‘ఇందిరమ్మ’ ఇళ్ల..గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అయోమయం నెలకొంది. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోపాటు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేనిఫెస్టోలో భాగంగా రెండు పడకల గదులున్న ఇళ్లను మంజూరు చేస్తామంటూ చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఈ మేరకు కసరత్తును ముమ్మరం చేసింది. అయితే ఇప్పుడు అమల్లో ఉన్న ఇందిరమ్మ పథకాన్ని ప్రస్తావించకపోవడం తో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.
ఇందిరమ్మ మూడు విడతల్లో భాగంగా జిల్లాకు 2.21లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వీటిలో 1.49లక్షల ఇళ్లు మాత్ర మే పూర్తికాగా, మరో 26వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 46వేల ఇళ్లు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. కొత్త సర్కారు ఏర్పాటైన నేపథ్యంలో పురోగతిలో ఉన్న ఇళ్ల సంగతి అటుంచితే, ఇప్పటివరకు పనులు ప్రారంభించని ఇళ్లను ప్రస్తుతం మొదలుపెడితే బిల్లులు చెల్లిస్తారా.. లేదా.. అనే అంశంపై స్పష్టత కొరవడింది.
ఆ ఇళ్లు ఇక రద్దే!: ఇందిరమ్మ మూడు విడతల్లో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గతంలో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి.. నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఉపక్రమించారు. అయితే కొందరు లబ్ధిదారులు ఇతరత్రా కారణాలతో సగంలోనే పనులు నిలిపివేయగా.. మరి కొందరు మాత్రం పునాదులు సైతం తవ్వలేదు. దీంతో నిర్దిష్ట గడువు విధించిన సర్కారు.. ఆలోపు పనులు చేపట్టకుంటే వాటిని రద్దు చేస్తామని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీటిని ప్రస్తుత సర్కారు రద్దుచేసే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా జరిగితే జిల్లాలో 46వేల ఇళ్లు రద్దు కానున్నాయి.
గల్లా పెట్టె నిండుకోవడంతో.. జిల్లాలో 26వేల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా నాలుగున్నర వేల ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మార్చి 17నాటితో హౌసింగ్ శాఖకు కేటాయించిన బడ్జెట్ నిండుకుంది. దీంతో నిర్మాణ పనులు పూర్తయిన ఇళ్లకు, అదేవిధంగా వివిధ దశల్లో పనులు పూర్తిచేసిన ఇళ్లకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. నిధుల కొరతతో ఎలాంటి చెల్లింపులు చేయలేదు. మూడు నెలలు కావస్తున్నా.. బడ్జెట్ రాకపోవడంతో అధికారులు చెల్లింపుల ప్రక్రియను పునరుద్ధరించలేదు. దీంతో ఇప్పటివరకు దాదాపు రూ.12.5కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తే బకాయిలు మరింత పెరగొచ్చని తెలుస్తోంది.