కాకినాడ నగరం
మండపేట: జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం డిమాండ్ రూ.115.31 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.61.63 కోట్లు మాత్రమే వసూలైంది. 74.5 శాతం పన్నుల వసూళ్లతో జిల్లాలో పెద్దాపురం పురపాలకసంఘం ముందంజలో ఉండగా 43 శాతంతో పిఠాపురం చివరిస్థానంలో ఉంది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా నూరుశాతం వసూళ్లు ప్రశార్థకంగా మారింది. ఆర్థిక సంఘం నిధుల విడుదలకు నూరుశాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేయడంతో అధికారుల అలసత్వం పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరకార్పొరేషన్లతోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 2,41,493 ప్రైవేటు భవనాలున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు నాటికి ఆయా భవనాలు ద్వారా మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 115.31లు డిమాండ్ కాగా ఇప్పటి వరకు కేవలం రూ. 61.63 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాకినాడ నగర పాలక సంస్థలో 52.8 శాతం వసూలు కాగా, రాజమహేంద్రవరంలో 51.27 శాతం వసూలయ్యాయి. అమలాపురం మున్సిపాల్టీలో 56.3 శాతం, రామచంద్రపురంలో 48.8 శాతం, పిఠాపురంలో 43.9 శాతం, మండపేటలో 68.2 శాతం, తునిలో 72 శాతం, పెద్దాపురంలో 74.5 శాతం, సామర్లకోటలో 49.6 శాతం పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 69.2 శాతం, ఏలేశ్వరంలో 65 శాతం, ముమ్మిడివరంలో 50 శాతం పన్నులు వసూలయ్యాయి.
నూరుశాతం వసూలు గగనమే
14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు మేరకు స్థానిక సంస్థలు నూరుశాతం పన్నులు వసూలు తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్నుల వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతర సమీక్ష జరుగుతోంది. మరో ఐదు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితితో నూరుశాతం వసూలు గగనమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment