indiramma house scheme
-
ఇందిరమ్మ ఇంటికి ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట.. పట్టణ ప్రాంతాల్లో అంతస్తులుగా నిర్మించే పేదల ఇంటికి లబ్ధిదారు వాటా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ.. కేంద్రం పెట్టే నిబంధనలు పాటిస్తేనే.. పేదల ఇళ్ల కోసం ఢిల్లీ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అంటే.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే గృహ సముదాయాలకు లబ్ధిదారులు వాటా చెల్లించాలి. లేదా ఆ వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి నిధులు అందుతాయి. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించే ప్రభుత్వ పథకాల విషయంలో లబ్ధిదారుల వాటా అంశాన్ని కేంద్రం తాజాగా తెరపైకి తెచ్చింది. అయి తే వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లకు లబ్ధిదారుల వాటా లేకున్నా.. అంతస్తుల వారీగా నిర్మించే గృహ సముదాయాల విషయంలో లబ్ధిదారుల వాటా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టే పథకాలకు ఇది వర్తించకున్నా.. కేంద్ర ప్రభుత్వ చేయూతతో అమలు చేసే పథకాల్లో మాత్రం ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేదలు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకునేందుకు సొంత జాగా ఉండటం కష్టమే. అందుకే అపార్ట్మెంట్ల తరహాలో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తోంది. గతంలో వాంబే పథకం, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లు అదే తరహాలో నిర్మితమయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ పథకం కింద కూడా ఇళ్ల సముదాయాలనే నిర్మించి ఇవ్వనుంది. ఈ తరహా ఇళ్లకు లబ్ధిదారుల వాటా చూపాలని కేంద్రం అడుగుతోంది. పైసా అవసరం లేదన్న రాష్ట్ర సర్కారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ కేంద్ర నిబంధన ప్రకారం.. యూనిట్ కాస్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం భరించే రూ.5 లక్షలకుతోడు లబ్ధిదారుల వాటాను కూడా చూపించాల్సి వస్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించడంగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంగానీ తప్పదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ఎక్కువ అంతస్తులుగా నిర్మించే ఇళ్లకు వ్యయం ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.ఏడు లక్షల నుంచి రూ.8 లక్షల చొప్పున ఖర్చయ్యాయి. ఈ క్రమంలో యూనిట్ కాస్ట్‌కు అదనంగా అయ్యే మొత్తాన్ని లబ్ధిదారు వాటాగా చూపే చాన్స్ ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రణాళిక ఏంటి? తొలుత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో సొంత జాగా ఉన్న పేదల సంఖ్య నామమాత్రమే. అలాంటప్పుడు పేదలకు ఇళ్లు ఎలాగనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ ప్రణాళిక ఏమిటనే చర్చ జరుగుతోంది. -
పక్షం రోజుల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందని, ఎంపికలో రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండదని చెప్పారు. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించడం లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తాం. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇళ్లకు ప్రత్యేక డిజైన్ అంటూ ఉండదు. లబ్ధిదారులకు ఉన్న జాగా ఆధారంగా వారే కావాల్సిన ఆకృతిలో నిర్మించుకోవచ్చు. అయితే వంటగది, మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా చూడాలి.దశలవారీగా సొమ్ము విడుదలఇందిరమ్మ ఇళ్లకు పునాదులు నిర్మించుకున్నాక రూ.లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ.లక్షన్నర, పైకప్పునకు రూ.లక్షన్నర చొప్పున చెల్లిస్తాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మిగతా మొత్తం అందజేస్తాం. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా జమ చేస్తాం. తొలిదశలో కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇళ్లను మంజూరు చేస్తాం. తదుపరి విడతలో భూమిలేని నిరుపేదలకు స్థలం ఇచ్చి నిధులు అందజేస్తాం. నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేస్తున్నాం. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించేలా చూస్తాం. ఈ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసం 16 శాఖల నుంచి సిబ్బందిని సమీకరిస్తున్నాం.నిధులను సమీకరించుకుంటాం..తొలిదశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతాయి. బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,740 కోట్లను కేటాయించింది. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టి వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. అవసరమైన నిధులను వివిధ మార్గాల్లో సమీకరించుకుంటాం. కొత్తగా ఏర్పడే ఇందిరమ్మ కాలనీల్లో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పిస్తుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెడతాం..గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తేవటంలో విఫలమైంది. మేం ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర నిబంధనలు అనుసరించటంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెట్టాలంటే కూడా పెడతాం. మాకు భేషజాలు లేవు. సర్పంచుల పదవీకాలం పూర్తయినందున ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల్లో వారి ప్రాతినిధ్యం లేదు. తదుపరి దశ నాటికి వారు ఉండేలా అవసరమైతే జనవరి నాటికే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..’’అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈ టర్మ్ అంతా రేవంతే సీఎంసీఎం రేవంత్‌రెడ్డిని మారుస్తారంటూ కొందరు పనిగట్టు కుని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టర్మ్ పూర్తయ్యేందుకు ఇంకా నాలుగేళ్ల ఒక నెల సమయం ఉందని, అప్పటి వరకు రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో విపక్షాలు లేనిపోని ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా.. తాను చెప్పినట్టు రాజకీ య బాంబులు పేలటం తథ్యమని పేర్కొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుదారుల్లో ఎవరు అర్హులు..ఎవరు కాదు అన్న విషయాన్ని ఓ యాప్ తేల్చనుంది. అర్హత ఉంటే దరఖాస్తు ప్రాసెస్ ముందుకు సాగుతుంది..లేకుంటే డిలీట్ అవుతుంది. రాష్ట్ర అధికారులు ఈ యాప్ ఆధారంగా త్వరలో సర్వే ప్రారంభించబోతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దీన్ని తయారు చేసింది. దానినే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున మంజూరు చేసి రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది చివరలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించే కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి దసరా ముందు రోజు ఇందిరమ్మ కమిటీ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సభ్యులు ఇందిరమ్మ పథకానికి అర్హులను తేల్చటంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఇందులో ఈ కమిటీ సభ్యుల కంటే.. ఓ యాప్ మరింత క్రియాశీలంగా వ్యవహరించబోతోంది. నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం ఓ యాప్‌ను రూపొందించింది. అందులో ప్రభుత్వ ఇళ్లు పొందాలంటే ఉండాల్సిన అర్హతలను ఫీడ్ చేసి ఉంచారు. ఇప్పుడు అవే నిబంధనలను రాష్ట్రాలు కూడా కచి్చతంగా అనుసరించాలని, అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పొందేందుకు అర్హత ఏర్పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి అంగీకరిస్తే, ఆ యాప్ ఆధారంగానే లబ్దిదారుల ఎంపిక జరగాలి. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో పీఎంఏవై నిధులు పొందాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..ఆ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగానే లబి్ధదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టబోతోంది. ముందుగా దరఖాస్తుల ఫీడ్ ప్రజాపాలన, ఇతర పద్ధతుల్లో అధికారులకు అందిన దరఖాస్తులను ఈ యాప్‌లో ఇప్పుడు ఫీడ్ చేయబోతున్నారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలను యాప్‌లో ఫీడ్ చేయగానే, ఈ పథకానికి దరఖాస్తుదారుకు అర్హత ఉందా లేదా అన్నది అది తేల్చనుంది. అందులో అర్హత ఉందని తేలిన దరఖాస్తులనే ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. వాటి ఆధారంగానే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా అర్హతను బేరీజు వేస్తారు. అలా అర్హుల జాబితా సిద్ధం కాగానే.. ఆ వివరాలను కూడా ఆ యాప్ ఆధారంగా కేంద్రం ముంగిట ఉంచుతారు. వాటిని కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా పరిశీలిస్తారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన యాప్‌ను మాత్రమే రూపొందించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో యాప్‌ను రూపొందించుకుంటోంది. దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ యాప్‌తో అనుసంధానించనున్నారు. దీంతో ఈ రెండు యాప్‌ల వివరాలు కేంద్రం ముందు ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతాయి. ఆ వివరాల ఆధారంగా లబి్ధదారులను ఎంపిక చేస్తారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏడాది చివర్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుకు ప్రారంభమైనా.. వాటి నిర్మాణం మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల నిర్మాణం కోసం కనీసం మరో ఐదు నెలల పాటు వారు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 11న అట్టహాసంగా ప్రారంభించింది. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో నే పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పథకాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వటమో, తొలి విడత ఆర్థిక సాయం కింద చెక్కు జారీ చేయడంతోనో ప్రారంభిస్తారు. కానీ ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని కేవలం ప్రారంభిస్తున్నట్టు పేర్కొ నటమే తప్ప ఇలాంటివేవీ లేకుండా, లబ్ధిదారుల ప్రస్తావనే లేకుండా సాగింది. వాస్తవానికి ఇప్పటివరకు లబ్ధిదారులను గుర్తించనేలేదు. దరఖాస్తులు స్వీకరించినా.. ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ నెలలోనే ప్రజా పాలన పేరుతో పేదల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వీటిల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. 80 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, వాటిల్లో గతంలోనే ఇందిరమ్మ ఇళ్లను పొందిన దాదాపు 14 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వెరసి 66 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినట్టుగా రికార్డు చేశారు. వాటిని స్క్రూటినీ చేసి ఇతర కారణాలతో అనర్హమైనవి ఉంటే తొలగించాల్సి ఉంది. ఆ తర్వాత అసలు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని అప్పట్లో నిర్వహించకుండా పెండింగులో పెట్టారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే కోడ్ అమల్లోకి రావటంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కోడ్ ముగిసినా.. -
ఆడబిడ్డల పేరిట ఇందిరమ్మ ఇళ్లు
మహిళల పేరిటే ‘ఇందిరమ్మ’ ఇళ్లు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే. ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టా మహిళల పేరుతోనే ఉంటుంది. తద్వారా ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతుకుతుందనేది మా ప్రభుత్వ భావన. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టేనని, అందుకే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే ఇస్తామని చెప్పారు. సోమవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. తర్వాత ఇక్కడి వ్యవసాయ మార్కెట్ మైదా నంలో నిర్వహించిన సభలో ఇందిరమ్మ ఇళ్ల పథ కాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రేవంత్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘భద్రాచలం రాముడి సాక్షిగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదల చిరకాల కోరిక ఇది. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే, పది మందిలో తలెత్తుకొని నిలబడాలంటే సొంతిల్లు ఉండాలని ఆలోచించి నాడు వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పేదలు నేటికీ ఆ ఇళ్లలో ఉంటున్నారు. నాటి పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. పెళ్లయి పిల్లలతో కుటుంబంగా మారారు. వారు కూడా సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలనే ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ అబద్ధాలకు కాలం చెల్లింది 2014 ఎన్నికలకు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బె డ్రూం ఇల్లు ముద్దు అంటూ పేదల సొంతింటి కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఇదే కథ మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాల కు కాలం చెల్లడంతోనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్లున్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలోనే మేం ఓట్లు వేయించుకుంటాం. ఇందుకు కేసీఆర్ సిద్ధమా? ఆ ఊళ్లలో ఓట్లు వేయించుకోండి ప్రధాని మోదీ మాటలకు హద్దే లేదు. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసి తీయని మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు కట్టించిందో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లున్న చోట బీజేపీ నాయకులు ఓట్లు వేయించుకోవాలి. మేం అక్కడ ఓట్లు అడగబోం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ పెట్టుబడి కూడా రాక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. భద్రాచలం రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు గోదావరి ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. రాముల వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి తుమ్మల అడిగారు. అన్నింటినీ పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నందునే ముగ్గురు మంత్రులను ఇచ్చాం. ఇటీవల రేణుకాచౌదరిని రాజ్యసభకు ఎంపిక చేశాం..’’అని రేవంత్ చెప్పారు. సభలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన పలువురు మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా సీఎం భద్రాచలం పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాములవారిని దర్శించుకున్న సీఎం, మంత్రులు భద్రాచలం అర్బన్: భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్, మంత్రులు తొలుత శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు అర్చకులు పరివట్టం కట్టి పూర్ణకుంభంతో ఆహ్వనించారు. గర్భగుడిలో సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి, బెల్లంతో చేసిన రాముల వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. పేదలు గుర్తుంచుకునే రోజు ఇది..: భట్టి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన, పేదలు గుర్తుంచుకునే సందర్భం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం సీతారామచంద్రస్వామి పాదాల సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద, బలహీన వర్గాల వారు రాములవారి సన్నిధిలో ఇంటి పత్రాలు పొందడం శుభకరం. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని అటకెక్కిస్తే.. మేం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రారంభించాం. దళిత, గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి రూ.6 లక్షలు, మిగతా వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తాం. బీఆర్ఎస్లా హామీలిచ్చి విస్మరించకుండా.. బడ్జెట్లో నిధులు కేటాయించాకే పథకాలను ప్రారంభిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి దఫాగా రూ.7,740 కోట్లు కేటాయించాం..’’అని చెప్పారు. -
ఇందిరమ్మ ఇళ్లకు నేడే శ్రీకారం
సాక్షి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభు త్వం అందించనుంది. ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. దశలవారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారి కోసం వివిధ రకాల డిజైన్లను ప్రభుత్వమే తయారు చేయించింది. అందులో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్ ఉండనున్నాయి. ఈ డిజైన్లను సీఎం రేవంత్ సోమవారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.7740 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. యాదాద్రి నుంచి భద్రాచలంకి సీఎం సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి తొలుత యాదగిరిగుట్టకు చేరుకుంటారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం భద్రాచలం రానున్నారు. భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం భద్రాచలం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత సీతారామా ప్రాజెక్టుతో పాటు సాగునీటి రంగానికి సంబంధించిన ఇతర అంశాలు, భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్షాసమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మణుగూరు చేరుకుని అక్కడ సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. -
11న ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగమైన ‘ఇందిరమ్మ’ఇళ్ల పథకానికి ఈ నెల 11న శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి తొలుత 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఈ పథకం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు. శనివారం సచి వాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మార్గదర్శకాలు సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు సీఎం చెప్పారు. సొంత జాగా లేని పేదలైతే.. ఇంటిస్థలంతోపాటు రూ.5 లక్షలు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇచ్చే మొత్తాన్ని ఎన్ని కిస్తీల్లో, ఏయే దశల్లో విడుదల చేయాలనే నిబంధనలతో త్వరగా మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, ఇందుకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలని సూచించారు. డిజైన్లు సిద్ధం చేయండి సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారి కోసం కొన్ని డిజైన్లను సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశించారు. ప్రతి ఇంట్లో వంటగది, మరుగుదొడ్డి ఉండేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ విభాగాలు పనిచేస్తాయన్నారు. ఇళ్ల మంజూరుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన పొరపాట్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
TS: మరో గ్యారెంటీ అమలుకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో గ్యారెంటీపై ఫోకస్ చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తాజా సమీక్షలో.. ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇల్లులేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థలం ఉంటే.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. -
TS: రూ.5 లక్షలు.. 500 చ.అ. ఇల్లు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ పథకం అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ పథకం కింద గృహ నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఆ మొత్తంతో దాదాపు 450 చదరపు అడుగుల (చ.అ) నుంచి 500 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు నిబంధనల ప్రకారం చుట్టూ ఖాళీ స్థలం వదలాలంటే 70 చ.గజాల వరకు స్థలం కావాలని అంచనా వేస్తోంది. ఇలా 70 గజాల స్థలం ఉన్నా, అంతకంటే ఎక్కువున్నా పరవాలేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు పూర్తిగా ఖర్చు చేసి 500 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువగా సొంత స్థలం ఉన్న పేదలే ఎక్కువమంది ఉంటారని అంచనా. కాగా తక్కువ స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల లోపే ఖర్చవుతుందని, 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తే, ఖర్చు కాగా మిగిలే మిగతా మొత్తం ‘దుర్వినియోగం’ ఖాతాలోకి చేరుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత లేకపోయేసరికి ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకీ సమస్య అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ పథకం ఉన్న సంగతి తెలిసిందే. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణ పథకం గృహలక్ష్మి కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ దానిని ఇందిరమ్మ పథకంగా మార్చి ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచి ప్రకటించింది. అంటే అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందిస్తారన్నదే ఆ ప్రకటన సారాంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఒక్కో ఇంటికి దాదాపు రూ.5.20 లక్షల వరకు ఖర్చయింది. ఆ మొత్తంతో 500 చ.అ.కు మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం జరిగింది. లిఫ్టు వసతి లాంటి అదనపు హంగుల వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో యూనిట్ కాస్ట్‌ను రూ.7 లక్షలుగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో అందరికీ సమంగా రూ.5 లక్షల చొప్పున ఇస్తే, నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తే డబ్బులు మిగిలి దుర్వినియోగం కింద జమకట్టే ప్రమాదం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇందిరమ్మ పథకంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల్లో కూడా ఇలాంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ ప్లాన్లు ఎలా అమలు చేస్తారు? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు నమూనాలు సిద్ధం చేసి, వాటి ఆధారంగా నిర్మాణం చేపడతామని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సొంత జాగాలో ఇళ్లను నిర్మించుకునే క్రమంలో ఈ నమూనాలు కూడా ఆటంకంగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేదలకు ఉండే సొంత జాగాలు అన్నీ ఒకే ఆకృతిలో ఉండే అవకాశం ఉండదు. కొన్ని పొడవుగానో, వంకర టింకరగానో ఉంటే, ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ల ప్రకారం ఇళ్లను నిర్మించుకునే వీలుండదు. అప్పుడేం చేయాలనే సందేహాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అప్పుడే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ముందుకు సాగుతుందని అంటున్నారు. -
‘అక్రమార్కుల’పై క్రిమినల్ కేసులు
- సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి. కుల్కచర్ల:‘ఇందిరమ్మ’ ఇళ్ల బిల్లులలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో సీబీసీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్లపై ఆరోసారి విచారణ చేపట్టారు. గ్రామానికి రెండో విడతలో 524 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 92 మంది లద్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో అవి నాన్స్టాటేడ్ కింద రద్దయ్యాయి. 374 ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు బిల్లులు మంజూరు చేశారు. మిగితావి వివిధ స్థాయిలలో ఉన్నాయి. ఇప్పటివరకు సీబీసీఐడీ అధికారులు ఐదుసార్లు విచారణ చేశారు. గురువారం మరోమారు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ పథకంలో గ్రామంలో ఎంతమంది బిల్లులు తీసుకున్నారనే విషయం ఆరా తీశారు. బిల్లులు తీసుకున్నవారు ఇళ్లు కట్టుకున్నారా..? లేదా అని విచారణ జరిపారు. బిల్లులు తీసుకున్నవారిలో చాలామంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో గ్రామంలో లేనివారి పేర్లమీద బిల్లులు తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో సీబీసీఐడీ అధికారులు కుల్కచర్ల స్టేట్ బ్యాంకుకు వెళ్లి విచారణ చేశారు. బిళ్లులు తీసుకున్న వారి ఖాతాలను తనిఖీ చేశారు. కొందరు లబ్ధిదారులకు సంబంధం లేకుండా బిల్లులు డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆధార్‌కార్డులు లేకుండా బిల్లులు తీసుక్నువారి వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 40 మంది వరకు అక్రమంగా బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని, ఈవిషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీబీసీఐడీ అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు. -
‘ఇంటి’ లెక్కలతో మంత్రికి చిక్కులు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు మరో పక్క 95.99 శాతం బాగుందని మంత్రి మృణాళిని ప్రకటన ఇదే విషయాన్ని మళ్లీ స్పష్టం చేయమన్న విపక్ష నేత జగన్ సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఇంటి లెక్కలపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ మంత్రికి ముచ్చెమటలు పట్టించింది. పొంతనలేకుండా మంత్రి సమాధానం చెప్పటంపై విపక్ష నేత వివరణ కోరడం... జవాబు కోసం మంత్రి తడుముకోవడంతో అధికార పక్షం ఇరుకున పడింది. మంత్రిని కాపాడుకునేందుకు విపక్ష నేతపై అధికార పక్షం ఆరోపణాస్త్రాలు సంధించింది. చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించింది. మంత్రి తీరును చివరకు సభాపతే ఆక్షేపించడం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రశ్నోత్తరాల సమయంలో స్వల్ప చర్చ జరిగింది. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు దీనిని లేవనెత్తారు. మండపేట పరిధిలో ఏఈ అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార పక్ష సభ్యులు కల్పించుకుని గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, వీటిపై దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని బదులిస్తూ పథకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పారు. జియోటాగింగ్ పద్ధతిలో క్షేత్రస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా 30 వేల ఇళ్లను పరిశీలించామన్నారు. కొన్నిటిని షాపులకు, మరికొన్ని గొడ్ల చావిళ్లకు, ఇంకొన్ని రెండంతస్తుల భవనాలు నిర్మించినట్టు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 95.99 శాతం సక్రమంగానే ఉన్నాయని, కేవలం 4 శాతమే అక్రమాలు చోటు చేసుకున్నాయని బదులిచ్చారు. వివరణ కోరిన విపక్ష నేత ఈ దశలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని మంత్రిని వివరణ కోరారు. ‘నేను సరిగా వినలేదు. ‘‘ఈ పథకంలో కేవలం 4 శాతమే అక్రమాలు జరిగాయి. 95 శాతం సక్రమంగానే ఉన్నాయి’’.. ఇదే కదా మీరు చెప్పింది. ఈ విషయాన్ని మరోసారి వివరించండి’ అని కోరారు. అంతా సక్రమంగానే ఉందని అంతకు ముందే సర్టిఫికెట్ ఇచ్చిన మంత్రి... విపక్ష నేత ప్రశ్నతో దిక్కు తోచలేదు. క్షణం క్రితం చెప్పిన అంకెలనే సమాధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. తాను వివరాలన్నీ అడగడం లేదని, 95 శాతం సక్రమంగానే ఉందని మంత్రి చెప్పిన విషయంపైనే స్పష్టత కోరుతున్నానన్నారు. సూటిగా జవాబివ్వాలని పట్టుబట్టారు. ఈ దశలో మృణాళిని తత్తరపాటుకు లోనయ్యారు. ఇప్పటివరకూ కేవలం 30 వేల ఇళ్లకే జియోటాగింగ్ జరిగిందని, ప్రాథమిక వివరాల ప్రకారం 95 శాతం సవ్యంగానే ఉన్నాయని గుర్తించినట్టు చెప్పారు. మొత్తం 46 లక్షల ఇళ్ళను పరిశీలించిన తర్వాతే సమగ్ర వివరాలు అందుతాయని బదులిచ్చారు. సంతృప్తి చెంద ని ప్రతిపక్ష నేత.. వివరాలు చెప్పాలని మం త్రిని కోరారు. అవినీతి ఎంత జరిగింది పునరుద్ఘాటించాలన్నారు. మంత్రి సూటిగా జవాబు ఇవ్వాలని మిగతా సభ్యులూ పట్టుబట్టటంతో ఇరుకున పడ్డ అధికార పక్షం చర్చను పక్కదారి పట్టించేందుకు ఉపక్రమించింది. సంబంధం లేకున్నా మంత్రి కిషోర్ బాబు జోక్యం చేసుకుని విపక్ష నేతపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ దశలో మృణాళిని మరోసారి అవే లెక్కలు విన్పిస్తూ సభ సహనానికి పరీక్ష పెట్టారు. దీన్ని గమనించిన సభాపతి.. విపక్ష నేత అడిగిన దానికే సమాధానం చెప్పాలని సూచించారు. పూర్తిస్థాయి సర్వే తర్వాత వివరాలు సభముందు ఉంచుతామని మంత్రి చెప్పడంతో ఈ అంశం ముగిసింది. -
ఇందిరమ్మ అక్రమార్కుల సంఖ్య 109 మంది
సాక్షి, మంచిర్యాల : ఎట్టకేలకు.. సీఐడీ జిల్లాలో ఇందిర మ్మ ఇళ్ల అక్రమార్కుల నిగ్గు తేల్చింది. తొలి విడతగా ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆసిఫాబాద్ మండలం బాబాపూర్, తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం), కిష్టాపూర్ (రెబ్బెన), గిన్నెర (ఇంద్రవెల్లి) గ్రామాల్లో విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 109 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి పేర్లతో కూడిన జాబితాను రెండ్రోజుల క్రితమే ప్రభుత్వానికి సమర్పించారు. తొలి విడతగా.. 30 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన అక్రమార్కుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఈనెల 11న సీఐడీ వరంగల్ రీజినల్ కార్యాలయానికి విచ్చేసి.. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణకు విచ్చేసిన అధికారులు, సిబ్బంది నుంచి 2004-14 మద్య కాలంలో ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు..? ఎప్పుడు రిలీవ్ అయ్యారు..? సర్వీసు రికార్డుల ప్రకారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఇచ్చిన వివరణను బట్టి తొలి విడతలో మొత్తం 109 మంది అక్రమార్కులను గుర్తించారు. వీరిలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీఏలు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు దళారులు సైతం ఉన్నారు. ఇందిరమ్మ అక్రమార్కుల విషయంలో సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం వీరి పట్ల ఎలా వ్యవహరిస్తుందోననే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. సంబంధిత అధికారులు మాత్రం అక్రమార్కులకు జైలు శిక్ష తప్పదని అభిప్రాయపడుతున్నారు. అక్రమాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా దళారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విచారణ ఇలా.. సీఐడీ అధికారులు 2004-14 వరకు మంజూరైన ఇళ్లు.. లబ్ధిదారులపై విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన నాలుగు గ్రామాల్లో 2,894 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 963 ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని అంచనా వేశారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.48 లక్షలు ఇవ్వకుండా కాజేసిన విలేజ్ ఆర్గనైజర్ల వివరాలు సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. మొదలు కాజేసిన నిధులు రికవరీ చేసి.. తర్వాత వీరిపై చర్యలు తీసుకుంటారు. గల్లంతైన 176 ఇందిరమ్మ ఇళ్లు ఎవరు కాజేశారు..? అందులో ఎవరెవరి ప్రమేయం ఉందో వివరాలు తెలుసుకున్న సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని విచారణాధికారి సీఐడీ డీఎస్పీ రవికుమార్ చె ప్పారు. ఇళ్లు పూర్తి కాకుండానే లబ్ధిదారులకు పూర్తి బిల్లు మంజూరు చేసిన.. క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రెండు విడుతకు సన్నద్ధం.. మూడు నెలల పాటు తొలి విడత విచారణ చేపట్టి.. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై నిగ్గు తేల్చిన సీఐడీ అధికారులు రెండో విడుత విచారణకు సన్నద్ధమవుతున్నారు. చెన్నూరు, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్ మండలాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అంచనా వేసిన సీఐడీ అధికారులు ఈ మండలాల పేర్లను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. రెండో విడుత విచారణ ఎక్కడ చేపట్టాలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే దర్యాప్తు చేపడతామని సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. తొలి విడతలో సీఐడీ బృందాలకు హౌసింగ్ సిబ్బంది సహకారం అందినా.. రెండో విడతలో మాత్రం అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు విచారణకు అంతరాయం కలగకుండా తమదైన శైలిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే.. విచారణ కోసం మరింత మంది సిబ్బంది సేవలను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరోపక్క.. రెండో విడత విచారణ ఎక్కడ జరుగుతుందోనని జిల్లాలో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. -
నేడు సర్కారుకు ‘ఇందిరమ్మ’ నివేదిక!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాల తంతు సర్కారు వద్దకు చేరనుంది. జిల్లాలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసిన సీఐడీ అధికారులు.. పూర్తిస్థాయిలో పరిశీలించి అవకతవకల నిగ్గు తేల్చారు. మొత్తంగా రూ.2కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సీఐడీ.. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ నాలుగు గ్రామాల్లో.. జిల్లాలో ‘ఇందిరమ్మ’ అక్రమాలపై తొలుత నాలుగు గ్రామాలను ఎంపిక చేసుకున్న సీఐడీ ఆమేరకు దర్యాప్తు చేపట్టింది. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, రేగొండి గ్రామాలు, పరిగి నియోజకవర్గంలోని చిన్నవార్వాల్, ఇప్పాయిపల్లి గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారులను వివరాల ఆధారంగా పరిశీలన చేపట్టారు. వారు నిర్మించిన ఇళ్లను నేరుగా సందర్శిం చగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పలుచోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా బిల్లులు డ్రా చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా బేస్మెంట్ స్థాయిలో పనులు చేపట్టగా.. లెంటల్ స్థాయి వరకు బిల్లులు పొందారు. కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిచేసినట్లు రికార్డులు చూపిస్తున్నా.. లబ్ధిదారులు మాత్రం గుడిసెల్లో నివసిస్తున్నట్లు తేల్చారు. ఇలా పరిశీలన చేసిన అధికారులు.. కేవలం బషీరాబాద్‌లోనే రూ.90లక్షల అక్రమాలు జరిగినట్లు పసిగట్టారు. మొత్తంగా నాలుగు గ్రామాల్లో రూ.2కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఖరారు చేశారు. కేసులు.. అరెస్టులు.. నాలుగు గ్రామాల్లో అక్రమాలపై బుధవారం సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ఈ అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిపై సర్కారు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన బోగస్ లబ్ధిదారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
‘ఇందిరమ్మ’ ఇళ్లపై సీఐడీ నజర్
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు సీఐడీ దృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇళ్ల మంజూరు, నిర్మాణాలపై నిగ్గు తేల్చేందుకు విచారణ బృందాలు రంగంలోకి దిగాయి. అందులో భాగంగానే గృహనిర్మాణశాఖ పీడీతో పాటు ఆ శాఖకు సంబంధించిన ఇంజనీర్ల వద్ద దరఖాస్తులు తీసుకుని కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యాయి. 2009-10లో తాము రూపొందించిన అక్రమాల నివేదికను గృహనిర్మాణ సంస్థ అధికారులు సీఐడీ అధికారులకు అప్పగించారు. దీని ప్రకారం జిల్లాలోని 25 మండలాల పరిధిలోని 53 గ్రామాల్లో మొత్తం1284 ఇళ్లకు సంబంధించి రూ.3కోట్ల పైచిలుకు అవినీతి జరిగినట్లు నివేదికలు తయారుచేశారు. ఇందులో రూ.17.50లక్షలను రికవరీ చేసినట్లు పొందుపరిచారు. 2010 తరువాత అవినీతి ఎక్కువస్థాయిలో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అక్రమాలు వెలుగుచూస్తావన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మొదటి విడతలో జిల్లాలోని అలంపూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో సీఐడీ ఆధికారులు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఈ పరంపరలో సీఐడీ డీఎస్పీ సురేందర్ నేతృత్వంలో శుక్రవారం కొడంగల్, అలంపూర్ ప్రాంతాలను చుట్టొచ్చారు. అనంతరం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రకాశ్‌రావును కలిసివెళ్లారు. అవినీతికి చిరునామా! గృహనిర్మాణ శాఖ అంటేనే అవినీతికి చిరునామాగా పేరుగాంచింది. ఈ శాఖలో పనిచేసే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరు కలిసి అర్హతలను పక్కకుపెట్టి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. రాజ కీయ జోక్యానికి సంబంధిత అధికారులు తలవంచక తప్పలేదు. దీంతో పాటు అధికారులు కూడా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి తమ చేతివాటం ప్రదర్శించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన ఈవినీతిపై చేపట్టిన సర్వేలో ఆరుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు గతంలో తయారుచేసిన నివేదికల్లో పొందుపర్చారు. ఇందులో ఇద్దరు ఏఈలు ఉండగా, నలుగురు వర్క్ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు డీఈలు, నలుగురు ఏఈలు, నలుగురు వర్క్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు ఏడు క్రిమినల్ కేసులు నమోదుచేయగా వారిలో ఆరుగురు ఆధికారులు, 15 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు తెలిపా రు. మలిదశ జరుగుతున్న తనిఖీ ల్లో అక్రమాలు ఎలా వెలుగులోకి వస్తాయో వేచిచూడాలి. -
గూడు గోడు..!
కర్నూలు(అర్బన్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి గ్రహణం పట్టింది. ఎన్నడూ లేని విధంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులన్నింటిని కొత్త ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో జిల్లాలో 53 వేల మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారికంగా రూ.22 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయి పడింది. అనధికారికంగా మరో రూ. 14 కోట్లను చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, సిమెంట్, ఇనుము తదితరాలన్నింటి ధరలు రెండింతలు పెరిగినా, సొంత గూడులేని వేల మంది లబ్ధిదారులు అప్పులు చేసుకుని గృహాలను నిర్మించుకుంటున్నారు. బిల్లులు ఆగిపోవడంతో వీరంతా దిక్కులు చూస్తున్నారు. చేతి డబ్బులు లేకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలను నిలిపివేశారు. ఎప్పుడో అవినీతి జరిగిందని, వాటిపై విచారణ పేరుతో ప్రస్తుతం నిర్మాణంలో బిల్లులను నిలిపివేయడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా మూడు విడతల్లో 3,29,567 గృహాలు మంజూరయ్యాయి. నిర్మాణాలు పూర్తి అయిన వాటితోపాటు వివిధ దశల్లో ఉన్న గృహాలకు రూ. 990.30 కోట్లు వెచ్చించారు. మూడు విడతల్లో చేపట్టిన గృహ నిర్మాణాలు దాదాపు పూర్తికావొస్తున్న ప్రస్తుత సమయంలో బిల్లులను ఆపివేయడం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణ ప్రాంతాల్లో కూడా వేల సంఖ్యలో గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. తొలి బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగేనా? ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపులు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సిస్టమ్ ఆమల్లోకి వచ్చిన బిల్లులను చెల్లిస్తారా? బడ్జెట్ కేటాయించిన అనంతరం బిల్లులను విడుదల చేస్తారా? అనే సందిగ్ధత నెలకొంది. -
‘ఇందిరమ్మ’ ఇళ్ల..గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అయోమయం నెలకొంది. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోపాటు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేనిఫెస్టోలో భాగంగా రెండు పడకల గదులున్న ఇళ్లను మంజూరు చేస్తామంటూ చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ మేరకు కసరత్తును ముమ్మరం చేసింది. అయితే ఇప్పుడు అమల్లో ఉన్న ఇందిరమ్మ పథకాన్ని ప్రస్తావించకపోవడం తో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. ఇందిరమ్మ మూడు విడతల్లో భాగంగా జిల్లాకు 2.21లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వీటిలో 1.49లక్షల ఇళ్లు మాత్ర మే పూర్తికాగా, మరో 26వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 46వేల ఇళ్లు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. కొత్త సర్కారు ఏర్పాటైన నేపథ్యంలో పురోగతిలో ఉన్న ఇళ్ల సంగతి అటుంచితే, ఇప్పటివరకు పనులు ప్రారంభించని ఇళ్లను ప్రస్తుతం మొదలుపెడితే బిల్లులు చెల్లిస్తారా.. లేదా.. అనే అంశంపై స్పష్టత కొరవడింది. ఆ ఇళ్లు ఇక రద్దే!: ఇందిరమ్మ మూడు విడతల్లో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గతంలో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి.. నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఉపక్రమించారు. అయితే కొందరు లబ్ధిదారులు ఇతరత్రా కారణాలతో సగంలోనే పనులు నిలిపివేయగా.. మరి కొందరు మాత్రం పునాదులు సైతం తవ్వలేదు. దీంతో నిర్దిష్ట గడువు విధించిన సర్కారు.. ఆలోపు పనులు చేపట్టకుంటే వాటిని రద్దు చేస్తామని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీటిని ప్రస్తుత సర్కారు రద్దుచేసే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా జరిగితే జిల్లాలో 46వేల ఇళ్లు రద్దు కానున్నాయి. గల్లా పెట్టె నిండుకోవడంతో.. జిల్లాలో 26వేల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా నాలుగున్నర వేల ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మార్చి 17నాటితో హౌసింగ్ శాఖకు కేటాయించిన బడ్జెట్ నిండుకుంది. దీంతో నిర్మాణ పనులు పూర్తయిన ఇళ్లకు, అదేవిధంగా వివిధ దశల్లో పనులు పూర్తిచేసిన ఇళ్లకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. నిధుల కొరతతో ఎలాంటి చెల్లింపులు చేయలేదు. మూడు నెలలు కావస్తున్నా.. బడ్జెట్ రాకపోవడంతో అధికారులు చెల్లింపుల ప్రక్రియను పునరుద్ధరించలేదు. దీంతో ఇప్పటివరకు దాదాపు రూ.12.5కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తే బకాయిలు మరింత పెరగొచ్చని తెలుస్తోంది. -
బిల్లులు...చిల్లులు
.... అదే గ్రామానికి చెందిన వడ్ల వెంకటప్పకు ఇందిరమ్మ ప థకం కింద అనుమతించారు. పునాది వరకు సొంత డబ్బులతో ఇంటి నిర్మాణం సాగించాడు. ఇందిరమ్మ బిల్లు మంజూ రు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వ పరంగా బిల్లు మంజూరు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చిందని వెంకటయ్య చెబుతున్నాడు. ... దౌల్తాబాద్‌కు చెందిన శంకరమ్మకు ఇందిరమ్మ తొలి విడత కింద ఇల్లు మంజూరైంది. బిల్లులు ఎప్పుడైనా మంజూరవుతాయన్న ఆశతో ఆమె స్లాబ్ వరకు ఏడాది కిందట ఇంటిని నిర్మించుకుంది. అందుకు సంబంధించి బేస్మెంట్ లెవల్ బిల్లు మాత్రమే ఇచ్చారని, గతంలో నాట్ స్టార్టెడ్ అంటూ ఏడాదిపాటు తిప్పుకున్నారని... మిగిలిన బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని, దీంతో మిగిలిన ఇంటి నిర్మాణం పూర్తిచేయలేక, ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణానికి అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నానని శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా.. జిల్లాలో పలువురు ఇంది రమ్మ లబ్దిదారులు సకాలంలో నిధులు మంజూరు కానందున ఇంటిని నిర్మించుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తోంది... న్యూస్‌లైన్, పాలమూరు: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 40,217 ఇండ్లను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం 19,357 ఇళ్లకు మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. ఇందులోనూ కొందరు లబ్దిదారులకు అరకొరగా అందినట్లు తెలుస్తోంది. నిర్దేశించిన లక్ష్యం 50 శాతం కూడా చేరుకోకపోవడంతో సొంతింటి నిర్మించుకోవాలని భావించిన నిరుపేదలు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల అధికారులు బిల్లుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. సిమెంటు, బిల్లుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో లబ్దిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోలేక అవస్థ పడుతున్నారు. లక్ష్యమూ..గగనమే... ఇందిరమ్మ మొదటి, రెండు, మూడు విడతలతోపాటు రచ్చబండ 1, రచ్చబండ 2 కింద 5.52 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 2.13లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.2.59లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 40వేల ఇళ్లు గోడల స్థాయిలో 25వేల ఇళ్లు గోడలకన్నా తక్కువ స్థాయిలో ఉండగా.. 35వేల ఇళ్లు పునాది కన్నా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 50 రోజులు గడువు ఉండటంతో అందరు లబ్దిదారులకు నిధులు మంజూరయ్యే పరిస్థితులు కనబడటంలేదు. ఈ ఏడాది 40,217 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇప్పటి వరకు 19,357 మాత్రమే పూర్తి చేశారు. చివరికి లబ్దిదారుడు ఎంతో కొంత మామూళుల ముట్టచెపితే బిల్లు మంజూరుకు ఎంబుక్ రికార్డు చేసి పంపుతున్నారు. అలా ఇచ్చుకోలేనివారికి ఇక ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు వచ్చే అదనపు మొత్తంలో అధికారులు అందినంత గుంజుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వేధిస్తున్న సమస్యలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిమెంటు కొరత అధికంగా ఉంది. ధర పెంచే వరకు సరఫరా చేసేది లేదని కంపెనీలు తెగేసి చెప్పాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నవంబర్‌లో సరఫరాను తగ్గించాయి. సిమెంటు కొరత వల్ల కూడా ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి కావడం లేదు. స్థలం లేని లబ్దిదారులకు కేటగిరి-3 కింద గుర్తించి ప్రభుత్వం ఊరి బయట ప్రభుత్వ స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో స్థల సేకరణ పూర్తి చేయడం లేదు. లబ్దిదారులను ఊరిస్తూ.. ఇళ్ల స్థలాల పంపిణీ అప్పుడు, ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండటం ఇబ్బందిగా మారింది. -
రోడ్లు లేని ఇందిరమ్మ కాలనీ
జగన్నాథపురం (నల్లజర్ల), న్యూస్‌లైన్ : పేదవారికి గూడు కల్పించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేపట్టిన నిర్మాణాలు వారు నివసించేందుకు వీలుకాని విధంగా మారాయి. నల్లజర్ల మండలంలో జగన్నాథపురం గ్రామంలో 84 మంది ఎస్సీలకు 2009లో ఇంది రమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేసేందుకు 6 నెలల క్రితం గ్రావెల్ గుట్టలు వేశారే తప్ప, రోడ్డు వేయటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్లు వేయించాలని కోరుతున్నారు.