స్ట్రామ్‌వాటర్ పనులపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ జె. నివాస్
పటమట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు నత్తనడక సాగటంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్ట్రామ్ పనులు జామ్’ శీర్షికన ఈనెల 2వ తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కమిషనర్ జె.నివాస్ బుధవారం పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, ఎల్‌అంట్‌టీ అధికారులతో సమావేశమయ్యారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో కాలువలను బ్లాక్ చేయటం వల్ల మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రెయిన్‌లో వచ్చే మురుగునీటిని మోటర్ల ద్వారా పక్కనున్న డ్రెయిన్లలోకి మళ్లించటంతోపాటు పనులు పూర్తయిన వెంటనే మిగిలిన మట్టి, వ్యర్థ పదార్థాలను తొలగించి రోడ్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రెయినేజీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో యూజీడీ పైప్‌లైన్, తాగునీటి పైప్‌లైన్ ఎలాంటి డ్యామేజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే అవుట్‌ఫాల్ డ్రైయినేజీ పనులు నిర్మాణం పూర్తయిన వెంటనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రెయిన్లపై శ్లాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రామ్‌వాటర్ డ్రైయిన్ పనులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్‌హెల్త్ విభాగం అధికారులు వివరణ ఇచ్చారు. నగరంలో ఇప్పటివరకు సుమారు 98 కిలోమీటర్ల దూరం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిర్మాణపు పనులు పూర్తయ్యిన అన్నిచోట్ల గ్యాపులను అనుసంధానం చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. విశాలాంధ్ర రోడ్డు, ప్రకాశం రోడ్డు, రవీంద్రభారతి స్కూలు వద్ద కల్వర్టుల నిర్మాణపు పనులు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం, లయోలా కళాశాల, పుల్లేటి కాలువ వంటి ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం ప్రాంతాల్లో విస్తరణ జరుగుతున్న కారణంగా సర్వే పూర్తిచేసి ఎలైన్‌మెంట్ ప్రకారం డ్రైయిన్ నిర్మాణాలను అడ్డుగా ఉన్న భవన యజమానులకు టీడీఆర్ బాండ్‌లను అందించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశించారు.
మూడు మిక్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం
స్ట్రామ్‌వాటర్ డ్రెయినేజీ పనులు నిర్వహణ నిమిత్తం మూడు మిక్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని, పనులువేగవంతం చేయటానికి చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. మరో మిక్సింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఎల్‌అండ్‌టీకి సూచించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే అధికారులతో సమన్వయం అయ్యి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ పి.ఆదిశేషు, ఎస్‌ఈ రామచంద్రరావు, ఈఈ ప్రభాకర్; విద్యుత్ శాఖ ఎస్‌ఈ తదితరులు
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment