మీ సహకారంతోనే సాధ్యం
ప్రజల అండతోనే పేదరిక నిర్మూలన: మోదీ
* బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోంది
* గరీబీ హఠావోకు ఎంచుకున్న మార్గం సరికాదు
* ‘రెండేళ్ల’ సందర్భంగా ఒడిశాలో భారీ సభ
బాలాసోర్ (ఒడిశా): దేశంలో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రజల సహకారం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనించాలన్న మోదీ.. ఒడిశాతోపాటు వివిధ రాష్ట్రాల్లో రాజకీయ మార్పు జరగాలన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఒడిశాలోని బాలాసోర్‌లో గురువారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. గరీబీ హఠావో అనే నినాదాన్నిచ్చిన ఇందిరాగాంధీపై విమర్శలు చేశారు. ‘గత 40-50 ఏళ్లుగా దేశంలో గరీబీ హఠావో నినాదాన్ని వింటూనే వస్తున్నాం. ఈ నినాదాన్నిచ్చిన వారి ఉద్దేశాలు చెడుగా ఉండకపోవచ్చు. కానీ.. పేదరికం, నిరుద్యోగం విషయంలో వీరు చేపట్టిన ఏ పనులూ ఫలితాన్నివ్వలేదు. వారు ఎంచుకున్న మార్గం సరిగా లేకపోవటమే ఇందుకు కారణం’ అని మోదీ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. తను ప్రజలకు జవాబుదారీనన్న మోదీ.. ఎప్పుడైనా నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం) ప్రజలకు లెక్కలుచెప్పారా? అనిప్రశ్నించారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనించండి. వాటితో పోలిస్తే ఒడిశా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి అధికారమివ్వండి’ అని ప్రధాని తెలిపారు. దేశంలో తూర్పు ప్రాంతం కంటే పశ్చిమప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందిందోప్రజలు ఆలోచించాలన్నారు.
రుణాలపై పేదల ‘ముద్ర’: చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ముద్ర పథకం విజయవంతమైందన్న ప్రధాని.. రుణాలను తిరిగి చెల్లించటం ద్వారా పేదలు తమ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారన్నారు. ఈ పథకం కింద పేదలకు రూ.50 వేల నుంచి 10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. కాగా, ‘రెండేళ్ల’ ప్రచారంలో భాగంగా.. బీజేపీ ఢిల్లీ విభాగం మోదీ రథాలను ప్రారంభించింది.
5 వేల కొత్త ఐటీఐలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటిన్నర మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ఐఐటీల సామర్థ్యాన్ని మరో ఆరు లక్షలు పెంచాలని, 5 వేల కొత్త ఐటీఐలను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈమేరకు గురువారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మోదీ చెప్పారు.ఐఐటీల సామర్థాన్ని ప్రస్తుతమున్న 18.5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.