ఇప్పటికే ప్రధానమంత్రిఆవాస్ యోజనకు ఉపయోగిస్తున్న కేంద్రం
ఆ యాప్‌నే వినియోగించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పట్టణ ప్రాంత లబ్దిదారుల ఎంపికకు మరో యాప్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుదారుల్లో ఎవరు అర్హులు..ఎవరు కాదు అన్న విషయాన్ని ఓ యాప్ తేల్చనుంది. అర్హత ఉంటే దరఖాస్తు ప్రాసెస్ ముందుకు సాగుతుంది..లేకుంటే డిలీట్ అవుతుంది. రాష్ట్ర అధికారులు ఈ యాప్ ఆధారంగా త్వరలో సర్వే ప్రారంభించబోతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దీన్ని తయారు చేసింది. దానినే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున మంజూరు చేసి రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతేడాది చివరలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించే కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి దసరా ముందు రోజు ఇందిరమ్మ కమిటీ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సభ్యులు ఇందిరమ్మ పథకానికి అర్హులను తేల్చటంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఇందులో ఈ కమిటీ సభ్యుల కంటే.. ఓ యాప్ మరింత క్రియాశీలంగా వ్యవహరించబోతోంది.
నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం ఓ యాప్‌ను రూపొందించింది. అందులో ప్రభుత్వ ఇళ్లు పొందాలంటే ఉండాల్సిన అర్హతలను ఫీడ్ చేసి ఉంచారు. ఇప్పుడు అవే నిబంధనలను రాష్ట్రాలు కూడా కచి్చతంగా అనుసరించాలని, అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పొందేందుకు అర్హత ఏర్పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి అంగీకరిస్తే, ఆ యాప్ ఆధారంగానే లబ్దిదారుల ఎంపిక జరగాలి.
కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో పీఎంఏవై నిధులు పొందాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..ఆ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగానే లబి్ధదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టబోతోంది.
ముందుగా దరఖాస్తుల ఫీడ్
ప్రజాపాలన, ఇతర పద్ధతుల్లో అధికారులకు అందిన దరఖాస్తులను ఈ యాప్‌లో ఇప్పుడు ఫీడ్ చేయబోతున్నారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలను యాప్‌లో ఫీడ్ చేయగానే, ఈ పథకానికి దరఖాస్తుదారుకు అర్హత ఉందా లేదా అన్నది అది తేల్చనుంది. అందులో అర్హత ఉందని తేలిన దరఖాస్తులనే ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. వాటి ఆధారంగానే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా అర్హతను బేరీజు వేస్తారు.
అలా అర్హుల జాబితా సిద్ధం కాగానే.. ఆ వివరాలను కూడా ఆ యాప్ ఆధారంగా కేంద్రం ముంగిట ఉంచుతారు. వాటిని కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా పరిశీలిస్తారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన యాప్‌ను మాత్రమే రూపొందించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో యాప్‌ను రూపొందించుకుంటోంది.
దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ యాప్‌తో అనుసంధానించనున్నారు. దీంతో ఈ రెండు యాప్‌ల వివరాలు కేంద్రం ముందు ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతాయి. ఆ వివరాల ఆధారంగా లబి్ధదారులను ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment