పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం కొత్త మెలిక
పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వాటా ఉండాలంటున్న కేంద్రం
ఇందిరమ్మ ఇళ్లలో ప్రజలకు నయాపైసా ఖర్చు ఉండదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హామీ
కేంద్ర ఆదేశాలతో లబ్ధిదారుల వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట.. పట్టణ ప్రాంతాల్లో అంతస్తులుగా నిర్మించే పేదల ఇంటికి లబ్ధిదారు వాటా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ.. కేంద్రం పెట్టే నిబంధనలు పాటిస్తేనే.. పేదల ఇళ్ల కోసం ఢిల్లీ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అంటే.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే గృహ సముదాయాలకు లబ్ధిదారులు వాటా చెల్లించాలి. లేదా ఆ వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి నిధులు అందుతాయి.
నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించే ప్రభుత్వ పథకాల విషయంలో లబ్ధిదారుల వాటా అంశాన్ని కేంద్రం తాజాగా తెరపైకి తెచ్చింది. అయి తే వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లకు లబ్ధిదారుల వాటా లేకున్నా.. అంతస్తుల వారీగా నిర్మించే గృహ సముదాయాల విషయంలో లబ్ధిదారుల వాటా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టే పథకాలకు ఇది వర్తించకున్నా.. కేంద్ర ప్రభుత్వ చేయూతతో అమలు చేసే పథకాల్లో మాత్రం ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నగరంలో పేదలు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకునేందుకు సొంత జాగా ఉండటం కష్టమే. అందుకే అపార్ట్‌మెంట్ల తరహాలో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తోంది. గతంలో వాంబే పథకం, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లు అదే తరహాలో నిర్మితమయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ పథకం కింద కూడా ఇళ్ల సముదాయాలనే నిర్మించి ఇవ్వనుంది. ఈ తరహా ఇళ్లకు లబ్ధిదారుల వాటా చూపాలని కేంద్రం అడుగుతోంది.
పైసా అవసరం లేదన్న రాష్ట్ర సర్కారు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ కేంద్ర నిబంధన ప్రకారం.. యూనిట్ కాస్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం భరించే రూ.5 లక్షలకుతోడు లబ్ధిదారుల వాటాను కూడా చూపించాల్సి వస్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించడంగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంగానీ తప్పదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ఎక్కువ అంతస్తులుగా నిర్మించే ఇళ్లకు వ్యయం ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.ఏడు లక్షల నుంచి రూ.8 లక్షల చొప్పున ఖర్చయ్యాయి. ఈ క్రమంలో యూనిట్ కాస్ట్‌కు అదనంగా అయ్యే మొత్తాన్ని లబ్ధిదారు వాటాగా చూపే చాన్స్ ఉండనుంది.
పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రణాళిక ఏంటి?
తొలుత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో సొంత జాగా ఉన్న పేదల సంఖ్య నామమాత్రమే. అలాంటప్పుడు పేదలకు ఇళ్లు ఎలాగనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ ప్రణాళిక ఏమిటనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment