పట్టణీకరణతోనే పేదరిక నిర్మూలన | With urbanization, poverty alleviation | Sakshi
Sakshi News home page

పట్టణీకరణతోనే పేదరిక నిర్మూలన

Published Sun, Jun 26 2016 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

పట్టణీకరణతోనే పేదరిక నిర్మూలన - Sakshi

పట్టణీకరణతోనే పేదరిక నిర్మూలన

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ


పుణెలో 14 ప్రాజెక్టులకు శ్రీకారం 
నగరాల్ని వేగంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత
నగరాభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం పెరగాలి: మోదీ

పుణే: పేదరిక నిర్మూలనకు పట్టణీకరణ ఒక అవకాశమని, అది సమస్య కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా పుణేలో శనివారం ఆయన 14 ప్రాజెక్టులనుప్రారంభించారు. ఇతర స్మార్ట్ నగరాలకు సంబంధించి 69 పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒకప్పుడు పట్టణీకరణను సమస్యగా భావించేవారని, తాను అలా అనుకోవడం లేదన్నారు.  ‘ఆర్థిక రంగానికి చెందిన వారు నగరాలను  అభివృద్ధి కేంద్రాలుగా భావిస్తారు. పేదరికాన్ని రూపుమాపే సామర్థ్యం వేటికైనా ఉన్నాయంటే అవి నగరాలు మాత్రమే. అందుకే ప్రజలు వెనుకబడ్డ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్తూ అవకాశాలు అందుకుంటున్నారు. వీలైనంతమేర పేదరికాన్ని రూపుమాపడానికి నగరాల్ని బలోపేతం చేయడం ఇప్పుడు మన బాధ్యత.. ఇది తక్కువ సమయంలో జరగాలి. అభివృద్ధి కోసం కొత్త మార్గాల్ని జతచేయాలి. అదేమీ కష్టమైన పని కాదు, సాధ్యమే’ అని మోదీ చెప్పారు.

 
అభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం కీలకం

నగరాల అభివృద్ధి కోసం సమగ్ర, ఒకదాని కొకటి అనుసంధానమైన, లక్ష్య శుద్ధితో కూడిన విధానాన్ని అవలంబించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం కీలకమని... నగరాల్లో నివసించే ప్రజలే వారి ప్రాంతాల్ని ఎలా అభివృద్ధి చేయాలో నిర్ణయించాలన్నారు. వాటిని ఢిల్లీలోని నేతలు తీసుకోకూడదని చెప్పారు. స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రణాళిక నిర్ణయాల్లో ప్రజా భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. నగరాల్ని అభివృద్ధికి ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తీవ్ర పోటీ అవసరమని గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని తిరోగమనంలో నడిపించాయని, తమ ప్రభుత్వం ప్రగతి కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు.

 
‘స్మార్ట్ సిటీస్‌ను అలంకారంగా కాకుండా పేద ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే మిషన్‌గా చూడాలి. సమగ్ర పద్దతిలో నగర ప్రాంత పేదలకు ఇళ్లు కల్పించడం మొదలైనవి ఇందులో భాగం. స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా నాణ్యమైన పాలన, ప్రజా సేవల కోసం డిజిటల్ సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలి. స్మార్ట్ సిటీస్ పై 25 లక్షలకు పైగా ప్రజలు అంకితభావంతో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగరాభివృద్ధికి గత ప్రభుత్వాల హయాంలో ఖర్చుపెట్టలేదు. భారత్ కన్నా వెనకాల స్వాతంత్య్రం సంపాదించుకున్న దేశాలు తక్కువ సమయంలో మనల్ని దాటి వెళ్లిపోయాయి. 125 కోట్ల మంది ప్రజల బలాల్ని మంచి పని కోసం వాడితే... వాళ్ల నైపుణ్యాల్ని ఉపయోగిస్తే... అద్భుతాలు చేయగలరు. అప్పుడు ప్రభుత్వాల అవసరం ఉండదు... ప్రపంచం తనంతట తాను ముందుకు దూసుకుపోతుంది’ అని మోదీ చెప్పారు.

ప్రధానిని కలసిన బాలిక..
ప్రధాని కార్యాలయం సాయంతో గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆరేళ్ల బాలిక వైశాలి.. ప్రధాని  మోదీని పుణేలో కలుసుకుంది. వైశాలిని కలుసుకున్న ఫొటోల్ని మోదీ ట్వీటర్‌లో పోస్టు చేశారు.

 

దేశ చరిత్రలోనే ఇదొక మలుపు: వెంకయ్య నాయుడు
శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... గతంలో కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎదురుచూసేదని, ఇప్పుడు ఆలోచనల్ని అందించే వారి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. శుభ్రత పాటించాలంటూ ప్రజల్ని కోరడం అనే ఆలోచన వల్లే స్వచ్ఛ్ భారత్ విజయవంతమైందన్నారు. పట్టణ ప్రాంతాల్లో వ ర్థ్యాల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మేక్ యువర్ సిటీ స్మార్ట్ పోటీని ప్రారంభించారు. నగరాల్లో రోడ్లు, కూడళ్లు, బహిరంగ స్థలాల నమూనాల్ని ప్రజలు ఈ పోటీ ద్వారా పంచుకోవచ్చు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశ చరిత్రలో ఇదొక మలుపు అని, ప్రధాని ప్రారంభించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నగర పునరుజ్జీవనంలో తొలి అడుగు అని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీస్ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్ సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు బాబు సుప్రియో, ప్రకాశ్ జవదేకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement