సహజ వనరులపై ఆధారపడిన ప్రాథమిక రంగం వాటా తగ్గి... ఉత్పత్తి, సేవల రంగం వాటా పెరిగిన ఆర్థిక వ్యవస్థలో పట్టణీ కరణ అనివార్యం అవుతుంది. పట్టణాలు ఆర్థికవృద్ధికి ఇంజిన్‌లు అవుతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి, ఆదాయ స్థాయులు అనేక రెట్లు అధికం అవుతాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కువ. ‘తెలంగాణ సోషియో, ఎకనమిక్ అవుట్‌లుక్ 2022’ నివేదిక ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా వాటా జాతీయ సగటు అయిన 31.16 కన్నా ఎక్కువగా 48.6 శాతంగా ఉంది. ఇది దేశంలోని మొదటి మూడు పట్టణీకరణ రాష్ట్రాలలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపింది. తమిళనాడు 48.45 శాతం, కేరళ 47.23 శాతం, మహారాష్ట్ర 45.23 శాతం పట్టణ జనాభాను కలిగి ఉన్నాయి.
సంతోషకరమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో పట్టణీకరణ వేగం కూడా దేశంలోని ఇతర ప్రాంతాలకంటే ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ GSDP (స్థూల రాష్ట్ర జాతీయోత్పతి) శీఘ్ర శిఖర గమనానికీ, తెలంగాణలో ఉద్యోగావకాశాల పెరుగుదలకూ సూచిక. 2028 నాటికి తెలంగాణ 50 శాతం కంటే ఎక్కువగా పట్టణ జనాభాను కలిగి ఉంటుందని అంచనా. ఒక్క హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమరేషన్ (HUA – హైదరాబాద్ సహా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం) లోనే అప్పటికి రాష్ట్ర జనాభాలో కనీసం 40 శాతం ఉంటారు. మన పట్టణీకరణ మాత్రమే కాదు, మన GSDP కూడా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువగా వృద్ధి చెందుతోంది అనడానికి ఇది నిదర్శనం.
ప్రణాళికాబద్ధంగా పటిష్ఠమైన పట్టణీకరణను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వాటిలో కొన్ని.
ఎ) ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’:
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అపరిమితంగా ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ను ఆమోదిస్తోంది. అంటే భవన నిర్మాణ స్థలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే సదుపాయం. ఇది పట్టణ ప్రాంతాలలో నిటారు వృద్ధిని సూచిస్తుంది. అగ్ని మాపక భద్రత, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ ప్రభావ అంచనాల పరంగా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుని నిర్మాణాన్ని ప్లాన్ చేసేందుకు అపరిమిత FSI వీలు కల్పిస్తుంది.
బి) టి.ఎస్–బి.పాస్:
తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన TS-B Pass (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణతోనే భవన నిర్మాణానికి అను మతిని మంజూరు చేస్తోంది. ఇందులో 600 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు తక్షణమే, అంతకు మించి ఉంటే 21 రోజుల లోపు అనుమతులు లభిస్తాయి. ఇందు కోసం ఏ అధికారినీ నేరుగా కలవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు. 2.1 లక్షల భవన నిర్మాణ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం జరిగింది.
సి) ఇన్నొవేటివ్ ప్రాజెక్ట్ ఫండింగ్ మెకానిజం:
ఏదైనా మౌలిక సదుపాయాల పనిని చేపట్టాలంటే పట్టణ స్థానిక సంస్థలకు ఇన్‌ఫ్రా నిధులు అవసరం. అందుకే జి.హెచ్.ఎం.సి. రహదారులకు ఇరు వైపుల భవన నిర్మాణ ఛార్జీలు, ఆస్తిపన్ను వాటికవే పెరిగేలా ఒక మెకానిజంను తీసుకొచ్చింది. దాంతో స్థానిక సంస్థల ఆదాయం మెరుగై ఆ పరిధిలోని భవన నిర్మాణాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి.
డి) ప్రాజెక్ట్ ఆధారిత SPVలు :
పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారి ప్రాజె క్టులకే పూర్తిగా నిర్దేశించిన SPV (స్పెషల్ పర్పస్ వెహికిల్ – ప్రాజెక్టు నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన వ్యవస్థ)లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
1. రెండు వైపులా దారి ఉన్న ప్రధాన వాహన మార్గాల్లో రద్దీని తగ్గిస్తూ, అదే సమయంలో సగటు వాహన వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ అర్బన్ రోడ్ డెవలప్‌మెంట్ (SRDP) పథకానికి రూపకల్పన చేసింది.
2. రోడ్డు మార్గాలను గుర్తించడం, కొత్త లింకు రోడ్లను వేయడం ద్వారా ఇన్‌ఫ్రా పెట్టుబడికి గరిష్ఠ విలువను తీసుకురావడమే లక్ష్యంగా 2017లో ‘హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్’ (HRDC)ను ఏర్పాటు చేసింది.
3. కాంప్రెహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రాజెక్టు (CRMP) కింద హైదరాబాద్‌లోని 930 కి.మీ.ల ముఖ్యమైన ప్రధాన ఆర్డెరియల్ రోడ్లు (మూడు లేదా అంతకంటే ఎక్కువ లైన్లు ఉన్నవి) గుర్తించి ప్రైవేట్ ఇన్‌ఫ్రా ఏజెన్సీలకు ఓపెన్ బిడ్ ద్వారా అప్పగించింది.
4. స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ (SNDP) కింద నీటి వనరుల పరస్పర అనుసంధానం కోసం, వరద ముంపు ప్రమాదాన్ని నివారించడానికి 2021లో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
రాజధాని వరకే కాకుండా రాష్ట్ర స్థాయిలో పట్టణీ కరణను నడిపిస్తున్న కొన్ని ప్రణాళికలు కూడా ఎంతో కీలకమైనవి. 2019లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల చట్టం (TMA) పౌరులకు పార దర్శకంగా మున్సిపల్ సేవలు అందిస్తోంది. అలాగే మున్సిపల్ బడ్జెట్‌ను తయారు చేయడంలో, నిర్వహించ డంలో ఈ చట్టం వృత్తి నైపుణ్యాన్ని తెస్తుంది. మున్సిపల్ బడ్జెట్‌లో తప్పని సరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా ఉంటుంది. అన్ని మున్సిపల్ సేవలు అన్‌లైన్లో సమయానుకూలంగా జరిగిపోతుంటాయి.
పట్టణ శ్వాసావరణ స్థలం ఏ విధంగానూ ప్రభావితం కాకుండా, వాస్తవానికి మరింత పెరగకుండా చూసేందుకు హైదరాబాద్ పరిసరాల్లో 19 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు (అభి వృద్ధి చేయాలనుకున్న మొత్తం 129లో) ఒక్కొక్కటి 500 నుంచి 2,500 ఎకరాలలో విస్తరించాయి. ఇవి హరితా వరణాన్ని, వారాంతపు విహార అనుభూతులను అందిస్తు న్నాయి. హైదరాబాద్ సహా అన్ని ULB (అర్బన్ లోకల్ బాడీ)లలో గత దశాబ్దంలో గ్రీన్ కవర్ పెరిగింది.
2020, 2021లలో హైదరాబాద్ రెండుసార్లు ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ఎంపిక అయింది. ది ఆర్బర్ డే ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ వారి FAO నుండి రెండుసార్లు భారతీయ విజేతగా నిలిచిన ఏకైక నగరం హైదరాబాద్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన AIPH వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు – 2022ను కూడా హైదరాబాద్ గెలుచుకుంది.
భవిష్యత్తులోనూ తెలంగాణలో పట్టణాభివృద్ధి అత్యంత వేగంగా ఉండబోతోంది. పట్టణీకరణ జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది. ప్రజలకు సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాలను బలమైన భద్రతను అందిస్తోంది. వారిని ఆర్థిక, సామాజిక సాధికారత వైపు నడిపిస్తోంది. గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తోంది.
అరవింద్ కుమార్, IAS
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్), మెట్రోపాలిటన్ కమిషనర్ (HMDA)
Comments
Please login to add a commentAdd a comment