‘ప్రవాసీ భారతీయ దివస్’లోప్రధాని మోదీ స్పష్టీకరణ
మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగం
భువనేశ్వర్: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్‌కు ఉందని తెలిపారు.
గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టంచేశారు. ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని అన్నారు.
కేవలం మన మనోగతమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలను సైతం ప్రపంచ వేదికపై బలంగా వినిపించగలుగుతున్నామని వెల్లడించారు. ఆయుధ బలంతో సామ్రాజ్యాలు విస్తరిస్తున్న కాలంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచారని గుర్తుచేశారు. మన వారసత్వ బలానికి ఇదొక ప్రతీక అని వెల్లడించారు. యుద్ధంలో కాకుండా బుద్ధుడి బోధనల్లోనే భవిష్యత్తు ఉందని భారత్ నమ్ముతున్నట్లు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
మీ వల్లే తలెత్తుకొని ఉండగలుగుతున్నా..
‘‘ప్రవాస భారతీయులను మన దేశానికి రాయబారులుగా పరిగణిస్తున్నాం. వైవిధ్యం గురించి మనకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంపై మన జీవితాలు నడుస్తున్నాయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో హృదయపూర్వకంగా మమేకమవుతూ ఉంటారు. ఇతర దేశాల నియమ నిబంధనలు మనం చక్కగా గౌరవిస్తాం.
మనకు ఉద్యోగం, ఉపాధి కల్పించిన దేశానికి నిజాయితీగా సేవ చేయడం, ఆ దేశ ప్రగతిలో పాలుపంచుకోవడం మనకు అలవాటు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన హృదయం భారతీయతతో నిండి ఉంటుంది. భారత్ కోసమే మన గుండె చప్పుడు వినిపిస్తుంది. ప్రవాస భారతీయులు మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారి వల్లే విదేశాలకు వెళ్లినప్పుడు నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నా.
మనది యువ భారత్: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. మనది యువ భారత్. ఇక్కడ యువ జనాభా అధికం. అంతేకాదు నైపుణ్యం కలిగిన యువత మన దగ్గర ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చగల సత్తా ఇండియాకు ఉంది. డిజిటల్ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నాం. ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలను మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానాల్లో మీరంతా ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. భారతదేశ ఆసలైన చరిత్రను విదేశాల్లో చాటి చెప్పండి’’ అని ప్రధాని మోదీ సూచించారు.
ప్రపంచానికి ఆయుర్వేదం ఇచ్చిన భారత్: క్రిస్టినా క్లారా
ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్ వెలకట్టలేని అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ప్రశంసించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె గురువారం మాట్లాడారు. గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. భారత్ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment