ఒక్కేసి పువ్వేసి చందమామ..
ప్రపంచీకరణం ఎన్ని హొయలు పోతున్నా ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు ప్రభావితం కావనడానికి బతుకమ్మ పండుగ చక్కని ఉదాహరణ. తెలంగాణ ప్రాంతంలోని అతిముఖ్యమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ ప్రజల జీవితాల్లో మమేకమైంది. రాత్రి కురిసిన మంచులో విప్పారిన రంగురంగుల పూలను పోటీపడి కోసుకొచ్చి వాటితో అందంగా బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తితో ఆడిపాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా వేడుకలను కలుపుకుంటే ఇరవై రోజులపాటు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ సంబరాలు జరుపుకుంటారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాల సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.
బతుకమ్మ పండుగకు పురాణ, ఇతి హా స, చారిత్రాత్మమైన నేపథ్యాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. లయకారుడు పరమ శివుడి అర్ధాంగి, జగన్మాత పార్వతీదేవే బతుకమ్మ అని ప్రజల నమ్మకం. ఇందుకు దక్షయజ్ఞం కథ ప్రామాణికంగా వాడుకలో ఉంది. దక్షుడి కూతురైన పార్వతి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి పిలవని పేరంటంగా వెళ్తుంది. అక్కడ ఆమెకు, ఆమె భర్త పరమేశ్వరుడికి అవమానకరమైన పరిస్థితులు పరోక్షంగా ఎదురవుతా యి. పుట్టింట్లో ఎదురైన ఆ అవమానాన్ని తట్టుకోలేని పార్వతి యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె ప్రాణత్యాగాన్ని జీర్ణించుకోలేని ప్రజలు, భక్తులు శోకంతో ముక్తకంఠంగా బతుకమ్మా.. బతుక మ్మా అంటూ విలపించగా కరుణించిన జగన్మాత ప్రత్యక్షమై భక్తులను ఓదార్చిందని.. ఆనాటి నుంచి ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారనే కథ పూర్వ కాలం నుంచి ప్రచారంలో ఉంది.
తొమ్మిది రోజుల వేడుక
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుక మ్మ పండుగను మహిళలు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వర్షరుతువు చివరి దశలో తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో విరబూసే తంగేడు, బీర, గుమ్మడి, కట్లపూలు, బంతిపూలు, పొలాల గట్ల మీద లభించే ఎన్నో రకాల పూలను కోసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు. అందంగా పేర్చిన బతుకమ్మను గ్రామ చావడిలోగానీ దేవాలయంలోగానీ చెరువులు, కుంటల వద్దకు గానీ తీసుకెళ్లి మహిళలు పాడలు పాడుతూ అందుకు లయబద్ధంగా పాదాలు కదుపుతూ వలయాకారంలో తిరుగుతారు. వారు పాడే పాటల్లో పురాణ, ఇతిహాసాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, పేదల బతుకులు, కష్టాలు, కన్నీళ్లు, ప్రేమలు, బంధాలు, మానవ సంబంధాలను ఆవిష్కరిస్తా రు. చివరి రోజున చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసిన అనంతరం ఒకరికొకరు వాయినా లు ఇచ్చి పుచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది.
పెద్దల ఆత్మశాంతి కోసం
చనిపోయిన ఇంటిపెద్దలకు ఆత్మశాంతి జరగాలని పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. ఉదయ మే తలస్నానం ఆచరించి పల్లెంలో బియ్యం పోసి మోదుగాకు విస్తరిలో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, అందుబాటులో ఉండే కూరగాయలు వోనగాయ, చెమ్మకాయ, బెండకాయ, బుడమకాయ, ఆనపకాయ, రూపాయి, కుంకుమ డబ్బి పెట్టుకుని వస్తారు. అయ్యగారింటికి వెళ్లి అతనితో బొట్టుపెట్టించుకుని తిరిగి ఇంటికి వచ్చాక భోజనాలు చేస్తారు. ఈ రోజున బియ్యం ఇవ్వడం వీలులేని పరిస్థితి ఉన్నవారు దసరారోజున ఇస్తారు.
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ
భాద్రపద బహుళ అమావాస్యను పెత్రమాస(పితృ అమావా స్య) అంటారు. ఆ రోజున పేర్చే మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూవు బతుకమ్మగా పిలుస్తారు. గ్రామంలోని శివాల యాలు, ఆంజనేయస్వామి ఆలయాలు మొదలైన చోట్ల బతుకమ్మను ఆడతారు. రెండోరోజు నుంచి ఒక్కోచోట బతుకమ్మలను ఉంచి ఆడిపాడతారు. ఆరోరోజు అర్రెంగా భావిం చి బతుకమ్మను ఆడరు. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు.
మరో కథ
ఒక గ్రామంలో పుట్టిన ప్రతీ బిడ్డ పురిటిలోనే చనిపోతుండడంతో తీవ్ర శోకం లో మునిగిన ప్రజలు ఓ మునిని ఆశ్రయించారు. జగన్మాతను ప్రార్థిస్తే శుభం జరుగుతుందని, ఇకనుంచి పుట్టిన ప్రతీ ఆడబిడ్డకు బతుకమ్మ అని, మగబిడ్డకు బతుకయ్య అని నామకర ణం చేయాలని ఆదేశిస్తాడు. ప్రజలు అలా చేయడంతో మరణాలు ఆగిపోయాయని ప్రతీతి. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పురిటిలో పిల్లలు చనిపోతున్న కుటుంబాల్లో బతుకమ్మ, బతుక య్య పేర్లు పెట్టే ఆచారం ఉంది.
బతుకమ్మ పుట్టుచరిత్రను తెలియజేసే ఈ పాటను మొదట పాడిన తరువాతే ఇతర బతుకమ్మ పాటలను పాడతారు. 200ఏళ్ల నుంచే ఈ పాట ప్రచారంలో ఉన్నట్టు చెబుతారు.
శ్రీలక్ష్మి దేవియు చందమామ - సృష్టి బ్రతుకమ్మయ్యె చందమామ
పుట్టిన రీతి జెప్పె చందమామ - భట్టు నరసింహకవి చందమామ
ధర చోళదేశమున చందమామ - ధర్మాంగుడను రాజు చందమామ
ఆరాజు భార్యయు చందమామ - అతి సత్యవతి యండ్రు చందమామ
నూరునోములు నోచి చందమామ - నూరు మందిని గాంచె చందమామ
వారు శూరులయ్యు చందమామ - వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు చందమామ - తరగని శోకమున చందమామ
ధనరాజ్యమును బాసి చందమామ - దాయాదులను బాసి చందమామ
వనితతో ఆ రాజు చందమామ - వనమందు నివసించె చందమామ
కలికి లక్ష్మిని గూర్చి చందమామ - పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచు చందమామ - వెలది తన గర్భమున చందమామ
పుట్టుమని వేడగా చందమామ - పూబోణి మది మెచ్చి చందమామ
సత్యవతి గర్భమున చందమామ - జన్మించ్చె శ్రీలక్ష్మి చందమామ
అంతలో మునులునూ చందమామ - అక్కడికి వచ్చిరి చందమామ
కపిలగాలవులునూ చందమామ - కశ్యపాంగిరసులు చందమామ
అత్రి వశిష్ఠులూ చందమామ - ఆ కన్నియను జూచి చందమామ
బ్రతుకు గనె ఈ తల్లి చందమామ - బ్రతుకమ్మ యనిరంత చందమామ