ గ్రామంగా పరిగణిస్తుండటంతో పలుసమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. రెవెన్యూ గ్రామానికి ఒక్క వీఆర్వోనే కేటాయిస్తుండటంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. నాలుగు గ్రామాలకు ఒక్క వీఆర్వో ఉండటంతో ఏ గ్రామరైతులకు అందుబాటులో ఉండటం లేదు. పహాణీ పత్రాలు, జమాబందీ తదితర భూసంబంధ సమస్యలు ఎదురైన సందర్భాల్లో రైతులు వీఆర్వో కోసం పరుగులు పెడుతున్నారు. భూరిజిస్ట్రేషన్ ఫీజులు అధిక శాతం బొమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీలోనే జమవుతుండటంతో ధర్మారం పంచాయతీ ఆదాయం కొంతవరకు కోల్పోతుంది. ప్రతీ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తే ఆదాయంతో పాటు సమస్యలు తలెత్తవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెవెన్యూ గ్రామంగా మార్చాలి
ధర్మారం గ్రామపంచాయతీని రెవెన్యూ గ్రామంగా మార్చి రైతులకు సమస్యలు లేకుండా చూడాలి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన స్పందించటం లేదు. స్థానిక నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలి.
– బొల్లి స్వామి ఎంపీటీసీ ధర్మారం
ఇద్దరు వీఆర్వోలను నియమించాలి
బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామం కింద నాలుగు గ్రామాలుండటంతో రెవెన్యూపరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇద్దరు వీఆర్వోలను నియమిస్తే ఇబ్బందులు తొలగుతాయి. నాలుగు గ్రామాలకు ఒక్క వీఆర్వో ఉండటంతో ధర్మారం రావల్సి వస్తోంది.
–ఎగ్గెల స్వామి, సర్పంచు, బొమ్మారెడ్డిపల్లి