భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ. అయితే.. పూలనే గౌరీదేవిగా భావించి బతుకమ్మగా పూజించటం తెలంగాణ ప్రత్యేకత. మహిళల మధ్య, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలను పెంచే పండుగ ఇది. బతుకమ్మ పండుగను పెత్రమావాస్య (భాద్రపద బహుళ అమావాస్య) నుండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుక్ల అష్టమి అనగా, దుర్గాష్టమి నాడు స్త్రీలంతా కలిసి బతుకమ్మను దగ్గరలోని చెరువులోనో, కొలనులోనో ఓలలాడిస్తారు. నీటిలో వదులుతారు. చివరి రోజున నైవేద్యంగా తొమ్మిది రకాల సద్దులు చేస్తారు.
పూర్వం చోళ దేశంలో ధర్మాంగుడు అనే రాజు వుండేవారు. అతని భార్య సత్యవతి. వారు సంతానం కోసం నూరు నోములు నోచి నూరు మందిని కన్నారు. వారు గొప్ప శూరులైనప్పటికీ శత్రువుల చేతిలో చనిపోతారు. ఆ బాధతో రాజు, రాణి రాజ్యం వదిలి, వనంలో నివసిస్తూ లక్ష్మీ దేవి గురించి తపస్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఏ వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు రాణి లక్ష్మీ దేవితో, ‘‘నువ్వే నాకు కూతురిలా నా కడుపున పుట్టాలి’’ అంటుంది. అందుకు లక్ష్మీదేవి సంతోషించి, ‘తథాస్తు’ అంది. ఆ సమయంలో మునులు, మహర్షులంతా వచ్చి లక్ష్మీ దేవి బతకడానికి వచ్చింది కనుక, ‘బతుకమ్మ’ అని పేరు పెడతారు. రాజు రాణి సంతోషంగా వారి రాజ్యానికి వెళ్లి రాజ్యపాలన చేస్తుంటారు. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు చక్రాంగుడు అనే పేరుతో రాజు వేషంలో ఈ రాజు ఇంటికి వచ్చి, వారి పుత్రికైన లక్ష్మీ దేవిని వివాహం చేసుకుని ఇల్లరికం ఉంటాడు.
బతుకమ్మ రూపంలో లక్ష్మీదేవి, విష్ణువు రూపంలోని చక్రాంగుడు పిల్లపాపలతో సిరిసంపదలతో సంతోషంగా ఉంటారు. అలా ఈ జగతిలో శాశ్వతంగా ఆ లక్ష్మీ దేవి బతుకమ్మగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు పుట్టింటికి వచ్చినట్టు వచ్చి, ప్రజల మధ్య ఉండి అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించి చివరి రోజు అత్తవారింటికి వెళ్తున్నట్టుగా ఒక విశ్వాసంతో, భక్తితో ఆ పూల బతుకమ్మను నీటిలో సాగనంపి, మరుసటి సంవత్సరం మళ్లీ రావాలని గౌరీదేవి, లక్ష్మీ దేవి రూపంలో ఉన్న బతుకమ్మను మహిళలంతా వేడుకుంటారు. ఔషధ గుణాలున్న పూలను వాడటం వలన వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాలను నివారించుకోవచ్చు. ఎన్నో అనారోగ్యాలను నివారించడంలో తంగేడు వంటి అడవిపూలు మంచి ఔషధంలా పనిచేస్తాయి.
తొమ్మిది నైవేద్యాలు
ఈ తొమ్మిది రోజులూ ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యాలనే నైవేద్యాలలో ఉపయోగిస్తారు. రోజుకొక రకమైన పులిహోర, చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల సద్దులు చేస్తారు. చింతపండు, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, పెసరపొడి, ఆవ పొడి, దద్ధ్యోదనం, బెల్లం అన్నం, నిమ్మకాయ, మామిడికాయ ఇలా అందుబాటులో ఉన్నవాటితో చేస్తారు. సద్దుల బతుకమ్మను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, నెయ్యి కలిపిన సత్తు పిండి, తులసీ దళాలు మొదలైనవి తీసుకెళ్తారు. వర్షాకాలంలో శరీరానికి వేడి కలగాలని నువ్వులు, పల్లీలు మొదలైనవి బెల్లంతో కలిపి నివేదన చేస్తారు. బతుకమ్మ కు పాడే పాటలు జీవితంలోని అనేక కోణాలను తెలియచేసేవిగా ఉంటాయి.
– లేళ్లపల్లి శ్రీదేవి, సాంస్కృతిక అధ్యయనవేత్త
పూలు.. పాటలు
బతుకమ్మ పండుగలో పూలకెంత ప్రాధాన్యముందో పాటలకీ అంతే ప్రాధాన్యం ఉంది. బతుకమ్మ పాటలన్నీ ఎప్పుడో పూర్వకాలంలో అజ్ఞాత మహిళలు ఆశువుగా అల్లినవే. సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలిలో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైన పాటలివి. వీటిలోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, పురాణేతిహాస, చారిత్రక ఘట్టాలతోపాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటలలో ప్రధాన వస్తువులు. బతుకమ్మ పండుగ వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి అంతా పూల వనంలా కనువిందు చేస్తుంది. ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీత జడల పూలు వంటి అడవిపూలనే ఎంచుకొని బతుకమ్మను పేర్చుతారు.
Comments
Please login to add a commentAdd a comment