ప్రసూతి బహుమతి
పడమటి గాలి ఎన్నో కొత్త విషయాలు మోసుకొస్తుంటుంది. మూడు నాలుగు దశా బ్దాలలో ఈ ప్రభావం మరింత బలపడింది. పడమటి గాలి మోసుకొచ్చిన సాంస్కృతిక సంప్రదాయాల్లో వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్‌డే లాంటివి జరుపుకొనే అలవాటు మన నగరాలకు వచ్చింది. బహుమతి వస్తువులు అమ్మే వ్యాపారంలో ఉన్న వాణిజ్య సంస్థల జోరూ, వారి ప్రకటనల హోరూ ఊరికే ఎందుకు పోతాయి?
ఇప్పుడిప్పుడే ఇలాంటి మరొక కొత్త సంప్రదా యం గురించి వింటున్నాం. దీని పేరు ‘పుష్ ప్రెజెంట్’, తెలుగులో ‘ప్రసూతి బహుమతి’ అనచ్చు. అప్పుడే బిడ్డను కన్న భార్యకు పది నెలలు బిడ్డను మోసిన ఆమె శారీరక శ్రమనూ ముఖ్యంగా ప్రసవ సమయంలో ఆమె పడే వేదననూ గుర్తించి, భర్త ఇచ్చే బహుమతి. ఈ బహుమతిని ప్రసవానికి కొంచెం ముందు గానీ, ప్రసవం జరిగిన కొద్ది రోజు లలో గానీ ఇవ్వాలి.
ఆస్పత్రిలో ప్రసూతి గదిలో ఇవ్వ టం ఉత్తమం. ఇంటికి వచ్చిన తరువాత ఇవ్వటం మధ్యమం. ప్రసవ సమయానికి తగినంత ముందే భార్య భర్తకు తనకెలాంటి ‘పుష్ ప్రెజెంట్’ కావాలో సూచిస్తుంది. ఎలాంటి బహుమతులంటారా? బంగారు ఉంగరాలు, గొలుసులు, వజ్రాల చెవి కమ్మలు, బ్రాస్‌లెట్లు, తల్లీ - బిడ్డా నెక్‌లెస్ సెట్లూ సందర్భోచి తంగా ఉంటాయని వ్యాపార సంస్థల సూచన. అమెరికన్ నటి కిమ్ కార్దాషియాన్‌కు ఈ మధ్య ఆమె భర్త 5 కోట్ల రూపాయల వజ్రపుటుంగరం, ప్రసూతి బహుమతిగా ఇచ్చాడు. బ్రిటీష్ యువరాజు అరుదైన గులాబీ రంగు వజ్రం తన భార్యకు ఇవ్వబోతున్నాడట.
పుష్ ప్రజెంట్‌నే కాస్త సున్నితంగా ‘బేబీమామా గిఫ్ట్’, ‘బేబీ బాబుల్’ అని కూడా ప్రస్తావిస్తుంటారు. మన దేశంలో ఇలాంటి సంబరాలు లేవా? లేకేం, స్తోమత ఉండాలే గానీ ప్రతి రోజూ రోజుకొకటి జరుపుకున్నా, ఇంకా మిగిలిపోయేటన్ని సంబరాలూ, పర్వదినాలూ ఉన్నాయి మనకూ. గర్భస్థదశ నించీ, జన్మాంతం వరకూ మనిషికి జరగ(ప)వలసిన షోడశ కర్మలలో శిశుదశలో జరిగేవి సగం: గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం(చెవి కుట్టించటం) వగైరాలు శాస్త్రోక్త విధులు. ఇవి కాక బోర్లపడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు, పలుకులకు చిలకలు, కూర్చొంటే కుడుములూ, ఇలాంటి వేడుకలకు అవధి లేదు. సంపన్నుల ఇళ్లలో సంతానం కలిగిందంటే జరిగే కోటి సంబరాలలో, ఆ సంతానాన్ని కలగజేసిన ఇల్లాలును బహుమతులతో సత్కరించకుండా ఉండే అవకాశమే లేదు.
ఒకమాట చెప్పుకోవాలి. ఈ ప్రసూతి బహు మతి సంప్రదాయంలో వేడుకేకాకుండా చాలా సబ బు ఉంది. పది నెలల పాటు ఎంతో ఒత్తిడి, మానసి కాందోళనా, శారీరక శ్రమలకు ఓర్చి, బిడ్డను ప్రసవించిన ఆనందమయమైన సమయం బహుమ తులకు సందర్భమే. భార్య భర్తకు బిడ్డను ఎలాగూ బహుమతిగా ఇస్తున్నది. కనక భర్త భార్యకు ఆ సమయంలో తన శక్తికి తగిన బహుమతి ఇవ్వటం సందర్భోచితం. పరస్పరానురాగానికి అది చక్కని చిహ్నం. పాశ్చాత్య దేశాలలో కూడా ఈ కొత్త బహుమతి సంప్రదాయాన్ని స్వాగతించే వారు, విరోధించేవారు ఉన్నారు.
- ఎం. మారుతి శాస్త్రి