5న లేదా 6న ప్రక్రియ ప్రారంభిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాజకీయ జోక్యం లేకుండా యాప్ ద్వారా ఎంపిక
ఇంటి పునాదుల నుంచి పూర్తయ్యేదాకా దశలవారీగా సొమ్ము విడుదల
అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెడతామని వెల్లడి
ఈ టర్మ్ అంతా రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందని, ఎంపికలో రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండదని చెప్పారు. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించడం లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తాం. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇళ్లకు ప్రత్యేక డిజైన్ అంటూ ఉండదు. లబ్ధిదారులకు ఉన్న జాగా ఆధారంగా వారే కావాల్సిన ఆకృతిలో నిర్మించుకోవచ్చు. అయితే వంటగది, మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా చూడాలి.
దశలవారీగా సొమ్ము విడుదల
ఇందిరమ్మ ఇళ్లకు పునాదులు నిర్మించుకున్నాక రూ.లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ.లక్షన్నర, పైకప్పునకు రూ.లక్షన్నర చొప్పున చెల్లిస్తాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మిగతా మొత్తం అందజేస్తాం. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తాం. తొలిదశలో కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇళ్లను మంజూరు చేస్తాం.
తదుపరి విడతలో భూమిలేని నిరుపేదలకు స్థలం ఇచ్చి నిధులు అందజేస్తాం. నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేస్తున్నాం. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించేలా చూస్తాం. ఈ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసం 16 శాఖల నుంచి సిబ్బందిని సమీకరిస్తున్నాం.
నిధులను సమీకరించుకుంటాం..
తొలిదశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతాయి. బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.7,740 కోట్లను కేటాయించింది. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టి వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. అవసరమైన నిధులను వివిధ మార్గాల్లో సమీకరించుకుంటాం. కొత్తగా ఏర్పడే ఇందిరమ్మ కాలనీల్లో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెడతాం..
గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తేవటంలో విఫలమైంది. మేం ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర నిబంధనలు అనుసరించటంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెట్టాలంటే కూడా పెడతాం. మాకు భేషజాలు లేవు. సర్పంచుల పదవీకాలం పూర్తయినందున ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల్లో వారి ప్రాతినిధ్యం లేదు. తదుపరి దశ నాటికి వారు ఉండేలా అవసరమైతే జనవరి నాటికే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..’’అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ టర్మ్ అంతా రేవంతే సీఎం
సీఎం రేవంత్‌రెడ్డిని మారుస్తారంటూ కొందరు పనిగట్టు కుని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టర్మ్ పూర్తయ్యేందుకు ఇంకా నాలుగేళ్ల ఒక నెల సమయం ఉందని, అప్పటి వరకు రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు.
తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో విపక్షాలు లేనిపోని ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా.. తాను చెప్పినట్టు రాజకీ య బాంబులు పేలటం తథ్యమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment