తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా?
తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది.
ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్‌ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.
ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని.
ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్‌ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు.
ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు.
ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ.
హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్‌ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు.
ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు.
అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు.
ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment