విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జీఐఎస్ సదస్సు కోసం సిద్ధమవుతున్న ప్రాంగణాలు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ద్వారా కేవలం పెట్టుబడుల ఆకర్షణే కాకుండా రాష్ట్ర హస్తకళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వీటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిం చడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. సదస్సులో చర్చాగోగోష్ఠ లకే పరిమితం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమివ్వనుంది.
ఇందులో భాగంగా అటు సంప్రదాయ కళలకు కూడా పెద్దపీట వేయనుంది. మెడలో వేసుకునే బ్యాడ్జీల దగ్గర నుంచి కార్యక్రమంలో పాల్గొనే వారికి ఇచ్చే కిట్ల వరకు అన్నింటిలోనూ రాష్ట్ర హస్తకళలకు ప్రాచుర్యం కల్పిం చనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రెండుసార్లు సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తోలుబొమ్మల తయారీలో వినియోగించే మెటీరియల్‌తో కూడిన బ్యాడ్జీలు చేసి.. వాటి వెనుక పెడన కలంకారీ డిజైన్లను ముద్రించారు. ఆహూతులకు ఇచ్చే నోట్‌బుక్స్‌ను కూడా కలంకారీ డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పెన్నులపై రాష్ట్ర పక్షి.. చిలుక లోగోతో పాటు అడ్వాంటేజ్ ఏపీ అని ముద్రించారు. ముఖ్య అతిథులకు సిల్వర్ పిలిగ్రీతో చేసిన రాష్ట్ర జీఐఎస్ లోగో బహూకరిస్తారు.
గిఫ్ట్ బాక్సుల్లో ఎన్నో ప్రత్యేకతలు
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకు ఇచ్చే గిఫ్ట్ బాక్స్‌ల్లో చాలా ప్రత్యేకతలున్నాయి. సిరామిక్ ప్లేట్, పెన్ను, అరకు కాఫీ, వుడెన్ కోస్టర్స్‌తో కూడిన గిఫ్టు బాక్స్‌లను ఇవ్వనున్నారు. ఈ సిరామిక్ ప్లేట్‌ను కలంకారీ డిజైన్‌తో అందంగా తీర్చిదిద్ది.. దాని వెనుక రాష్ట్ర చిహ్నం, జీఐఎస్ లోగోను ముద్రించారు.
బ్లాక్ కలంకారీ డిజైన్‌తో వుడెన్ కోస్టర్స్‌ను అందంగా రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా గిఫ్ట్ బాక్స్‌లపైనా కలంకారీ డిజైన్‌ను ముద్రించారు. సదస్సులో వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడక్ట్ కింద రాష్ట్రంలోని హస్తకళలు, వివిధ ఉత్పత్తులకు ప్రచారం కల్పిం చేలా ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
కూచిపూడి, జానపద కళలకు పెద్దపీట..
సదస్సు జరిగే రెండు రోజులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కూచిపూడి నృత్యం, జానపద కళలకు పెద్దపీట వేశారు. మార్చి 3న తొలిరోజు రాష్ట్ర గీతం.. ‘మా తెలుగు తల్లి’తో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ప్రముఖ నర్తకి యామినీరెడ్డితో కూచిపూడి నృత్యంతోపాటు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తుషార్ కలియాతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర జానపద కళలైన థింసా, తప్పెటగుళ్లు, గరగలు, ఉరుములు, కొమ్ము నృత్యం తదితర ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకోనున్నాయి. సదస్సు రెండో రోజు నవరత్న పథకాలను అందరికీ అర్థమయ్యేలా కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment