సాక్షి, అమరావతి: పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు.
చదువుకొని, నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగాలు చేసుకొంటూ పట్టణాల పరిధిలో నివాసం ఉంటుంటే.. సాంకేతిక నైపుణ్యాలు లేని వారు ఏదో ఒక పని చేసుకొంటూ పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా స్థానిక సంస్థలకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది.
పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన
భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పట్టణీకరణను సంతరించుకుంటున్నాయని, దీనివల్ల పట్టణీకరణ మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలు విస్తరిస్తాయని తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ఎజెండా అయిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్–2030 (ఎస్‌డీజీ) కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నట్టు పేర్కొంది.
జీడీపీలో 60 శాతం పట్టణాలదే
దేశంలో 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 53కు చేరుకుంటాయని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా. అంతేగాక పట్టణాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగిందని, 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుందని పేర్కొంది. కాగా భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది.
పట్టణాల ముందు సవాళ్లూ ఉన్నాయ్..
వేగవంతమైన పట్టణీకరణ తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది. పాక్షిక పట్టణీకరణ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి సరఫరా, మురుగునీరు, డ్రైనేజీ నెట్‌వర్క్, ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు, రహదారులు, ప్రజా రవాణా, వీధి దీపాలు, పాదచారుల మార్గాలు వంటి ప్రజా భద్రతా వ్యవస్థలు వంటి ప్రాథమిక సేవలు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి, నివాస సౌకర్యాలు కల్పించడం సాధ్యపడటంలేదని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment