స్కాం 60 కోట్లు.. అక్రమార్కులు 500 మంది!
Published Sat, Nov 8 2014 12:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం
కుంభకోణంలో నిగ్గుతేలిన నిజాలు
{పాథమిక దర్యాప్తు నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిన సీఐడీ ఐజీ
ఇవి కేవలం 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో దర్యాప్తులో తేలిన నిజాలేనని వెల్లడి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులోనే రూ. 60 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు సీఐడీ విభాగం ఐజీ చారుసిన్హా నివేదికను సమర్పించారు. ఇవి తొమ్మిది జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గల 36 గ్రామాల్లో సీఐడీ ప్రత్యేక బృందాల దర్యాప్తులో తేలిన నిజాలు మాత్రమేనని నివేదికలో పేర్కొన్నారు. గతంలో తెలంగాణలో జరిగిన బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాల్లో భారీఎత్తున కుంభకోణాలు జరిగాయనీ, దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే కేసీఆర్ సీఐడీ విభాగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఫిర్యాదును స్వీకరించి కేసులను నమోదు చేసిన సీఐడీ విభాగం దర్యాప్తును ప్రారంభించింది. 30 మందికి పైగా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసిన ఐజీ చారుసిన్హా దర్యాప్తును రెండు నెలల క్రితం ప్రారంభించారు.
మొదటి దశలో 9 తెలంగాణ జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంచుకున్నారు. అందులోని 36 గ్రామాల్లో సీఐడీ దర్యాప్తును సాగించింది. అయితే, ఈ దర్యాప్తులో క్రమంగా బయటపడ్డ నిజాలు చూసి దర్యాప్తు అధికారులే విస్మయం చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వ భూమి లేనిచోట ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులుండటం, మరోదానిలో ఇళ్ల నిర్మాణం జరగనిచోట జరిగినట్లుగా జిల్లా గృహనిర్మాణ సంస్థ రికార్డుల్లో నమోదు కావడం, అసలు లబ్ధిదారుల నుంచి ఇతరులు చౌకగా ఇళ్లను తీసుకుని.. సొంత నిర్మాణాలు చేసుకోవడం తదితర అక్రమాలు సీఐడీ దర్యాప్తులో బయటపడ్డాయి. దీంతో బలహీనవర్గాల కోసం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం లక్ష్యానికి తూట్లు పడి, కోట్ల రూపాయల్లో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలింది.
ఇది రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పైనే ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలు, అవినీతిలో పాలు పంచుకున్న వారిలో ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు చెందిన కొందరు అధికారులు మొదలుకొని.. జిల్లాల గృహ నిర్మాణ సంస్థలకు చెందిన మరికొందరు అధికారులు, మధ్య దళారీలు, కొందరు లబ్ధిదారులు కూడా ఉన్నట్లు సీఐడీ అధికారులు జాబితాను రూపొందించారు. ప్రాథమిక దశలోనే వీరంతా ఐదు వందల మందికి పైగానే అక్రమార్కులు ఉన్నట్లు తేల్చారు. వీరిలో ఎవరెవరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా తేలిన అక్రమాలపై సీఎం కేసీఆర్‌కు నివేదికను సమర్పించిన సీఐడీ ఐజీ చారుసిన్హా , ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement