హే..మగిరి మోసం | Private Bank Cheated Villagers | Sakshi
Sakshi News home page

హే..మగిరి మోసం

Published Wed, Apr 4 2018 9:54 AM | Last Updated on Wed, Apr 4 2018 9:54 AM

Private Bank Cheated Villagers - Sakshi

న్యాయం చేయాలంటూ ఎస్‌ఐకు వినతి పత్రం అందజేస్తున్న బాధితులు

గ్రామీణుల అమాయకత్వాన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.  కొన్నేళ్ల పాటు నమ్మకంగా ఉంటూ అనంతరం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లలో డబ్బు వసూలు బోర్డులు తిప్పేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌ అవసరాలకు, పెళ్లి ఖర్చులకు, ఉన్నత చదువులకు ఇలా అష్ట కష్టాలు పడి, పైసా పైసా కూడబెట్టిన సొమ్మును దిగమింగి అమాయకుల ఉసురు పోసుకుంటున్నారు.

పెద్దతిప్పసముద్రం:(చిత్తూరు):‘హేమగిరి’ ప్రైవేటు బ్యాంకు సంస్థ వలలో చిక్కుకుని పలువురు గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ వద్ద డబ్బు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ వరికసువుపల్లికి చెందిన పలువురు బాధితులు మంగళవారం స్థానిక ఎస్‌ఐ రవికుమార్‌కు  ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ... కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కామాక్షిపాళ్యం ప్రధాన కేంద్రంగా ‘హేమగిరి మల్టీపర్పస్‌ కో– ఆపరేటివ్‌ సొసైటి లిమిటెడ్‌’ పేరుతో ఓ సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు కర్ణాటకలోని చిక్‌బళ్లాపురం, శివమొగ్గ, చింతామణి, చిక్‌మంగళూర్, హోస్పేట్, తుమ్‌కూర్, హాసన్, చిత్రదుర్గ, దొడ్డ బళ్లాపురం లాంటి పట్టణాల్లో సబ్‌ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశా రు. సబ్‌ బ్రాంచీలలో వుండే సంస్థ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై ఎంతో నమ్మకంగా వున్న వారిని ఏజెంట్లుగా నియమించారు.

మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గుగ్గిళ్లపల్లికి చెందిన రామచంద్ర అనే వ్యక్తిని ఇక్కడ ఏజెంటుగా నియమించారు. హేమగిరి సంస్థలో పెట్టుబడులు పెట్టే డిపాజిటర్లకు, నెలవారి కంతులను చెల్లించే వారికి సంస్థ ద్వారా లబ్ధి చేకూరే వడ్డీ, రుణ సదుపాయాలను రామచంద్ర వివరించారు. దీంతో తామంతా తక్కువ వ్యవధిలో అధిక వడ్డీ వస్తుందని, స్థానికంగా ఉండే వ్యక్తి నమ్మకంగా ఉన్నాడనే ఆశతో నెలవారి ఖాతాదారులుగా, డిపాజి టర్లుగా చేరామన్నారు.  నాలుగైదు మాసాలుగా నెలవారి చెల్లించే సొమ్ము వసూళ్లకు కూడా గ్రామాల్లోకి  ఏజంట్లు రాకపోవడం, ఫిక్సెడ్‌ డిపాజిటర్లకు సంబం ధించి గడువు ముగిసినా చేతికి సొమ్ము రాలేదన్నారు. దీంతో పాటు తమ వద్ద ఉన్న రశీదులు, బాండ్లు కూడా ఏజంట్లు తీసుకెళ్లారని ఆరోపించారు. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ పరిసర ప్రాంతాల్లోనే రూ.కోటిల దాకా సొమ్ము వసూలు చేసినట్టు వారు పేర్కొన్నారు. బాధితులకు బాస్‌ నాయకులు అండగా నిలిచారు.

బాండ్లు, రశీదులు తీసుకెళ్లారు
నెలకు రూ.500ల చొప్పున మూడేళ్లుగా రూ.18 వేలు చెల్లించాను. వడ్డీతో కలిపి రూ.21 వేలు ఇస్తామని మా వద్ద వున్న రశీదులు, బాం డ్లు తీసుకెళ్లి నాలుగైదు నెలలు కావస్తోంది. ఇంత వరకు అతీగతీ లేకుండా పోయారు. ఎవరిని నమ్మాలో దిక్కు తెలియడం లేదు. ముసలోళ్ల పింఛన్‌ సొమ్ము కూడా కట్టించుకున్నారు.   – ఊరిముందర బయమ్మ,వరికసువుపల్లి, పీటీఎం మండలం

గడువు ముగిసినా సొమ్ము రాలేదు
నా కూతురు శ్యామలమ్మ పేరిట ఏడాదికి రూ.5 వేల చొప్పున ఐదేళ్లుగా డబ్బులు కట్టాను. మమ్మల్ని చూసి మరో ఇద్దరు మహిళలు నెలకు రూ.వెయ్యి చొప్పున 28 నెలలు కట్టినారు. గడువు ముగిసినా ఇంత వరకు డబ్బులు రాలేదు. చింతామణిలో ఉన్న ఆఫీసుకు ఫోన్‌ చేస్తే ఇస్తామంటారు. ఎవరో పెద్దాఫీసర్‌ రావాలంటారు. ఏజెంంట్‌ ఎక్కడున్నాడో తెలియదు. మిగిలిన మహిళలు డబ్బులు కట్టమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. – సాకల రెడ్డెమ్మ,వరికసువుపల్లి, పీటీఎం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement