Stram Water Drainage
-
పనుల నత్తనడకపై కమిషనర్ ఆగ్రహం
పటమట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు నత్తనడక సాగటంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్ట్రామ్ పనులు జామ్’ శీర్షికన ఈనెల 2వ తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కమిషనర్ జె.నివాస్ బుధవారం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, ఎల్‌అంట్‌టీ అధికారులతో సమావేశమయ్యారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో కాలువలను బ్లాక్ చేయటం వల్ల మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రెయిన్‌లో వచ్చే మురుగునీటిని మోటర్ల ద్వారా పక్కనున్న డ్రెయిన్లలోకి మళ్లించటంతోపాటు పనులు పూర్తయిన వెంటనే మిగిలిన మట్టి, వ్యర్థ పదార్థాలను తొలగించి రోడ్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రెయినేజీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో యూజీడీ పైప్‌లైన్, తాగునీటి పైప్‌లైన్ ఎలాంటి డ్యామేజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అవుట్‌ఫాల్ డ్రైయినేజీ పనులు నిర్మాణం పూర్తయిన వెంటనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రెయిన్లపై శ్లాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రామ్‌వాటర్ డ్రైయిన్ పనులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్‌హెల్త్ విభాగం అధికారులు వివరణ ఇచ్చారు. నగరంలో ఇప్పటివరకు సుమారు 98 కిలోమీటర్ల దూరం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిర్మాణపు పనులు పూర్తయ్యిన అన్నిచోట్ల గ్యాపులను అనుసంధానం చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. విశాలాంధ్ర రోడ్డు, ప్రకాశం రోడ్డు, రవీంద్రభారతి స్కూలు వద్ద కల్వర్టుల నిర్మాణపు పనులు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం, లయోలా కళాశాల, పుల్లేటి కాలువ వంటి ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం ప్రాంతాల్లో విస్తరణ జరుగుతున్న కారణంగా సర్వే పూర్తిచేసి ఎలైన్మెంట్ ప్రకారం డ్రైయిన్ నిర్మాణాలను అడ్డుగా ఉన్న భవన యజమానులకు టీడీఆర్ బాండ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశించారు. మూడు మిక్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం స్ట్రామ్‌వాటర్ డ్రెయినేజీ పనులు నిర్వహణ నిమిత్తం మూడు మిక్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని, పనులువేగవంతం చేయటానికి చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. మరో మిక్సింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఎల్అండ్టీకి సూచించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే అధికారులతో సమన్వయం అయ్యి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ పి.ఆదిశేషు, ఎస్ఈ రామచంద్రరావు, ఈఈ ప్రభాకర్; విద్యుత్ శాఖ ఎస్ఈ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాం వాటర్ డ్రెయిన్లకు రూ.461 కోట్లు
నిధులు విడుదల చేసిన కేంద్రం నెల రోజుల్లో వచ్చే చాన్స్ విజయవాడ సెంట్రల్ : నగరానికి నిధుల వరదొచ్చింది. స్ట్రాం వాటర్ డ్రెయినేజీ నిర్మాణం కోసం రూ.461.04 కోట్ల మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. నెలరోజుల వ్యవధిలో ఈ నిధులు నగరపాలక సంస్థకు చేరతాయని పాలకుల అంచనా. సాధ్యమైనంత త్వరలోనే పనులు చేపట్టాలని భావిస్తున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించారు. వంద కిలోమీటర్ల మేర పెద్ద డ్రెయిన్లు, 38 కిలోమీటర్ల మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే నగరానికి వరద ముంపు తిప్పలు తప్పినట్టే. జలమయం నగరంలో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతు న్నాయి. నీరు రోడ్లపై నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. వర్షం వచ్చినపుడు కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలమవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్ల మీదుగానే వర్షపు నీరు ప్రవహించాల్సి వస్తోంది. డ్రెయిన్ల సామర్థ్యం చాలక సమస్యలు వస్తున్నాయి. మేయర్ కృషి ఫలించింది జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా రూ.49.13 కోట్లతో స్ట్రాం వాటర్ డ్రెయిన్లు నిర్మించాలని నిర్ణయించారు. 34 కిలోమీటర్ల మేర డ్రెయిన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధుల కొరత ఎదురవడంతో ఆ పనుల్ని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్ స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారు. రూ.424 కోట్లతో డీపీఆర్‌లు సిద్ధం చేయించారు. ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో పలువురు అధికారులను, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును కలిశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమస్యను వివరించారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారుల సూచన మేరకు.. రూ.462 కోట్లకు డీపీఆర్‌ను రివైజ్ చేశారు. విజయవాడ కష్టాలను వివరించిన మేయర్ వెంటనే ఆదుకోవాల్సిందిగా కోరారు. స్పందిం చిన వెంకయ్యనాయుడు డీపీఆర్‌ను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి కచ్చితంగా నిధులు వస్తాయన్న భరోసాతో మేయర్ ఉన్నారు. ఆశించినట్టే రూ.461.04 కోట్లు నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఇక హ్యాపీడేసే.. : మేయర్ స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.461.04 కోట్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. బుధవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కానికి రూ.1.16 కోట్లతో పాతబోర్లు రిపేరు చేస్తున్నామని, రాజీవ్‌నగర్‌లో రూ.64 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.8కోట్ల వ్యయంతో 6,400 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రోడ్లు గ్రాంట్ రూ.10.30 కోట్లు, నాన్‌ప్లాన్ గ్రాంట్ రూ.8.74 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.8.61 కోట్లు వచ్చాయన్నారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి రూ.10 కోట్లతో 160 పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ ఆవాస యోజన (రే) పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.17 కోట్లు విడుదలయ్యాయని, కార్పొరేషన్ వాటాగా రూ.5 కోట్లు భరించాల్సి ఉందన్నారు. పన్ను వసూలులో రాష్ట్రంలో విజయవాడ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలి చినట్లు మేయర్ తెలిపారు. వారం రోజుల్లో మిగిలిన బకాయిలు వసూలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.68 కోట్లు ఆస్తిపన్ను డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం రూ.82 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. సమగ్ర సర్వే పూర్తయితే ఈ మొత్తం రూ.130 కోట్లకు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని రాబడుతున్నామన్నారు.