కంచికి చేరిన కథలు
పాశ్చాత్య సం స్కృతి వెర్రి తలలు వేస్తున్న వేళ.. పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన లేకుండాపోతోంది. టీవీ, వీడియో గేమ్స్‌పై చూపుతున్న శ్రద్ధ సంప్రదాయ ఆటలపై చూపడం లేదు. పెద్దల సాన్నిహిత్యంలో నీతి కథలు వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. సమాజంలో ఉమ్మడి కుటుంబాలకు ఆదరణ లేకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పుడు పండుగ, వేసవి సెలవులను పిల్లలు సంతోషంగా గడిపేవారు. వివిధ శిక్షణలతో ఇప్పుడు వారికి తీరిక కూడా లేకుండాపోతోంది.
కామారెడ్డి, న్యూస్‌లైన్: ‘అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు’లాంటి కథలను పిల్లలు ఆసక్తి గా వినేవారు. తాత, నాయినమ్మల ఒడిలో కూర్చుని పిల్లలు కథలను మెదడుకు ఎక్కించునేవారు. మనవలు, మనమరాండ్లకు కథలు చె ప్పడం ద్వారా తాత, నాయినమ్మలు కూడా ఎన్నో అనుభూతుల కు లోనయ్యేవారు. మనవలు, మనవరాళ్లు ఉత్తములుగా ఎదుగుతారని ఊహించుకుని మురిసిపోయేవారు. పిల్లలు కూడా తాత, నా యినమ్మలు చెప్పే కథలను ఆసక్తిగా వినేవారు. ఆ కథల్లోని సారాంశాన్ని గుర్తించి అందులోని నీతి ని అర్థం చేసుకునేవారు. కథలు ఇంకా, ఇంకా చెప్పమని నిద్రపోయేదాక వారి వెంట పడేది.
కథల్లోని మంచిని మనసులో నింపుకుని జీవితాంతం గుర్తుంచుకుని తమ భావి జీవితంలో స్నేహితులతో వాటిని పంచుకునేవారు. నైతిక విలువల నిర్మాణంలో కథలు ప్రేరణగా ఉపయోగపడేవి. ఇదంతా గతం. యాంత్రిక జీవనానికి తోడు మనుషుల్లో పెరిగిన స్వార్థం మూలంగా ఉమ్మడి కుటుంబాల ఉనికి కరువైంది. పట్టణాలేగాకుండా పల్లెల్లోనూ ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. ఇప్పటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంటు పాఠశాలలకు పంపుతూ, వారి చదువుల కోసమేనంటూ పట్టణాలకు వలస వెళుతున్నారు. పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డ పిల్లలు పల్లె ఒడిలో నేర్వాల్సిన ఆట, పాటలను మరిచిపోతున్నారు.
దానికి తోడు పల్లెను పట్టుకుని ఉండే తాత, నాయినమ్మల అనుబంధాలకూ దూరమవుతున్నారు. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో వచ్చే సెలవులతోపాటు వేసవి సెలవుల సమయంలోనూ పిల్లలకు స్పెషల్ క్లాసులని, ఇతర వ్యాపకాల్లో శిక్షణలంటూ కథలకు దూరం చేస్తున్నారు.
ఆట, పాటలూ అంతే
పల్లె ఒడిలో ఎన్నో రకాల ఆట, పాటలు ఉండేవి. పల్లెల్లో చిర్రగోనె, గోళీలాట, చెట్టిరక, కబడ్డీ, అష్టచెమ్మ, తొక్కుడుబిచ్చ, పచ్చీసు వంటి ఆటలు ఇప్పటి పిల్లలకు తెలియకుండాపోతున్నాయి. చెరువులు, కుంటల్లో మునిగితేలుతూ ఈత నేర్చుకునేవారు. పచ్చని పంట పొలాల్లో ఒడ్లవెంట తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించేవారు. ప్రకృతి ప్రసాదితమైన పండ్లు, కాయలు తెంపుకుని తినే పరిస్థితులు ఇప్పటి పిల్లలకు లేకుండాపోయాయి. పల్లె అందాలు, పల్లె అనుభూతులు అనేవి వారికి దూరమవుతున్నాయి. చదువు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ ఆటలు వంటివి మాత్రమే వారి దరిచేరుతున్నాయి. తద్వారా వారిలో మానసిక వికాస ధోరణి తగ్గిపోతోంది.
అనుబంధాలకు దూరమవుతున్నారు
ఉమ్మడి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులలో అనుబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. పిల్లలకు కనీసం నాయినమ్మ, తాతలతో సంబంధాలు లేకుండా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రక్తసంబంధీకులతోనే అనుబంధాలు దూరం కావడం మూలంగా సమాజంతో వారికి సరైన అవగాహన కుదరడం లేదు. దీంతో పిల్లల్లో సామాజిక స్పృహ అనేది లేకుండాపోతోంది. నేను, నా జీవితం అన్న ధోరణులు పెరుగుతున్నాయి. ఇది స్వార్థానికి కారణమై, కన్నవారిని కూడా పట్టించుకోలేని పరిస్థితులకు నెడుతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే చూస్తుండడంతో డబ్బు కోసం క్రూరత్వం పెరిగిపోతోంది. ఇప్పటికైనా పిల్లలను కథలు నేర్పిస్తే భవిష్యత్ బాగుంటుంది.