'పల్లె' వించిన పట్టణీకరణ! | 3 Years Of YS Jagan Government Villages Urbanization Andhra Pradesh | Sakshi
Sakshi News home page

'పల్లె' వించిన పట్టణీకరణ!

Published Mon, May 30 2022 5:44 AM | Last Updated on Mon, May 30 2022 10:12 AM

3 Years Of YS Jagan Government Villages Urbanization Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలయ్యాయి.. పట్టణాలకు ఆనుకుని ఉన్న పల్లెలు వాటిలో అంతర్భాగమయ్యాయి. గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనువుగా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పట్టణ స్థానిక సంస్థలుగా మారడంతోపాటు తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 15 మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని.. అభివృద్ధికి వినియోగించుకోవడంతో ఆయా గ్రామాల స్థాయి పెరిగింది. 

జిల్లాలవారీగా కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలు ఇవే..
అనంతపురం జిల్లాలోని కోనపురం, వెంకటరెడ్డిపల్లిని కలిపి పెనుగొండ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ని 2020 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇదే నెలలో పలు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందాయి.

► చిత్తూరు జిల్లాలో మేజర్‌ పంచాయతీగా ఉన్న కుప్పంలో సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా మార్చారు. ఇదే జిల్లాలో జనాభా పరంగా పెద్దదైన బి.కొత్తకోట కూడా యూఎల్‌బీగా మారింది. 
► గుంటూరు జిల్లాలోని గురజాల, జంగమహేశ్వరపురం పంచాయతీలు కలిసి గురజాల మునిసిపాలిటీగా, దాచేపల్లి, నడికుడి గ్రామాలు కలిసి దాచేపల్లి మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి.
► కృష్ణా జిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిసి కొండపల్లి మునిసిపాలిటీగా, తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలు కలిసి వైఎస్సార్‌ తాడిగడప మునిసిపాలిటీగా ఏర్పాటయ్యాయి. 

► కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బుగ్గనపల్లి కలిపి బేతంచర్ల యూఎల్‌బీగా ఏర్పాటు చేశారు.
► ప్రకాశం జిల్లాలోని పొదిలి, కంబాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలు కలిసి పొదిలి యూఎల్‌బీగా, దర్శి గ్రామ పంచాయతీ ఒక్కటీ మరో యూఎల్‌బీగా ఏర్పాటయ్యాయి.
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అల్లూరు, సింగంపేట, నార్త్‌ మోపూరు గ్రామాలు కలిసి అల్లూరు మునిసిపాలిటీగా, ఇదే జిల్లాలోని అవ్వేరు, కట్టుబడిపాలెం, ఇసకపాలెం, పల్లిపాలెం కలిసి బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి.

► పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, చింతలపూడి గ్రామ పంచాయతీలు వేర్వేరు పట్టణ స్థానిక సంస్థలుగా మారాయి.
► వైఎస్సార్‌ జిల్లాలోని కమలాపురం గ్రామ పంచాయతీ సైతం యూఎల్‌బీగా మారింది. 
► రాష్ట్రంలో కమలాపురం, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, బేతంచర్ల, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, కుప్పం, పెనుగొండ మునిసిపాలిటీలు 2020 జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటయ్యాయి. చింతలపూడి, అల్లూరు, పొదిలి, వైఎస్సార్‌ తాడిగడప, బి.కొత్తకోట మునిసిపాలిటీలను 2021లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా, 2021లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో 23 మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో సమీపంలోని గ్రామాలను విలీనం చేసి ఆయా పంచాయతీల స్థాయి పెంచింది. శ్రీకాకుళం మునిసిపాలిటీలో ఏడు పంచాయతీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో పది పంచాయతీలు, భీమిలి మునిసిపాలిటీలో ఐదు పంచాయతీలు, ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు.

అదేవిధంగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఐదు పంచాయతీల చొప్పున, తణుకు, భీమవరం మునిసిపాలిటీల్లో మూడు పంచాయతీల చొప్పున కలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలు, జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీలు, నాయుడుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాలు, మరో పంచాయతీని కలిపారు. 

మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌లో 21 గ్రామాలు విలీనం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి 
కార్పొరేషన్‌లో అత్యధికంగా 21 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బాపట్ల మునిసిపాలిటీ సమీపంలో వెలసిన కొన్ని కొత్త ప్రాంతాలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి దాని స్థాయిని పెంచారు. అదేవిధంగా పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లోనూ పదుల సంఖ్యలో గ్రామాలను, సమీప కాలనీలను విలీనం చేశారు.

కర్నూలు కార్పొరేషన్‌లో సైతం మూడు సమీప పంచాయతీలను కలిపారు. నంద్యాల మునిసిపాలిటీలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కొంత భాగాన్ని విలీనం చేశారు. ఇక పుంగనూరు మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాన్ని, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలను కలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement