దక్షిణ అమెరికా భూభాగంలో ఒకప్పుడు వర్ధిల్లిన ఇన్‌కా నాగరికత స్పానిష్ దాడుల దెబ్బకు పదహారో శతాబ్ది నాటికి దాదాపుగా కనుమరుగైంది. అయితే, ఇన్‌కా నాగరికత అవశేషాలు ఇక్కడి జనాల్లో ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి. ఇన్‌కా నాగరికత నాటి సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజల వేడుకల్లో ప్రతిఫలిస్తుంటాయి. పెరులోని ప్యూనో ప్రాంతంలో జరిగే ప్యూనో వారోత్సవాలు నేటికీ పురాతన ఇన్‌కా సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఏటా నవంబర్ మొదటివారంలో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల్లోనూ నవంబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘ప్యూనో డే’ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు.
పెరు ఆగ్నేయ ప్రాంతంలో ప్యూనో ప్రావిన్స్ ఉంది.
దీని రాజధాని ప్యూనో నగరం. టిటికాకా సరోవర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పెయిన్ అధీనంలోకి వచ్చాక, స్పానిష్ రాజప్రతినిధి పెడ్రో ఆంటోనియో ఫెర్నాండేజ్ డి క్యాస్ట్రో 1668లో ప్యూనో నగరాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు ఈ ప్రాంతలో ఇన్‌కా నాగరికత ఉజ్వలంగా వర్ధిల్లింది. స్పానిష్ పాలకుల ప్రభావంతో స్థానిక కెచువా ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా, తమ పూర్వ ఆచారాలను వదులుకోలేదు. ఇన్‌కా సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మాంకో కాపాక్ జయంతి సందర్భంగా నవంబర్ 5న ‘ప్యూనో డే’ జరుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇన్‌కా ప్రజలు ‘ఇన్‌టీ’గా పిలుచుకునే సూర్యుడి కొడుకు మాంకో కాపాక్. అతడే ఇన్‌కా ప్రజలకు మూలపురుషుడని చెబుతారు. ఇన్‌కా నాగరికత కాలంలో ఈ ప్రాంతంలో కూజ్‌కో నగరం ఉండేది.
ప్యూనో వారోత్సవాలను ఇక్కడి ప్రజలు ఇన్‌కా సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు. ఇన్‌కా సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపుల్లో పాల్గొంటారు. సంప్రదాయ వాద్య పరికరాలను మోగిస్తూ, వీథుల్లో తిరుగుతూ పాటలు పాడతారు. ప్యూనో నగర కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికలపై సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. టిటికాకా సరోవరంలో సంప్రదాయ పడవల్లో నౌకా విహారాలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మాంకో కాపాక్ జీవిత విశేషాలను ప్రదర్శిస్తారు. పురాతన పద్ధతుల్లో జరిగే ఈ ప్యూనో వారోత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment