‘ఇందిరమ్మ’ ఇళ్లపై సీఐడీ నజర్
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు సీఐడీ దృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇళ్ల మంజూరు, నిర్మాణాలపై నిగ్గు తేల్చేందుకు విచారణ బృందాలు రంగంలోకి దిగాయి. అందులో భాగంగానే గృహనిర్మాణశాఖ పీడీతో పాటు ఆ శాఖకు సంబంధించిన ఇంజనీర్ల వద్ద దరఖాస్తులు తీసుకుని కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యాయి.
2009-10లో తాము రూపొందించిన అక్రమాల నివేదికను గృహనిర్మాణ సంస్థ అధికారులు సీఐడీ అధికారులకు అప్పగించారు. దీని ప్రకారం జిల్లాలోని 25 మండలాల పరిధిలోని 53 గ్రామాల్లో మొత్తం1284 ఇళ్లకు సంబంధించి రూ.3కోట్ల పైచిలుకు అవినీతి జరిగినట్లు నివేదికలు తయారుచేశారు.
ఇందులో రూ.17.50లక్షలను రికవరీ చేసినట్లు పొందుపరిచారు. 2010 తరువాత అవినీతి ఎక్కువస్థాయిలో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అక్రమాలు వెలుగుచూస్తావన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మొదటి విడతలో జిల్లాలోని అలంపూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో సీఐడీ ఆధికారులు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఈ పరంపరలో సీఐడీ డీఎస్పీ సురేందర్ నేతృత్వంలో శుక్రవారం కొడంగల్, అలంపూర్ ప్రాంతాలను చుట్టొచ్చారు. అనంతరం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రకాశ్‌రావును కలిసివెళ్లారు.
అవినీతికి చిరునామా!
గృహనిర్మాణ శాఖ అంటేనే అవినీతికి చిరునామాగా పేరుగాంచింది. ఈ శాఖలో పనిచేసే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరు కలిసి అర్హతలను పక్కకుపెట్టి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. రాజ కీయ జోక్యానికి సంబంధిత అధికారులు తలవంచక తప్పలేదు. దీంతో పాటు అధికారులు కూడా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి తమ చేతివాటం ప్రదర్శించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన ఈవినీతిపై చేపట్టిన సర్వేలో ఆరుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు గతంలో తయారుచేసిన నివేదికల్లో పొందుపర్చారు.
ఇందులో ఇద్దరు ఏఈలు ఉండగా, నలుగురు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు డీఈలు, నలుగురు ఏఈలు, నలుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశామని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు ఏడు క్రిమినల్ కేసులు నమోదుచేయగా వారిలో ఆరుగురు ఆధికారులు, 15 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు తెలిపా రు. మలిదశ జరుగుతున్న తనిఖీ ల్లో అక్రమాలు ఎలా వెలుగులోకి వస్తాయో వేచిచూడాలి.