villagers request
-
హే..మగిరి మోసం
గ్రామీణుల అమాయకత్వాన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్నేళ్ల పాటు నమ్మకంగా ఉంటూ అనంతరం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లలో డబ్బు వసూలు బోర్డులు తిప్పేస్తున్నారు. పిల్లల భవిష్యత్ అవసరాలకు, పెళ్లి ఖర్చులకు, ఉన్నత చదువులకు ఇలా అష్ట కష్టాలు పడి, పైసా పైసా కూడబెట్టిన సొమ్మును దిగమింగి అమాయకుల ఉసురు పోసుకుంటున్నారు. పెద్దతిప్పసముద్రం:(చిత్తూరు):‘హేమగిరి’ ప్రైవేటు బ్యాంకు సంస్థ వలలో చిక్కుకుని పలువురు గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ వద్ద డబ్బు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ వరికసువుపల్లికి చెందిన పలువురు బాధితులు మంగళవారం స్థానిక ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ... కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కామాక్షిపాళ్యం ప్రధాన కేంద్రంగా ‘హేమగిరి మల్టీపర్పస్ కో– ఆపరేటివ్ సొసైటి లిమిటెడ్’ పేరుతో ఓ సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు కర్ణాటకలోని చిక్బళ్లాపురం, శివమొగ్గ, చింతామణి, చిక్‌మంగళూర్, హోస్పేట్, తుమ్కూర్, హాసన్, చిత్రదుర్గ, దొడ్డ బళ్లాపురం లాంటి పట్టణాల్లో సబ్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశా రు. సబ్ బ్రాంచీలలో వుండే సంస్థ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై ఎంతో నమ్మకంగా వున్న వారిని ఏజెంట్లుగా నియమించారు. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గుగ్గిళ్లపల్లికి చెందిన రామచంద్ర అనే వ్యక్తిని ఇక్కడ ఏజెంటుగా నియమించారు. హేమగిరి సంస్థలో పెట్టుబడులు పెట్టే డిపాజిటర్లకు, నెలవారి కంతులను చెల్లించే వారికి సంస్థ ద్వారా లబ్ధి చేకూరే వడ్డీ, రుణ సదుపాయాలను రామచంద్ర వివరించారు. దీంతో తామంతా తక్కువ వ్యవధిలో అధిక వడ్డీ వస్తుందని, స్థానికంగా ఉండే వ్యక్తి నమ్మకంగా ఉన్నాడనే ఆశతో నెలవారి ఖాతాదారులుగా, డిపాజి టర్లుగా చేరామన్నారు. నాలుగైదు మాసాలుగా నెలవారి చెల్లించే సొమ్ము వసూళ్లకు కూడా గ్రామాల్లోకి ఏజంట్లు రాకపోవడం, ఫిక్సెడ్ డిపాజిటర్లకు సంబం ధించి గడువు ముగిసినా చేతికి సొమ్ము రాలేదన్నారు. దీంతో పాటు తమ వద్ద ఉన్న రశీదులు, బాండ్లు కూడా ఏజంట్లు తీసుకెళ్లారని ఆరోపించారు. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ పరిసర ప్రాంతాల్లోనే రూ.కోటిల దాకా సొమ్ము వసూలు చేసినట్టు వారు పేర్కొన్నారు. బాధితులకు బాస్ నాయకులు అండగా నిలిచారు. బాండ్లు, రశీదులు తీసుకెళ్లారు నెలకు రూ.500ల చొప్పున మూడేళ్లుగా రూ.18 వేలు చెల్లించాను. వడ్డీతో కలిపి రూ.21 వేలు ఇస్తామని మా వద్ద వున్న రశీదులు, బాం డ్లు తీసుకెళ్లి నాలుగైదు నెలలు కావస్తోంది. ఇంత వరకు అతీగతీ లేకుండా పోయారు. ఎవరిని నమ్మాలో దిక్కు తెలియడం లేదు. ముసలోళ్ల పింఛన్ సొమ్ము కూడా కట్టించుకున్నారు. – ఊరిముందర బయమ్మ,వరికసువుపల్లి, పీటీఎం మండలం గడువు ముగిసినా సొమ్ము రాలేదు నా కూతురు శ్యామలమ్మ పేరిట ఏడాదికి రూ.5 వేల చొప్పున ఐదేళ్లుగా డబ్బులు కట్టాను. మమ్మల్ని చూసి మరో ఇద్దరు మహిళలు నెలకు రూ.వెయ్యి చొప్పున 28 నెలలు కట్టినారు. గడువు ముగిసినా ఇంత వరకు డబ్బులు రాలేదు. చింతామణిలో ఉన్న ఆఫీసుకు ఫోన్ చేస్తే ఇస్తామంటారు. ఎవరో పెద్దాఫీసర్ రావాలంటారు. ఏజెంంట్ ఎక్కడున్నాడో తెలియదు. మిగిలిన మహిళలు డబ్బులు కట్టమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. – సాకల రెడ్డెమ్మ,వరికసువుపల్లి, పీటీఎం మండలం -
దశాబ్దాలు గడిచినా గుర్తించరా..?
► ధర్మారం పంచాయతీని పట్టించుకోని అధికారులు ► రెవెన్యూ గ్రామంగా మార్చాలని గ్రామస్తుల వేడుకోలు ధర్మారం: మూడు దశాబ్ధాల క్రితం మండల కేంద్రంగా ధర్మారం ఏర్పడినా నేటికీ రెవెన్యూ గ్రామంగా గుర్తింపు పొందలేదు. భూసంబంధ సమస్యలు, ఇతర రికార్డుల కోసం స్థానికులు ఎక్కడికెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను సంప్రదిస్తే కానీ వారికి అసలు విషయం తెలియడం లేదు. ఇదే మండలంలోని బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామపరిధిలో ధర్మారం ఉందని తెలుసుకొని అవాక్కవుతున్నారు. అవసరాలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని బొమ్మారెడ్డిపల్లికి వెళ్లాల్సి రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1981కు ముందు బొమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ధర్మారం ఉండేది. ఆ తర్వాత ధర్మారంను గ్రామపంచాయతీగా ప్రభుత్వం గుర్తించింది. మండల వ్యవస్థ ఆవిర్భవించాక ధర్మారం గ్రామపంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. కార్యాలయాలన్నీ ధర్మారంలోనే.. మండల కేంద్రంగా ఆవిర్భవంచాక ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయ మార్కెట్, పశువైద్యాధికారి, వ్యవసాయ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ధర్మారంలోనే ఏర్పాటు చేశారు. కానీ ధర్మారంను బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలోనే కొనసాగిస్తున్నారు. బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ధర్మారం, ఎర్రగుంటపల్లి, కొత్తపల్లి, జక్కన్నపల్లి గ్రామాలున్నాయి. ఇందులో కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాలు చిన్న గ్రామపంచాయతీలు. ధర్మారం గ్రామపంచాయతీ మండల కేంద్రమైనప్పటికీ ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయలేదు. మిగతా మూడు గ్రామాలకు సైతం సమస్యగా మారింది. ల్యాండు వాల్యూయేషన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పేదరైతులు భూక్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉండి భారంగా మారుతుంది. సమస్యలు అనేకం.. కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలన్నింటినీ కలిపి ఒకే రెవెన్యూ గ్రామంగా పరిగణిస్తుండటంతో పలుసమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. రెవెన్యూ గ్రామానికి ఒక్క వీఆర్వోనే కేటాయిస్తుండటంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. నాలుగు గ్రామాలకు ఒక్క వీఆర్వో ఉండటంతో ఏ గ్రామరైతులకు అందుబాటులో ఉండటం లేదు. పహాణీ పత్రాలు, జమాబందీ తదితర భూసంబంధ సమస్యలు ఎదురైన సందర్భాల్లో రైతులు వీఆర్వో కోసం పరుగులు పెడుతున్నారు. భూరిజిస్ట్రేషన్ ఫీజులు అధిక శాతం బొమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీలోనే జమవుతుండటంతో ధర్మారం పంచాయతీ ఆదాయం కొంతవరకు కోల్పోతుంది. ప్రతీ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తే ఆదాయంతో పాటు సమస్యలు తలెత్తవని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ గ్రామంగా మార్చాలి ధర్మారం గ్రామపంచాయతీని రెవెన్యూ గ్రామంగా మార్చి రైతులకు సమస్యలు లేకుండా చూడాలి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన స్పందించటం లేదు. స్థానిక నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలి. – బొల్లి స్వామి ఎంపీటీసీ ధర్మారం ఇద్దరు వీఆర్వోలను నియమించాలి బొమ్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామం కింద నాలుగు గ్రామాలుండటంతో రెవెన్యూపరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇద్దరు వీఆర్వోలను నియమిస్తే ఇబ్బందులు తొలగుతాయి. నాలుగు గ్రామాలకు ఒక్క వీఆర్వో ఉండటంతో ధర్మారం రావల్సి వస్తోంది. –ఎగ్గెల స్వామి, సర్పంచు, బొమ్మారెడ్డిపల్లి