Cultural traditions
-
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్‌లో ఉంటే.. అక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్‌షిప్‌తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్‌షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్‌ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్‌లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్‌ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్‌కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్‌లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్‌కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్‌పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్‌కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్‌సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
పార్లమెంటు 2.0.. సర్వాంగ సుందరంగా కొత్త భవనం
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు కొత్త భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. త్రిభుజాకృతిలో నిర్మించిన ఈ భవనం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఆధునిక హంగుల కలబోతగా కూడా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 ఆదివారం కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. వందేళ్ల నాటి పాత పార్లమెంటు భవనం నేటి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త భవన నిర్మాణం అవసరమైంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేవలం రెండున్నరేళ్లలో నిర్మించింది. ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మాణం సాగింది. ప్రస్తుతం పార్లమెంటు పక్కనే నిర్మించిన కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, కమిటీ రూములు, సెంట్రల్ హాలు, అతి పెద్ద లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ► రూ.20 వేల కోట్లతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ► లోక్‌సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. సభ్యుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రస్తుత లోక్‌సభ హాలు కంటే మూడు రెట్లు పెద్దగా రూపొందించారు. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు కూడా చక్కగా సరిపోతుంది. 1,272 మంది సందర్శకులు సమావేశాలను తిలకించవచ్చు. ► రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్‌తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ► పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ► అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ రూపొందించింది. ఇది భూకంపాల్ని కూడా తట్టుకుంటుంది. ► రాజస్తాన్‌కు చెందిన ధోల్పూర్ రాళ్లతో భవనానికి అద్భుతమైన లుక్ వచ్చింది. ► పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళారూపాలతో రూపొందాయి. ► భవన నిర్మాణంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేశారు. గ్రీన్ ఎనర్జీతో 30% దాకా విద్యుత్ ఆదా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుందట. ► పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది. ► భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా 9 వేల మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారు. ► ఆవరణలో రెండు మర్రి చెట్లు నాటారు. ► దివ్యాంగులకు అనుకూలంగా, వారు స్వేచ్ఛగా తిరిగేలా నిర్మాణం జరిగింది. ► భవనం గోడలపై పలు శ్లోకాలను రాశారు. చరిత్రలోకి తొంగి చూస్తే.. ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు. 1921 నుంచి ఆరేళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షలు ఖర్చు అయింది. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు. ఎందుకీ నిర్మాణం? ప్రస్తుత పార్లమెంటు భవనం అవసరాలు తీర్చేలా లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సభ్యుల సంఖ్య పెరిగితే సరిపోదు. మంత్రులు, మీటింగ్ హాల్స్ కొరత ఉంది. భవనంలో మార్పులు చేర్పులు చేస్తే నిర్మాణం దెబ్బ తినే ప్రమాదముంది. దానికి భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ఢిల్లీ ఏమో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్–4లో ఉంది. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఆధునిక సౌకర్యాలూ లేవు. రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్ న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ మొదలైంది. భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే తప్ప ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగపరంగా సరైంది కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ట్వీట్లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలతో కూడిన పార్లమెంటుకు రాష్ట్రపతే అధిపతి గనుక నూతన భవనాన్ని ఆయనే ప్రారంభించాలన్నారు. ఆర్జేడీ, ఎంఐఎం కూడా ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక హిందూత్వవాది వి.డి. సావర్కర్ జయంతి నాడే (ఈ నెల 28న) ప్రారంభోత్సవం జరపనుండటాన్నీ విపక్షాలు తీవ్రంఆక్షేపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Balagam: సర్పంచ్ క్యారెక్టర్ చేయడం నా అదృష్టం
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, మానవ సంబంధాలు..అనుబంధాలు వెండితెరపై అద్భుతంగా ఆవిష్కృతమైన ‘బలగం’ సినిమాలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నటించారు. కొమురయ్య అల్లుడు నారాయణ పాత్రలో రామాయంపేటకు చెందిన ఐరేనిమురళీధర్గౌడ్, సర్పంచ్ పాత్రలో హత్నూరకు చెందిన వాసుదేవరావు, రైతు, ప్రొడక్షన్ కంట్రోలర్‌గా హుస్నాబాద్‌కు చెందిన రవితేజ మెప్పించారు. కొమురయ్య అల్లుడిగా.. కొమురయ్య అల్లుడి పాత్రలో నటించిన మురళీధర్‌గౌడ్ విద్యాభ్యాసమంతా సిద్దిపేట జిల్లాలోనే. ఏడో తరగతి వరకు సిద్దిపేటలో, 8 నుంచి 11వ తరగతి వరకు గజ్వేల్‌లో విద్యనభ్యసించాడు. పీయూసీ, డిగ్రీ 1974 సంవత్సరంలో సిద్దిపేటలో పూర్తి చేశాడు. పదేళ్ల పాటు రామాయంపేటలో వ్యాపారం కూడా చేశారు. 1984లో విద్యుత్‌శాఖలో ఎల్డీసీ పోస్టింగ్ తీసుకొని వనపర్తిలో పనిచేశాడు. 2002లో హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. తర్వాత హైదరాబాద్‌లోని విద్యుత్‌శాఖ కార్పొరేట్ కార్యాలయంలో జేఏఓగా 2012 జనవరిలో ఉద్యోగ విరమణ పొందారు. మురళీధర్‌కు చిన్ననాటి నుంచే నాటకాలకంటే మక్కువ. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిస్థాయి సమయం దొరకడంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2017 నాటికి సినిమా ట్రాక్‌లోకి వచ్చాడు. పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ “పిట్టకథలు’ వెబ్ సిరీస్‌లో మొదటగా మురళీధర్‌కు నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో హీరో తండ్రిగా రోల్లో కనిపించాడు. దీంతో క్రమక్రమంగా సినిమా అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత బలగం సినిమాలో కొమురయ్య అల్లుడి పాత్రకు అవకాశం వచి్చంది. సినిమాలో నారాయణ పాత్ర మెయిన్‌రోల్‌లో ఒకటి కావడం, అద్భుతంగా నటించడంతో ఆయనకు సినిమా ఆఫర్లు పెరిగాయి. మంగళవారం, స్క్వేర్, భగత్‌సింగ్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే నివాసముంటున్నాడు. బంధువులు, స్నేహితులు సిద్దిపేట, మెదక్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళుతూ ఉంటాడు. తరుణ్‌భాస్కర్ వలనే బలగం సినిమాలో అవకాశం లభించిందని, నాకు మంచి గుర్తింపు వచి్చందని మురళీధర్ సంతోషం వ్యక్తం చేశారు. రైతుగా రవితేజ బలగం సినిమాలో రైతుగా నటించిన రవితేజ స్వస్థలం హుస్నాబాద్. ఇంటర్ వరకు హుస్నాబాద్, సిద్దిపేటలో డిగ్రీ పూర్తి చేశాడు. రవితేజకు కూడా చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. 2004లో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆపై కరీంనగర్‌పై ఓ ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేశాడు. 2019 నుంచి నిర్మాత దిల్ రాజు వద్ద ప్రొడక్షన్ కంట్రోలర్ పనిచేస్తున్నాడు. మంత్రా –2 సినిమాకు కోప్రొడ్యూసర్‌గా చేశాడు. తొలిసారిగా బలగం సినిమాలో హీరో పొలం పక్కన రైతుగా నటించారు. హీరో తండ్రికి, ఆ రైతుకు ఒకమారు గొడవ జరిగే సన్నివేశంలో నటించాడు. ప్రస్తుతం మా టీవీలో వస్తున్న మధురానగరి సీరియల్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బలగం సినిమాకు కూడా ప్రొడక్షన్ కంట్రోలర్‌గా కొనసాగాడు. నాకు టరి్నంగ్ పాయింట్ బలగం సినిమానే అని రవితేజ చెప్పారు. సర్పంచ్‌గా వాసుదేవరావు బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో కనిపించిన వాసుదేవరావుది హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ స్వస్థలం. పదోతరగతి వరకు దౌల్తాబాద్‌లో, ఇంటర్ నర్సాపూర్‌లో చదివాడు.1992లో సినిమా డి్రస్టిబ్యూటర్ రంగ ప్రవేశం చేశాడు. నైజాం ఏరియా పరిధిలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల చేశారు. బలగం సినిమా డైరెక్టర్ వేణు ప్రోత్సాహంతో తొలిసారిగా వెండితెరపై కనిపించి సర్పంచ్ పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో ఉంటూ సినిమా డి్రస్టిబ్యూటర్‌గా కొనసాగుతున్నా, నటనపై ఆసక్తి ఉందని చెబుతున్నాడు. ఆయన బంధువులు దౌల్తాబాద్‌లో ఉంటున్నారు. అద్భుతమైన సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని వాసుదేవరావు చెప్పారు. పాత రోజుల్లోకి... కొన్ని దశాబ్దాల కిందటి వరకూ గ్రామం మధ్యలో లేదా రచ్చబండ వద్ద ప్రొజెక్టర్‌తో సినిమాలు వేసేవారు. రాత్రివేళ ఆ గ్రామ ప్రజలంతా అక్కడకు చేరి సినిమాలు చూసేవారు. బలగం సినిమాకు ప్రస్తుతం ఆ ట్రెండ్ కనిపి స్తోంది. పలు గ్రామాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌తో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. కోహెడ మండలం బస్వాపూర్, నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది, చిన్నకోడూరు మండలం రామంచలో బలగం సినిమాను ప్రదర్శించారు. దుబ్బాక పరిధిలోని లచ్చపేటలో శనివారం రాత్రి బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ నంద్యాల శ్రీజ శ్రీకాంత్, దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ, దుబ్బాక సీఐ బత్తుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టేలా..
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ద్వారా కేవలం పెట్టుబడుల ఆకర్షణే కాకుండా రాష్ట్ర హస్తకళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వీటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిం చడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. సదస్సులో చర్చాగోగోష్ఠ లకే పరిమితం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమివ్వనుంది. ఇందులో భాగంగా అటు సంప్రదాయ కళలకు కూడా పెద్దపీట వేయనుంది. మెడలో వేసుకునే బ్యాడ్జీల దగ్గర నుంచి కార్యక్రమంలో పాల్గొనే వారికి ఇచ్చే కిట్ల వరకు అన్నింటిలోనూ రాష్ట్ర హస్తకళలకు ప్రాచుర్యం కల్పిం చనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రెండుసార్లు సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. తోలుబొమ్మల తయారీలో వినియోగించే మెటీరియల్‌తో కూడిన బ్యాడ్జీలు చేసి.. వాటి వెనుక పెడన కలంకారీ డిజైన్లను ముద్రించారు. ఆహూతులకు ఇచ్చే నోట్‌బుక్స్‌ను కూడా కలంకారీ డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పెన్నులపై రాష్ట్ర పక్షి.. చిలుక లోగోతో పాటు అడ్వాంటేజ్ ఏపీ అని ముద్రించారు. ముఖ్య అతిథులకు సిల్వర్ పిలిగ్రీతో చేసిన రాష్ట్ర జీఐఎస్ లోగో బహూకరిస్తారు. గిఫ్ట్ బాక్సుల్లో ఎన్నో ప్రత్యేకతలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకు ఇచ్చే గిఫ్ట్ బాక్స్‌ల్లో చాలా ప్రత్యేకతలున్నాయి. సిరామిక్ ప్లేట్, పెన్ను, అరకు కాఫీ, వుడెన్ కోస్టర్స్‌తో కూడిన గిఫ్టు బాక్స్‌లను ఇవ్వనున్నారు. ఈ సిరామిక్ ప్లేట్‌ను కలంకారీ డిజైన్‌తో అందంగా తీర్చిదిద్ది.. దాని వెనుక రాష్ట్ర చిహ్నం, జీఐఎస్ లోగోను ముద్రించారు. బ్లాక్ కలంకారీ డిజైన్‌తో వుడెన్ కోస్టర్స్ను అందంగా రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా గిఫ్ట్ బాక్స్లపైనా కలంకారీ డిజైన్‌ను ముద్రించారు. సదస్సులో వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడక్ట్ కింద రాష్ట్రంలోని హస్తకళలు, వివిధ ఉత్పత్తులకు ప్రచారం కల్పిం చేలా ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కూచిపూడి, జానపద కళలకు పెద్దపీట.. సదస్సు జరిగే రెండు రోజులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కూచిపూడి నృత్యం, జానపద కళలకు పెద్దపీట వేశారు. మార్చి 3న తొలిరోజు రాష్ట్ర గీతం.. ‘మా తెలుగు తల్లి’తో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రముఖ నర్తకి యామినీరెడ్డితో కూచిపూడి నృత్యంతోపాటు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తుషార్ కలియాతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర జానపద కళలైన థింసా, తప్పెటగుళ్లు, గరగలు, ఉరుములు, కొమ్ము నృత్యం తదితర ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకోనున్నాయి. సదస్సు రెండో రోజు నవరత్న పథకాలను అందరికీ అర్థమయ్యేలా కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించనున్నారు. -
గోదావరి గలగలలు...పచ్చందనాల సిరులు
గలగలపారే గోదావరి హొయలు.. పచ్చని పంటపొలాలు.. నలుదిశలా చాటే చారిత్రక వైభవం.. గిరులలోని తరుల సౌందర్యం.. గిరిపుత్రుల జీవనం.. జలపాతాల సోయగం.. కనులారా వీక్షించాలంటే తూర్పుకు పరుగులు తీసే గోదావరి వైపుగా మన అడుగులూ కదలాలి. తూర్పుగోదావరి జిల్లాకు కాకినాడ ముఖ్యపట్టణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాలో గోదావరి జీవనవేదాన్ని కళ్లకు కడుతుంది. దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తా తీరం ఈ జిల్లాలోనే ఉంది. ప్రకృతి మనోహర దృశ్యాలకు పరవశిస్తూ, చారిత్రక వైభవాలను తెలుసుకుంటూ ప్రకృతి ఒడిలో కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి బయల్దేరే పర్యాటకులు గోదావరి ఇసుకుతిన్నెలపై మరచిపోలేని అనుభూతులెన్నో మూట గట్టుకొని వెళ్లచ్చు. తూర్పుగోదావరి ప్రాంతంలో అతి ముఖ్యమైన 16 ప్రదేశాలను తిలకించడానికి కనీసం ఐదు పగళ్లు, నాలుగు రాత్రుళ్లు కేటాయించాలి. హైదరాబాద్ నుంచి 564 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. మొదటి రోజు: దేశంలో ఎక్కడ నుంచైనా రాజమండ్రికి చేరుకొని, అక్కడి హోటల్ గదిలో విశ్రాంతి తీసుకొని, ఉదయం 10గం.కు.. రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం పుట్టిన ప్రదేశానికి చేరుకొని అక్కడ వితంతు వివాహాలు జరిపిన పెద్ద హాలును సందర్శించాలి. ఆ తర్వాత సెంట్రల్ జైల్, గోదావరి నదీ తీరంలో స్నాన ఘట్టాలు, కడియపులంక నర్సరీ... చుట్టి రావచ్చు. చుట్టుపక్కల 25 నుంచి 30 కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశాలన్నీ చూడటానికి కనీసం మూడు గంటలు పడుతుంది. మధ్యాహ్నపు భోజనానికి నదీ తీరంలో గల రెస్టారెంట్‌కి చేరుకుంటే రుచికరమైన శాకాహార/మాంసాహార భోజనం లభిస్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు బయల్దేరి 26 కి.మీ దూరంలోని బుద్ధుడు నడయాడిన ప్రాంతాలు కాపవరం, కోరుకొండను సందర్శించాలి. అక్కడ నుంచి 58 కిమీ దూరంలో కొడవలిలో బౌద్ధ ప్రాంతాలను దర్శించి రాత్రికి తిరిగి రాజమండ్రి చేరుకోవాలి. రెండవ రోజు: ఉదయం 7 గంటలకు పట్టిసీమకు బోటులో బయల్దేరాలి. రాజమండ్రి నుంచి గోదావరి నది మీద బోటులో 40 కి.మీ ప్రయాణిస్తే పాపికొండలు చేరుతాం. పాపికొండల నడము ప్రవహించే నదీ సోయగం కళ్లారా చూడవలసిందే! ఇక్కడే పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ సైట్ ప్రాంతాలు, తూర్పు కనుమల అందాలు, గిరిజనుల గ్రామాలు సందర్శించి, వారి జీవనశైలులను తిలకించవచ్చు. ఇక పేరంటాలపల్లి శివాలయం, ఆశ్రమం సందర్శించి, దగ్గరలోని జలపాతాన్ని వీక్షించాక అటు నుంచి పాపికొండలలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లాలి. బోటులోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంకాలం స్నాక్స్, టీ లభిస్తాయి. సాయంత్రం దగ్గరలోని కొల్లూర్‌కు వెళ్లి, ఇసుకతిన్నెలమీద కట్టిన చిన్న చిన్న గుడిసెలలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని, గోదావరి అందాలను వీక్షించడం ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతి. మూడవ రోజు: ఉదయం 8:00 గంలకు కొల్లూరు నుంచి దేవీపట్నానికి బోటులో బయల్దేరాలి. ఈ ప్రయాణం కనీసం మూడు గంటలు పడుతుంది. ఇక్కడే రంప జలపాతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలి. మారేడుమిల్లి హిల్ స్టేషన్ (రంపచోడవరానికి 26 కి.మీ)లోని కాఫీ తోటలు, ఔషధ మొక్కలు, 10 కి.మీ దూరంలో గల పాములేరు అటవీ ప్రాంతం, పులుల స్థావరం, జలపాత అందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరచిపోతుంటారు. వాటిని సందర్శించి, అమృతధార జలపాతానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లేవారికి ఈ మార్గం ఉల్లాసమైన అనుభూతిని మిగుల్చుతుంది. మారేడుమిల్లిలో టూరిజమ్ టెంట్ల కింద రాత్రి భోజనం చేసి, నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ హాయిగా నిద్రపోవడం మరో తీయని అనుభూతి. నాల్గవ రోజు: ఉదయం 5:00 గం.ల నుంచి పక్షుల కువకువల తో మేల్కొని, వాటిని వీక్షిస్తూ ఆ హాయిని, ఆనందాన్ని గుండెలనిండుగా నింపుకుంటారు పర్యాటకులు. ఇక్కడే అల్పాహారం చేసి, 130 కి.మీ దూరంలో గల బిక్కవోలుకు బయల్దేరాలి. బిక్కవోలులో చాళుక్యుల కాలంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. నాటి కళా వైభవాన్ని కళ్లారా వీక్షించి కాకినాడకు గొల్లలమామిడాడ మీదుగా బయల్దేరుతూ పచ్చని పంటపొలాలను చూస్తూ ప్రయాణం కొనసాగించాలి. గంటన్నరలో కాకినాడ చేరుకొని మధ్యాహ్న భోజనం చేసి, అటు నుంచి 26 కి.మీ దూరంలో గల సామర్లకోటకి వెళితే ద్రాక్షారామం చారిత్రక వైభవాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ ఆహ్వానిస్తుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవాలయాలు అంత్యంత ప్రాముఖ్యం గలవి. వీటిని దర్శించుకొని 18 కి.మీ దూరంలో గల యానాం బయల్దేరాలి. యానాం ఉద్యానాలకు బ్యాంక్. ఇక్కడి పార్కులలో మనోల్లాసాన్ని పొందడంతో పాటు గోదావరి తీరాన గల 19వ శతాబ్దపు చర్చి సందర్శన అత్యంత ప్రధానమైనది. ఆ తర్వాత 28 కి.మీ దూరంలో ఉన్న కాకినాడకు తిరిగి వెళ్లి, రాత్రి అక్కడే బస చేయాలి. ఐదవ రోజు: ఉదయాన్నే రూమ్ చెక్ ఔట్ చేసి, అల్పాహారం ముగించుకొని ఆదుర్రుకు బయల్దేరాలి. కాకినాడ నుంచి 85 కి.మీ ప్రయాణిస్తే రాజోలు తాలూకాలో ఆదుర్రు గ్రామం వస్తుంది. ఇది చారిత్రక ప్రదేశం. ఇక్కడ 1700 ఏళ్ల నాటి బుద్ధుని స్థూపాలు ఉన్నాయి. పురావస్తు శాఖ 1953లో జరిపిన తవ్వకాల్లో నాటి మట్టి పాత్రలు, కుండలు బయటపడ్డాయి. ఇక్కడ మహాస్థూపం ఈ ప్రాంతానికి అతి పెద్ద ఆకర్షణ. రెండు గంటల పాటు ఇక్కడే తిరిగి, నాటి విశేషాలు తెలుసుకోవాలి. అటునుంచి మధ్యాహ్నం 2:00 గంలకు కాకినాడ నుంచి చెన్నైకి, ఇటు హైదరాబాద్‌కూ చేరుకోవచ్చు. ప్రయాణమార్గాలు: తూర్పుగోదావరికి రైలు, రోడ్డు, నీరు, వాయు మార్గాలు ఉన్నాయి. రాజమండ్రి, సామర్లకోటలో రైల్వే జంక్షన్లు. చెన్నై హౌరా రైల్వై లైన్ ఈ జిల్లా మీదుగా వెళుతుంది. రాజమండ్రిలోని ఎయిర్‌పోర్ట్‌కు హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూర్ల నుంచి చేరుకోవచ్చు. చూడదగిన ప్రాంతాలు 1.రాజమండ్రి పట్టణం సంస్కృతీ సంప్రదాయాలకు, చారిత్రక అంశాలకు ప్రాముఖ్యత 2.కడియపులంక నర్సరీ 3.గోదావరి నదిలో 70 కి.మీ దూరం బోటులో ప్రయాణం. పాపి కొండలు,గిరిజనుల గ్రామాలు, గిరిజనుల జీవనశైలి 4.రంపా, అమృతధార జలపాతాలు, ట్రెక్కింగ్, కాఫీ తోటలు 5.పాములేరు అటవీ సౌందర్యం 6.కాపవరం బుద్ధుని స్థూపానికి దారి 7.కొడవలి బుద్ధుని స్థూపం 8.బిక్కవోలులో వెయ్యేళ్ల నాటి దేవాలయాలు 9.ద్రాక్షారామంలో తూర్పుచాళుక్యుల కాలం నాటి భీమేశ్వరస్వామి దేవాలయం 10. కోరింగ వణ్యప్రాణి సంరక్షణకేంద్రం. 11. ఆదుర్రులో బుద్ధుని స్థూపం ఈ ట్రిప్‌లో దాదాపు 758 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతా రోడ్డు మార్గమే! ఇందుకోసం స్థానిక బస్సులు, ఆటోలు, కార్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. కొంతమంది సభ్యులుగా కలిసి ఈ ప్రాంతాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి వినోదం, ఆహ్లాదంతో పాటు విజ్ఞానయాత్రగానూ, చిరకాలం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దాదాపు రూ.10,000/- నుంచి రూ.15,000/- (వారి వారి అవసరాలను బట్టి) ఖర్చు అవుతుంది. - శ్రీను అరవపల్లి, టూర్ గైడ్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్ -
ప్రసూతి బహుమతి
పడమటి గాలి ఎన్నో కొత్త విషయాలు మోసుకొస్తుంటుంది. మూడు నాలుగు దశా బ్దాలలో ఈ ప్రభావం మరింత బలపడింది. పడమటి గాలి మోసుకొచ్చిన సాంస్కృతిక సంప్రదాయాల్లో వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్‌డే లాంటివి జరుపుకొనే అలవాటు మన నగరాలకు వచ్చింది. బహుమతి వస్తువులు అమ్మే వ్యాపారంలో ఉన్న వాణిజ్య సంస్థల జోరూ, వారి ప్రకటనల హోరూ ఊరికే ఎందుకు పోతాయి? ఇప్పుడిప్పుడే ఇలాంటి మరొక కొత్త సంప్రదా యం గురించి వింటున్నాం. దీని పేరు ‘పుష్ ప్రెజెంట్’, తెలుగులో ‘ప్రసూతి బహుమతి’ అనచ్చు. అప్పుడే బిడ్డను కన్న భార్యకు పది నెలలు బిడ్డను మోసిన ఆమె శారీరక శ్రమనూ ముఖ్యంగా ప్రసవ సమయంలో ఆమె పడే వేదననూ గుర్తించి, భర్త ఇచ్చే బహుమతి. ఈ బహుమతిని ప్రసవానికి కొంచెం ముందు గానీ, ప్రసవం జరిగిన కొద్ది రోజు లలో గానీ ఇవ్వాలి. ఆస్పత్రిలో ప్రసూతి గదిలో ఇవ్వ టం ఉత్తమం. ఇంటికి వచ్చిన తరువాత ఇవ్వటం మధ్యమం. ప్రసవ సమయానికి తగినంత ముందే భార్య భర్తకు తనకెలాంటి ‘పుష్ ప్రెజెంట్’ కావాలో సూచిస్తుంది. ఎలాంటి బహుమతులంటారా? బంగారు ఉంగరాలు, గొలుసులు, వజ్రాల చెవి కమ్మలు, బ్రాస్లెట్లు, తల్లీ - బిడ్డా నెక్లెస్ సెట్లూ సందర్భోచి తంగా ఉంటాయని వ్యాపార సంస్థల సూచన. అమెరికన్ నటి కిమ్ కార్దాషియాన్‌కు ఈ మధ్య ఆమె భర్త 5 కోట్ల రూపాయల వజ్రపుటుంగరం, ప్రసూతి బహుమతిగా ఇచ్చాడు. బ్రిటీష్ యువరాజు అరుదైన గులాబీ రంగు వజ్రం తన భార్యకు ఇవ్వబోతున్నాడట. పుష్ ప్రజెంట్నే కాస్త సున్నితంగా ‘బేబీమామా గిఫ్ట్’, ‘బేబీ బాబుల్’ అని కూడా ప్రస్తావిస్తుంటారు. మన దేశంలో ఇలాంటి సంబరాలు లేవా? లేకేం, స్తోమత ఉండాలే గానీ ప్రతి రోజూ రోజుకొకటి జరుపుకున్నా, ఇంకా మిగిలిపోయేటన్ని సంబరాలూ, పర్వదినాలూ ఉన్నాయి మనకూ. గర్భస్థదశ నించీ, జన్మాంతం వరకూ మనిషికి జరగ(ప)వలసిన షోడశ కర్మలలో శిశుదశలో జరిగేవి సగం: గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం(చెవి కుట్టించటం) వగైరాలు శాస్త్రోక్త విధులు. ఇవి కాక బోర్లపడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు, పలుకులకు చిలకలు, కూర్చొంటే కుడుములూ, ఇలాంటి వేడుకలకు అవధి లేదు. సంపన్నుల ఇళ్లలో సంతానం కలిగిందంటే జరిగే కోటి సంబరాలలో, ఆ సంతానాన్ని కలగజేసిన ఇల్లాలును బహుమతులతో సత్కరించకుండా ఉండే అవకాశమే లేదు. ఒకమాట చెప్పుకోవాలి. ఈ ప్రసూతి బహు మతి సంప్రదాయంలో వేడుకేకాకుండా చాలా సబ బు ఉంది. పది నెలల పాటు ఎంతో ఒత్తిడి, మానసి కాందోళనా, శారీరక శ్రమలకు ఓర్చి, బిడ్డను ప్రసవించిన ఆనందమయమైన సమయం బహుమ తులకు సందర్భమే. భార్య భర్తకు బిడ్డను ఎలాగూ బహుమతిగా ఇస్తున్నది. కనక భర్త భార్యకు ఆ సమయంలో తన శక్తికి తగిన బహుమతి ఇవ్వటం సందర్భోచితం. పరస్పరానురాగానికి అది చక్కని చిహ్నం. పాశ్చాత్య దేశాలలో కూడా ఈ కొత్త బహుమతి సంప్రదాయాన్ని స్వాగతించే వారు, విరోధించేవారు ఉన్నారు. - ఎం. మారుతి శాస్త్రి -
కంచికి చేరిన కథలు
పాశ్చాత్య సం స్కృతి వెర్రి తలలు వేస్తున్న వేళ.. పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన లేకుండాపోతోంది. టీవీ, వీడియో గేమ్స్‌పై చూపుతున్న శ్రద్ధ సంప్రదాయ ఆటలపై చూపడం లేదు. పెద్దల సాన్నిహిత్యంలో నీతి కథలు వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. సమాజంలో ఉమ్మడి కుటుంబాలకు ఆదరణ లేకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పుడు పండుగ, వేసవి సెలవులను పిల్లలు సంతోషంగా గడిపేవారు. వివిధ శిక్షణలతో ఇప్పుడు వారికి తీరిక కూడా లేకుండాపోతోంది. కామారెడ్డి, న్యూస్‌లైన్: ‘అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు’లాంటి కథలను పిల్లలు ఆసక్తి గా వినేవారు. తాత, నాయినమ్మల ఒడిలో కూర్చుని పిల్లలు కథలను మెదడుకు ఎక్కించునేవారు. మనవలు, మనమరాండ్లకు కథలు చె ప్పడం ద్వారా తాత, నాయినమ్మలు కూడా ఎన్నో అనుభూతుల కు లోనయ్యేవారు. మనవలు, మనవరాళ్లు ఉత్తములుగా ఎదుగుతారని ఊహించుకుని మురిసిపోయేవారు. పిల్లలు కూడా తాత, నా యినమ్మలు చెప్పే కథలను ఆసక్తిగా వినేవారు. ఆ కథల్లోని సారాంశాన్ని గుర్తించి అందులోని నీతి ని అర్థం చేసుకునేవారు. కథలు ఇంకా, ఇంకా చెప్పమని నిద్రపోయేదాక వారి వెంట పడేది. కథల్లోని మంచిని మనసులో నింపుకుని జీవితాంతం గుర్తుంచుకుని తమ భావి జీవితంలో స్నేహితులతో వాటిని పంచుకునేవారు. నైతిక విలువల నిర్మాణంలో కథలు ప్రేరణగా ఉపయోగపడేవి. ఇదంతా గతం. యాంత్రిక జీవనానికి తోడు మనుషుల్లో పెరిగిన స్వార్థం మూలంగా ఉమ్మడి కుటుంబాల ఉనికి కరువైంది. పట్టణాలేగాకుండా పల్లెల్లోనూ ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. ఇప్పటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంటు పాఠశాలలకు పంపుతూ, వారి చదువుల కోసమేనంటూ పట్టణాలకు వలస వెళుతున్నారు. పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డ పిల్లలు పల్లె ఒడిలో నేర్వాల్సిన ఆట, పాటలను మరిచిపోతున్నారు. దానికి తోడు పల్లెను పట్టుకుని ఉండే తాత, నాయినమ్మల అనుబంధాలకూ దూరమవుతున్నారు. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో వచ్చే సెలవులతోపాటు వేసవి సెలవుల సమయంలోనూ పిల్లలకు స్పెషల్ క్లాసులని, ఇతర వ్యాపకాల్లో శిక్షణలంటూ కథలకు దూరం చేస్తున్నారు. ఆట, పాటలూ అంతే పల్లె ఒడిలో ఎన్నో రకాల ఆట, పాటలు ఉండేవి. పల్లెల్లో చిర్రగోనె, గోళీలాట, చెట్టిరక, కబడ్డీ, అష్టచెమ్మ, తొక్కుడుబిచ్చ, పచ్చీసు వంటి ఆటలు ఇప్పటి పిల్లలకు తెలియకుండాపోతున్నాయి. చెరువులు, కుంటల్లో మునిగితేలుతూ ఈత నేర్చుకునేవారు. పచ్చని పంట పొలాల్లో ఒడ్లవెంట తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించేవారు. ప్రకృతి ప్రసాదితమైన పండ్లు, కాయలు తెంపుకుని తినే పరిస్థితులు ఇప్పటి పిల్లలకు లేకుండాపోయాయి. పల్లె అందాలు, పల్లె అనుభూతులు అనేవి వారికి దూరమవుతున్నాయి. చదువు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ ఆటలు వంటివి మాత్రమే వారి దరిచేరుతున్నాయి. తద్వారా వారిలో మానసిక వికాస ధోరణి తగ్గిపోతోంది. అనుబంధాలకు దూరమవుతున్నారు ఉమ్మడి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులలో అనుబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. పిల్లలకు కనీసం నాయినమ్మ, తాతలతో సంబంధాలు లేకుండా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రక్తసంబంధీకులతోనే అనుబంధాలు దూరం కావడం మూలంగా సమాజంతో వారికి సరైన అవగాహన కుదరడం లేదు. దీంతో పిల్లల్లో సామాజిక స్పృహ అనేది లేకుండాపోతోంది. నేను, నా జీవితం అన్న ధోరణులు పెరుగుతున్నాయి. ఇది స్వార్థానికి కారణమై, కన్నవారిని కూడా పట్టించుకోలేని పరిస్థితులకు నెడుతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే చూస్తుండడంతో డబ్బు కోసం క్రూరత్వం పెరిగిపోతోంది. ఇప్పటికైనా పిల్లలను కథలు నేర్పిస్తే భవిష్యత్ బాగుంటుంది. -
వేదగోదావరికి దివ్యమంగళ హారతులు
భారతదేశం వేదభూమి. ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్యభూమి. సనాతన సంస్కృతీ సంప్రదాయాలను ఎనలేని శ్రద్ధాభక్తులతో పాటించే కర్మభూమి. పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని కూడా పూజించే ధన్యభూమి. తమ పావన జలాల స్పర్శతో భక్తుల పాపాలను హరించే పుణ్యనదులు గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న తదితర పరమపావన తీర్థాలు. అటువంటి నదులను దేవతా స్వరూపాలుగా భావించి, ఆ జలాలకు దివ్యమంగళ హారతులు ఇచ్చే కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది. ముఖ్యంగా గంగానదికి ప్రతిరోజూ జరిగే హారతి కన్నులపండువుగా ఉంటుంది. జీవనది అయిన గోదావరీ మాతకు కూడా ఇటీవలి కాలంలో హారతి ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టింది బుద్ధవరపు దాతృత్వ సంస్థ. గత నాలుగేళ్లుగా ఈ సంస్థవారు ప్రతి పున్నమినాడూ వేదపండితుల పవిత్ర మంత్రోచ్ఛారణతో అంగరంగ వైభవంగా గోదావరి నదికి హారతులు ఇస్తున్నారు. వేలాదిమంది భక్తులు ఈ సుందర దృశ్యాన్ని కన్నులారా తిలకిస్తూ ఉండగా... సాక్షాత్తూ గోదావరీ మాతయే స్వయంగా ఈ హారతిని స్వీకరిస్తోందా అన్నట్లుగా జ లాలు పరవళ్లు తొక్కుతుంటాయి. షోడశ కళలు వర్థిల్లే పౌర్ణమినాడు ఆ కళలు ఉట్టిపడేట్లుగా అమ్మవారికి షోడశ హారతులు ఇస్తుంటారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా సమవృష్టి ఉండేలా అమ్మవారికీ మహానీరాజనం సమర్పిస్తారు. లోకకల్యాణాభిలాషతో అమ్మవారికి పదహారు రకాల హారతులు ఇస్తున్నారు. అవి 1.ఏకహారతి, 2. నేత్రహారతి 3. బిల్వహారతి 4. పంచహారతి 5. సింహ హారతి 6. నృత్యహారతి 7. సర్పహారతి 8. నాగహారతి 9. చక్రహారతి 10. సుదర్శన హారతి 11.ధూపహారతి 12. దీపహారతి 13. అఖండ కర్పూర హారతి 14. కుంభ హారతి 15.నక్షత్ర హారతి 16. ముద్దహారతి. సాక్షాత్తూ సప్తరుషులే ఈ హారతులు ఇస్తున్నట్లుగా ఏడుగురు వేదపండితులు అమ్మవారికి జేగంటానాదం చేస్తూ, మంగళవాయిద్యాలు ఇస్తూ... ఛత్రచామర వింజామరలతో, వేదమంత్రోచ్ఛారణతో ఈ పవిత్ర కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగుతోంది. గత ముప్పై ఆరు నెలలుగా గోదావరి పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం కార్తికమాసం సందర్భంగా మరింత మంగళకరంగా జరగనుంది. అత్యంత పెద్ద బింబంగా, స్వచ్ఛమైన తెల్లని కాంతులతో వెన్నెలలు కురిపించే, కార్తిక పౌర్ణమినాడు ఈ హారతి కార్యక్రమం గోదావరీ మాత భక్తులకు కనువిందు చేయనుందని ట్రస్ట్ సమన్వయ కర్త ఇంద్రగంటి రామచంద్రగోపాలం అంటున్నారు. - డి.వి.ఆర్. కార్తిక సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత? కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైనఅగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. -
ఒక్కేసి పువ్వేసి చందమామ..
ప్రపంచీకరణం ఎన్ని హొయలు పోతున్నా ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు ప్రభావితం కావనడానికి బతుకమ్మ పండుగ చక్కని ఉదాహరణ. తెలంగాణ ప్రాంతంలోని అతిముఖ్యమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ ప్రజల జీవితాల్లో మమేకమైంది. రాత్రి కురిసిన మంచులో విప్పారిన రంగురంగుల పూలను పోటీపడి కోసుకొచ్చి వాటితో అందంగా బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తితో ఆడిపాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా వేడుకలను కలుపుకుంటే ఇరవై రోజులపాటు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ సంబరాలు జరుపుకుంటారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాల సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. బతుకమ్మ పండుగకు పురాణ, ఇతి హా స, చారిత్రాత్మమైన నేపథ్యాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. లయకారుడు పరమ శివుడి అర్ధాంగి, జగన్మాత పార్వతీదేవే బతుకమ్మ అని ప్రజల నమ్మకం. ఇందుకు దక్షయజ్ఞం కథ ప్రామాణికంగా వాడుకలో ఉంది. దక్షుడి కూతురైన పార్వతి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి పిలవని పేరంటంగా వెళ్తుంది. అక్కడ ఆమెకు, ఆమె భర్త పరమేశ్వరుడికి అవమానకరమైన పరిస్థితులు పరోక్షంగా ఎదురవుతా యి. పుట్టింట్లో ఎదురైన ఆ అవమానాన్ని తట్టుకోలేని పార్వతి యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె ప్రాణత్యాగాన్ని జీర్ణించుకోలేని ప్రజలు, భక్తులు శోకంతో ముక్తకంఠంగా బతుకమ్మా.. బతుక మ్మా అంటూ విలపించగా కరుణించిన జగన్మాత ప్రత్యక్షమై భక్తులను ఓదార్చిందని.. ఆనాటి నుంచి ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారనే కథ పూర్వ కాలం నుంచి ప్రచారంలో ఉంది. తొమ్మిది రోజుల వేడుక తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుక మ్మ పండుగను మహిళలు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వర్షరుతువు చివరి దశలో తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో విరబూసే తంగేడు, బీర, గుమ్మడి, కట్లపూలు, బంతిపూలు, పొలాల గట్ల మీద లభించే ఎన్నో రకాల పూలను కోసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు. అందంగా పేర్చిన బతుకమ్మను గ్రామ చావడిలోగానీ దేవాలయంలోగానీ చెరువులు, కుంటల వద్దకు గానీ తీసుకెళ్లి మహిళలు పాడలు పాడుతూ అందుకు లయబద్ధంగా పాదాలు కదుపుతూ వలయాకారంలో తిరుగుతారు. వారు పాడే పాటల్లో పురాణ, ఇతిహాసాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, పేదల బతుకులు, కష్టాలు, కన్నీళ్లు, ప్రేమలు, బంధాలు, మానవ సంబంధాలను ఆవిష్కరిస్తా రు. చివరి రోజున చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసిన అనంతరం ఒకరికొకరు వాయినా లు ఇచ్చి పుచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. పెద్దల ఆత్మశాంతి కోసం చనిపోయిన ఇంటిపెద్దలకు ఆత్మశాంతి జరగాలని పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. ఉదయ మే తలస్నానం ఆచరించి పల్లెంలో బియ్యం పోసి మోదుగాకు విస్తరిలో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, అందుబాటులో ఉండే కూరగాయలు వోనగాయ, చెమ్మకాయ, బెండకాయ, బుడమకాయ, ఆనపకాయ, రూపాయి, కుంకుమ డబ్బి పెట్టుకుని వస్తారు. అయ్యగారింటికి వెళ్లి అతనితో బొట్టుపెట్టించుకుని తిరిగి ఇంటికి వచ్చాక భోజనాలు చేస్తారు. ఈ రోజున బియ్యం ఇవ్వడం వీలులేని పరిస్థితి ఉన్నవారు దసరారోజున ఇస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ భాద్రపద బహుళ అమావాస్యను పెత్రమాస(పితృ అమావా స్య) అంటారు. ఆ రోజున పేర్చే మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూవు బతుకమ్మగా పిలుస్తారు. గ్రామంలోని శివాల యాలు, ఆంజనేయస్వామి ఆలయాలు మొదలైన చోట్ల బతుకమ్మను ఆడతారు. రెండోరోజు నుంచి ఒక్కోచోట బతుకమ్మలను ఉంచి ఆడిపాడతారు. ఆరోరోజు అర్రెంగా భావిం చి బతుకమ్మను ఆడరు. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. మరో కథ ఒక గ్రామంలో పుట్టిన ప్రతీ బిడ్డ పురిటిలోనే చనిపోతుండడంతో తీవ్ర శోకం లో మునిగిన ప్రజలు ఓ మునిని ఆశ్రయించారు. జగన్మాతను ప్రార్థిస్తే శుభం జరుగుతుందని, ఇకనుంచి పుట్టిన ప్రతీ ఆడబిడ్డకు బతుకమ్మ అని, మగబిడ్డకు బతుకయ్య అని నామకర ణం చేయాలని ఆదేశిస్తాడు. ప్రజలు అలా చేయడంతో మరణాలు ఆగిపోయాయని ప్రతీతి. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పురిటిలో పిల్లలు చనిపోతున్న కుటుంబాల్లో బతుకమ్మ, బతుక య్య పేర్లు పెట్టే ఆచారం ఉంది. బతుకమ్మ పుట్టుచరిత్రను తెలియజేసే ఈ పాటను మొదట పాడిన తరువాతే ఇతర బతుకమ్మ పాటలను పాడతారు. 200ఏళ్ల నుంచే ఈ పాట ప్రచారంలో ఉన్నట్టు చెబుతారు. శ్రీలక్ష్మి దేవియు చందమామ - సృష్టి బ్రతుకమ్మయ్యె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ - భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ - ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ - అతి సత్యవతి యండ్రు చందమామ నూరునోములు నోచి చందమామ - నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యు చందమామ - వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ - తరగని శోకమున చందమామ ధనరాజ్యమును బాసి చందమామ - దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ - వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ - పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ - వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ - పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ - జన్మించ్చె శ్రీలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ - అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ - కశ్యపాంగిరసులు చందమామ అత్రి వశిష్ఠులూ చందమామ - ఆ కన్నియను జూచి చందమామ బ్రతుకు గనె ఈ తల్లి చందమామ - బ్రతుకమ్మ యనిరంత చందమామ