సుందర్‌గఢ్ సభలో మోదీకి సత్కారం
సుందర్‌గఢ్/సోనెపూర్: ఎన్నికల సమయంలో ప్రతిసారి కాంగ్రెస్ పేదరికాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీని వదిలించుకోనంత కాలం పేదరిక నిర్మూలన సాధ్యం కాదని అన్నారు. ఒడిశాలోని సుందర్‌గఢ్, సోనెపూర్‌లలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కారు సమర్థవంతమైన విధానాలను అవలంబించడంలో విఫలమైందని, అందుకే ఇంకా ఒడిశాలో చాలా మంది పేదరికంలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటుందని, ఫలితంగా డబుల్ ఇంజిన్ వేగంతో ఒడిశా దూసుకుపోతుందని అన్నారు.
పన్ను భారం పెంచుతుంది..
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సామాన్యుల నడ్డి విరగ్గొట్టేలా ఉన్నాయని మోదీ అన్నారు. ఆ హామీలు కావాలంటే పన్నులు పెంచాలని, అది అంతిమంగా సామన్యులపై భారం పెంచుతుందని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలైతే చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు అందుతున్న సరుకులు ప్రియం అవుతాయి. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెబుతూ కాంగ్రెస్ రాజకీయంగా ప్రయోజనం పొందుతోంది. కాంగ్రెస్ తొలగిపోతే పేదరికం దానంతట అదే పోతుంది. పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ చాన్నాళ్లుగా నినాదాలిచ్చినా, ఈ దిశగా ఒక్క చర్య కూడా చేపట్టలేదు’ అని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేడీలు పేదరికాన్ని రాజకీయ ఆయుధంగా మలచుకోవడంతో ఒడిశాలో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిందని అన్నారు.
కార్యకర్తల స్వేదఫలితం బీజేపీ
బీజేపీ 39వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. కార్యకర్తల శ్వేదం, శ్రమతోనే బీజేపీ ఏర్పడిందని, వారసత్వం, డబ్బుకు పార్టీలో చోటులేదని అన్నారు. ‘ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తితోనే బీజేపీ దృఢంగా మారింది. సాటి భారతీయులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరసలో ఉంది. మనం చేపట్టిన అభివృద్ధి పనులతో దేశం నలుమూలలా ప్రజాభిమానం సంపాదించుకున్నాం’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment