ఇందిరమ్మ అక్రమార్కుల సంఖ్య 109 మంది | 109 Irregulars in iIndiramma house scheme | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ అక్రమార్కుల సంఖ్య 109 మంది

Published Sun, Nov 16 2014 2:12 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

109 Irregulars in iIndiramma house scheme

సాక్షి, మంచిర్యాల : ఎట్టకేలకు.. సీఐడీ జిల్లాలో ఇందిర మ్మ ఇళ్ల అక్రమార్కుల నిగ్గు తేల్చింది. తొలి విడతగా ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆసిఫాబాద్ మండలం బాబాపూర్, తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం), కిష్టాపూర్ (రెబ్బెన), గిన్నెర (ఇంద్రవెల్లి) గ్రామాల్లో విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 109 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి పేర్లతో కూడిన జాబితాను రెండ్రోజుల క్రితమే ప్రభుత్వానికి  సమర్పించారు.

తొలి విడతగా.. 30 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన అక్రమార్కుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఈనెల 11న సీఐడీ వరంగల్ రీజినల్ కార్యాలయానికి విచ్చేసి.. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణకు విచ్చేసిన అధికారులు, సిబ్బంది నుంచి 2004-14 మద్య కాలంలో ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు..? ఎప్పుడు రిలీవ్ అయ్యారు..? సర్వీసు రికార్డుల ప్రకారం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఇచ్చిన వివరణను బట్టి తొలి విడతలో మొత్తం 109 మంది అక్రమార్కులను గుర్తించారు. వీరిలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీఏలు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు దళారులు సైతం ఉన్నారు. ఇందిరమ్మ అక్రమార్కుల విషయంలో సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం వీరి పట్ల ఎలా వ్యవహరిస్తుందోననే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. సంబంధిత అధికారులు మాత్రం అక్రమార్కులకు జైలు శిక్ష తప్పదని అభిప్రాయపడుతున్నారు. అక్రమాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా దళారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

 విచారణ ఇలా..
  సీఐడీ అధికారులు 2004-14 వరకు మంజూరైన ఇళ్లు.. లబ్ధిదారులపై విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన నాలుగు గ్రామాల్లో 2,894 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 963 ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని అంచనా వేశారు.

  లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.48 లక్షలు ఇవ్వకుండా కాజేసిన విలేజ్ ఆర్గనైజర్ల వివరాలు సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. మొదలు కాజేసిన నిధులు రికవరీ చేసి.. తర్వాత వీరిపై చర్యలు తీసుకుంటారు.

  గల్లంతైన 176 ఇందిరమ్మ ఇళ్లు ఎవరు కాజేశారు..? అందులో ఎవరెవరి ప్రమేయం ఉందో వివరాలు తెలుసుకున్న సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని విచారణాధికారి సీఐడీ డీఎస్పీ రవికుమార్ చె ప్పారు. ఇళ్లు పూర్తి కాకుండానే లబ్ధిదారులకు పూర్తి బిల్లు మంజూరు చేసిన.. క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

 రెండు విడుతకు సన్నద్ధం..
 మూడు నెలల పాటు తొలి విడత విచారణ చేపట్టి.. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై నిగ్గు తేల్చిన సీఐడీ అధికారులు రెండో విడుత విచారణకు సన్నద్ధమవుతున్నారు. చెన్నూరు, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్ మండలాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అంచనా వేసిన సీఐడీ అధికారులు ఈ మండలాల పేర్లను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

రెండో విడుత విచారణ ఎక్కడ చేపట్టాలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే దర్యాప్తు చేపడతామని సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. తొలి విడతలో సీఐడీ బృందాలకు హౌసింగ్ సిబ్బంది సహకారం అందినా.. రెండో విడతలో మాత్రం అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు విచారణకు అంతరాయం కలగకుండా తమదైన శైలిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే.. విచారణ కోసం మరింత మంది సిబ్బంది సేవలను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరోపక్క.. రెండో విడత విచారణ ఎక్కడ జరుగుతుందోనని జిల్లాలో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement