charu sinha
-
శ్రీనగర్‌లో స్త్రీశక్తి
ఆమె తెలంగాణ కేడర్ 1996 బ్యాచ్ ఐ.పి.ఎస్ ఆఫీసర్. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలలో పని చేశారు. చిత్తూరులో పని చేసేటప్పుడు హెచ్ఐవి బాధితుల ఆస్తి హక్కు కోసం కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పని చేసేటప్పుడు చెంచుల వికాసానికి దోహదపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను కట్టడి చేశారు. బిహార్‌లో కూడా తన సత్తాను చాటిన చారుసిన్హా ఇప్పుడు శ్రీనగర్‌కు మొదటి సిఆర్పిఎఫ్ మహిళా ఐజిగా నియమితులయ్యి చరిత్ర సృష్టించారు. ఆమె ఆలోచనలు కొన్ని.... సీనియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ చారు సిన్హా ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. ఆమె శ్రీనగర్‌లో నిలుచుని దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆమె సి.ఆర్.పి.ఎఫ్ శ్రీనగర్ సెక్టార్‌కు ఇన్స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా శ్రీనగర్‌లో ఐజిగా ఒక మహిళ బాధ్యతలు తీసుకోవడం ఇదే ప్రథమం. అందునా ఉగ్రవాదుల గురి ప్రధానంగా ఉండే శ్రీనగర్ సెక్టార్లో ఒక మహిళా అధికారి ఈ సవాలును స్వీకరించడం మరీ విశేషం. శ్రీనగర్ సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్ ‘బ్రయిన్ నిషత్’ అనే ప్రాంతంలో ఉంది. మూడు జిల్లాలు– బడ్గమ్, గండెర్బల్, శ్రీనగర్‌తో పాటు కేంద్రపాలిత లడాక్ కూడా దీని ఆపరేషనల్ జూరీ డిక్షన్ కిందకు వస్తాయి. ఈ అన్ని ప్రాంతాలలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే కీలక బాధ్యత ఇప్పుడు చారు సిన్హాది అవుతుంది. అక్కడి పాలనా వ్యవస్థతో, పోలీసులు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించాలి. 2005లో శ్రీనగర్ సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్ మొదలైతే పురుష అధికారులే ఐ.జిలుగా బాధ్యతలు నిర్వరిస్తూ వచ్చారు. చారు సిన్హా ఇప్పుడు వారి స్థానంలో రావడం అమె దక్షతకు, ధైర్య సాహాసాలకు ఒక నిదర్శనం. హైదరాబాద్‌లో చదువుకుని చారు సిన్హా హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఎనిమిదవ తరగతి నుంచి ఆమెకు దేశానికి సేవ చేయాలన్న ఒక ఆశయం మొదలైంది. హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్ డిగ్రీ చదివి, సెంట్రల్ యూనివర్సిటీలో పిజి చేశాక 1996లో ఐ.పి.ఎస్‌కు ఎంపిక అయ్యారు. ఒక మహిళగా కఠినమైన పోలీస్ ట్రయినింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘ఎన్నో గాయాలు, ఎముకలు చిట్లడాలు అయ్యాయి. అయినా హార్స్ రైడింగ్ దగ్గరి నుంచి అన్ని శిక్షణలను విజయవంతంగా పూర్తి చేశాను’ అంటారామె. ట్రయినింగ్ అయ్యాక పులివెందుల ఏ.ఎస్.పిగా పని చేశారు. ఆ తర్వాత ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, మెదక్ ఇలా భిన్న ప్రాంతాలలో పని చేశారు. ‘నేను ఉద్యోగానికి చేరిన కొత్తల్లో ఇదంతా మగ ప్రపంచంగా ఉండేది. అందునా మీడియాకు ఇలా మహిళా పోలీస్ అధికారిని చూడటం ఇంకా కుతూహలంగా ఉండేది. నేను ఎక్కడికి వెళుతున్నాను... ఏం చేస్తున్నాను.. అని నా వెంటబడేవారు. ఒక దశలో నాకసలు పర్సనల్ లైఫ్ లేదా అని సందేహం కలిగేది. తర్వాత తర్వాత ఈ కుతూహలం తగ్గి వెసులుబాటు వచ్చింది’ అంటారామె. మనిషా? నేరమా? ‘కొత్తల్లో నేను నేరాలను చూసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకునేదాన్ని. నిందితుల్లో, బాధితుల్లో ఎవరు చెప్పేది సత్యం అని డైలమాలో ఉండేదాన్ని. ఎందుకంటే చట్టానికి బాధ్యులుగా ఉన్నవారు తప్పు నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తుల జీవితాలు నాశనమైపోతాయి. ఆ తర్వాత వ్యక్తులను కాదు నేరాన్ని మాత్రమే చూడాలి. జరిగిన నేరానికి శిక్ష మీద దృష్టి పెడితే వ్యక్తులు అప్రధానమైపోతారు అని తెలుసుకున్నాను’ అంటారామె. తనకు తనదైన పని విధానం ఉందనుకుంటారు చారు సిన్హా. ‘నా కింద పని చేసే వివిధ స్థాయుల అధికారులు ఉంటారు. కొందరు నాకు అంతా తెలుసు అనుకుంటారు. మరికొందరు నాకేమీ తెలియదు అనుకుంటారు. నేను ఒక బాధ్యత తీసుకున్నాక మొదట చేసే పని నా కింద పని చేసే సిబ్బందిని అంచనా వేయడం. వారి స్వభావాలు నాకు అర్థమవుతాయి. ఎవరు ఏమిటో అవగాహన వచ్చాక వారికి ఎలాంటి పని చెప్పాలో చూసి చెబుతాను. సాధారణంగా నా అంచనా తప్పదు’ అంటారామె. రైతుకు దొరికిన ఉంగరం ‘ఒక రైతు వ్యవసాయం చేసుకుని బతికేవాడు. అతనికి ఒకరోజు పొలంలో ఒక ఉంగరం దొరికింది. దానిని పెట్టుకుంటే తాను మాయం అయిపోతానని, ఎవరికీ కనపడడని అతనికి అర్థమైంది. వెంటనే అతడు దానిని పెట్టుకుని ఆ ఊరి భూస్వామి ఇంట్లో చొరబడి వజ్రాలు దొంగిలించి పారిపోతాడు. ఆ ఉంగరం వల్ల అతడు తనకు, ఆ భూస్వామికి చెడు తెచ్చాడు. ఆ ఉంగరాన్ని మంచికి ఉపయోగించి ఉంటే ఎంత బాగుండేది. పోలీసు విభాగాలలో ఉండే ప్రతి ఉద్యోగి అలాంటి ఉంగరం ఉన్నవాడి కిందే లెక్క. అధికారమే అతని ఉంగరం. దానితో మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నా కలీగ్స్ అందరికీ కొత్త అధికారులకూ ఈ కథే నేను చెబుతూ ఉంటాను’ అంటారు చారు సిన్హా. బిహార్‌లో, జమ్ములో చారు సిన్హాకు తీవ్రవాద కార్యకలాపాల నిరోధం కొత్త కాదు. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పని చేశారు. ఒకసారి ఆమె కింద పని చేసే నలుగురు పోలీసు సిబ్బంది కిడ్నాప్‌కు గురైనప్పుడు అవతలి పక్షం పెట్టిన డిమాండ్స్‌కు చారు లొంగలేదు. పది రోజుల తర్వాత గత్యంతరం లేక ఆ సిబ్బందిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని చూసి ఆమెకు బిహార్ నక్సల్ కార్యకలాపాల నిరోధానికి అక్కడి సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్‌కు ఐ.జిగా నియమించారు. అక్కడ ఆమె పని తీరును గమనించాక జమ్ము ఐ.జిగా నియమించారు. అక్కడా ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను చూపింది. దాంతో జటిలమైన బాధ్యత అయిన శ్రీనగర్ ఐజి స్థానాన్ని అప్పగించారు. చారు సిన్హాను తెలిసినవారు ఆమె ఈ పని సమర్థంగా చేయగలరని అంచనా వేస్తున్నారు. సత్యసాయిబాబా భక్తురాలు చారు సిన్హా సత్య సాయిబాబా ఆరాధకురాలు. 19 ఏళ్ల వయసులో మొదటిసారి సత్య సాయిబాబాను కలిసి ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఆశీర్వచనాలు పొందానని చెబుతారు. పుస్తకాలు చదవడం, విహారం, పెంపుడు శునకాలతో ఆటలు ఇవి ఆమెకు ఆటవిడుపు సమయాలు. – సాక్షి ఫ్యామిలీ -
శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఐజీగా చారు సిన్హా
న్యూఢిల్లీ : శ్రీనగర్ సెక్టార్ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్( సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్‌గా మహిళా అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. శ్రీనగర్ సెక్టార్‌కు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏ మహిళా ఐపీఎస్ అధికారి కూడా ఆ పోస్టులో నియామకం కాలేదు. చారు సిన్హా తెలంగాణ 1996 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ఈమె సీఆర్పీఎఫ్ బిహార్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతామైన ఈ సెక్టార్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు. అనంతరం జమ్మూ ఐజీగా బాధ్యతలు చేపట్టి చాలాకాలం పనిచేశారు. ఈ క్రమంలో సోమవారం ఆమెను శ్రీనగర్ ఐజీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. (తాళ్లు, ట్రెక్కింగ్ పరికరాలతో చొచ్చుకువచ్చారు) కాగా 2005 లో శ్రీనగర్ సెక్టార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళా పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు ఇండియన్ ఆర్మీతోను, జమ్మూ కశ్మీర్ పోలీసులతోను చారు సిన్హా సమన్వయంతో పని చేయవలసి ఉంటుంది. సీఆర్పీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్‌గా వ్యవహించనున్నారు. -
తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా
హైదరాబాద్: అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హాను నియమిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ పదవిలో కొనసాగుతున్న ఏకే ఖాన్ (డిసెంబర్ 31న) రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చారు సిన్హా ప్రస్తుతం అదే విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ చేయనున్న ఏకే ఖాన్(1981 ఐపీఎస్ బ్యాచ్).. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోట్లు సహా పలు కీలకమన కేసులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఈ-ఆఫీసు, లీగల్ సెల్, సైబర్‌సెల్ ఏర్పాటుచేసి దేశంలోనే తొలి సాంకేతిక హంగులు గల ఏసీబీ ఆఫీసుగా తెలంగాణ ఏసీబీ ఆఫీసును తీర్చిదిద్దడంలో ఖాన్ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. -
ప్రతి పాఠశాలలో..‘సీఏఎంసీ’ ఏర్పాటు చేయాలి
సాక్షి, సిటీబ్యూరో: బాలికలపై లైంగిక దాడులను నివారించేందుకు ప్రతి పాఠశాలలో చైల్డ్ అబ్యూజు మేనేజింగ్ కమిటీ (సీఏఎంసీ)లు ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ సభ్యురాలు, సీఐడీ ఐజీ చారుసిన్హా సూచించారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బాలల భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలను ఉద్దేశించి సిన్హా ప్రసంగించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళా, బాలికల భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించిందన్నారు. పాఠశాలలో చదువుతున్న 12 ఏళ ్లలోపు బాలికలను చైతన్య పరిచేందుకు సీఏఎంసీలు దోహదపడుతాయన్నారు. అలాగే స్కూళ్లలో లైంగిక దాడులు నివారించేందుకు ఈ కమిటీలు చాల ముఖ్యమన్నారు. ప్రతి స్కూల్లో సీఏఎంసీకి టీచర్‌ను కౌన్సెలర్‌గా నియమిస్తారన్నారు. ఈ కమిటీలకు స్థానిక ఠాణాకు చెందిన ఇన్స్పెక్టర్, విద్యాశాఖ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. రక్తసంబంధికులు, బంధువులు, స్నేహితులు తదితర వ్యక్తుల నుంచి ఇంటా బయట ఎదురయ్యే సమస్యలను వెంటనే పసిగట్టేలా బాలికలకు అవగాహన కల్పిస్తారు. ఈ కమిటీలు ఉన్నట్లు ప్రచారం చేయడం వల్ల నిందితుల్లో భయం పుడుతుందని చారుసిన్హా అభిప్రాయపడ్డారు. బాలికలు ధైర్యంగా ముందుకొచ్చి కమిటీలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉటుందన్నారు. ఈ మేరకు ఈ నెల 18న నెక్లెస్‌రోడ్డులో పెద్ద సంఖ్యలో స్కూల్ పిల్లలతో బాలికల అవగాహన ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంట పోలీసు కమిషనరేట్లకు చెందిన సుమారు 130 మంది ఇన్స్పెక్టర్లు, 250 మంది సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. సీడీలు, కరపత్రాల ద్వారా.. లైంగిక వేధింపుల బారిన పడకుండా బాలికలను చైతన్య పరిచేందుకు ప్రత్యేకంగా వీడియో సీడీలు, కరపత్రాలు, బుక్లెట్లను సిద్ధం చేశారు. వీటిని ఇన్స్పెక్టర్లకు అందజేశారు. త్వరలో వారి ఏరియాలో ఉన్న స్కూళ్లలో అందజేస్తారు. కమిటీ వీటి ద్వారా బాలికలకు అవగాహన కల్పించడంతోపాటు చైతన్య పరుస్తారు. కమిటీలో ఉంటే టీచర్లకు కూడా త్వరలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. -
స్కాం 60 కోట్లు.. అక్రమార్కులు 500 మంది!
బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కుంభకోణంలో నిగ్గుతేలిన నిజాలు {పాథమిక దర్యాప్తు నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిన సీఐడీ ఐజీ ఇవి కేవలం 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో దర్యాప్తులో తేలిన నిజాలేనని వెల్లడి సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులోనే రూ. 60 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు సీఐడీ విభాగం ఐజీ చారుసిన్హా నివేదికను సమర్పించారు. ఇవి తొమ్మిది జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గల 36 గ్రామాల్లో సీఐడీ ప్రత్యేక బృందాల దర్యాప్తులో తేలిన నిజాలు మాత్రమేనని నివేదికలో పేర్కొన్నారు. గతంలో తెలంగాణలో జరిగిన బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాల్లో భారీఎత్తున కుంభకోణాలు జరిగాయనీ, దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే కేసీఆర్ సీఐడీ విభాగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఫిర్యాదును స్వీకరించి కేసులను నమోదు చేసిన సీఐడీ విభాగం దర్యాప్తును ప్రారంభించింది. 30 మందికి పైగా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసిన ఐజీ చారుసిన్హా దర్యాప్తును రెండు నెలల క్రితం ప్రారంభించారు. మొదటి దశలో 9 తెలంగాణ జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంచుకున్నారు. అందులోని 36 గ్రామాల్లో సీఐడీ దర్యాప్తును సాగించింది. అయితే, ఈ దర్యాప్తులో క్రమంగా బయటపడ్డ నిజాలు చూసి దర్యాప్తు అధికారులే విస్మయం చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వ భూమి లేనిచోట ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులుండటం, మరోదానిలో ఇళ్ల నిర్మాణం జరగనిచోట జరిగినట్లుగా జిల్లా గృహనిర్మాణ సంస్థ రికార్డుల్లో నమోదు కావడం, అసలు లబ్ధిదారుల నుంచి ఇతరులు చౌకగా ఇళ్లను తీసుకుని.. సొంత నిర్మాణాలు చేసుకోవడం తదితర అక్రమాలు సీఐడీ దర్యాప్తులో బయటపడ్డాయి. దీంతో బలహీనవర్గాల కోసం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం లక్ష్యానికి తూట్లు పడి, కోట్ల రూపాయల్లో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పైనే ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలు, అవినీతిలో పాలు పంచుకున్న వారిలో ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు చెందిన కొందరు అధికారులు మొదలుకొని.. జిల్లాల గృహ నిర్మాణ సంస్థలకు చెందిన మరికొందరు అధికారులు, మధ్య దళారీలు, కొందరు లబ్ధిదారులు కూడా ఉన్నట్లు సీఐడీ అధికారులు జాబితాను రూపొందించారు. ప్రాథమిక దశలోనే వీరంతా ఐదు వందల మందికి పైగానే అక్రమార్కులు ఉన్నట్లు తేల్చారు. వీరిలో ఎవరెవరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా తేలిన అక్రమాలపై సీఎం కేసీఆర్‌కు నివేదికను సమర్పించిన సీఐడీ ఐజీ చారుసిన్హా , ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. -
మహిళకు భరోసానిద్దాం
టెక్నికల్‌గా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న భారతావని.. ఆడపిల్లల భద్రత విషయంలో పాతాళానికి దిగజారుతోంది. రాజధాని వీధుల నుంచి పల్లెసీమ వరకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న దాడులతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ(అగ్రికల్చర్ ప్రొడక్షన్) పూనం మాలకొండయ్య, హోంశాఖ సెక్రటరీ సౌమ్య మిశ్రా, ఐజీ (ట్రైనింగ్) స్వాతి లక్రా, సీఐడీ ఐజీ చారు సిన్హా తదితరులతో ఏర్పాటు చేసిన కమిటీ వివిధ రంగాల్లోని మహిళ ల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. శనివారం బషీర్‌బాగ్‌లోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్, టీచర్లతో సమావేశమైంది. మారేడ్‌పల్లిలోని పద్మశాలి కళ్యాణమంటపంలో పలువురు స్థానిక మహిళలు, బాలికల అభిప్రాయాలను తీసుకుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం.. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని పూనం మాలకొండయ్య అన్నారు. కమిటీ తక్షణ నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తామన్నారు. కమిటీ నివేదిక మహిళలకు భరోసా ఇస్తుందన్నారు. సమావేశంలో సలహాలు, సూచనలు - నైతిక విలువలు, సెక్స్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా పీరియడ్ ఏర్పాటు చేయాలి - సమాజంలో దుష్ర్పభావం కలిగించే సినిమాలు.. బాలికలను, మహిళలను కించపరిచే విధంగా వచ్చే టీవీ సీరియల్స్‌ను నియంత్రించాలి - పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగ టీచర్లను కఠినంగా శిక్షించాలి - దోషులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి - పాఠశాలల్లో సెల్ఫోన్లు నిషేధించాలి, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలి సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాలి తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల కంటే 6, 7, 8 తరగతుల విద్యార్థులే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్‌ను ముందుగానే నేర్పించాలి. తల్లిదండ్రులే పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. - శుభా శుక్లా, సైకాలజిస్టు, కౌన్సిలర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యాలు ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆపదలో పిల్లలే రియాక్ట్ అయ్యేవిధంగా శిక్షణ ఇవ్వాలి. అధికారులను, పోలీసులను కన్సల్ట్ చే సేలా చూడాలి. అవసరమయ్యే లీగల్ పాయింట్స్, ఫోన్ నంబర్లపై అవగాహన కల్పించాలి. - సంగీత వర్మ, ప్రధాన కార్యదర్శి, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం సమాజంతో భయం మహిళలు ఎక్కువగా భయపడుతున్నది చుట్టూ ఉన్న సమాజం గురించే. కూతురుకు ఏదైనా జరిగితే బయటకు చెప్పుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. చట్టానికి తెలిసే లోపే సొసైటీలోని పెద్దలు తమ పలుకుబడితో దోషులకు అండగా నిలుస్తున్నారు. ఈ సమస్యను స్త్రీలే ఎదుర్కోవాలి. - భార్గవి, స్పెషల్ ఆఫీసర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మార్పు ఇంటి నుంచే ముస్లిం యువతులపై ఇంటా, బయటా వివక్ష ఉంటోంది. మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. పెళ్లి చేస్తే ఆడపిల్ల భారం తగ్గుతుందనుకునే తల్లిదండ్రులు మారాలి. వారిని బాగా చదివించడంతో పాటు అన్ని విధాలా ప్రోత్సహించాలి. - సబియా సుల్తాన, టీచర్ - కేజీ బీవీ - ముషీరాబాద్/కంటోన్మెంట్ -
తెలంగాణ సీఐడీ చీఫ్‌గా చారుసిన్హా
హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సీఐడీ చీఫ్‌గా ఉన్న టి.కృష్ణప్రసాద్‌ను టెక్నికల్ సర్వీసెస్ చీఫ్‌గా బదిలీ చేసింది. అలాగే సీఐడీ చీఫ్‌గా చారు సిన్హాను నియమించారు. టి.కృష్ణ ప్రసాద్ 1986వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, చారు సిన్హా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాకే ఏపీపీఎస్సీ విభజన
కమిషన్ కార్యదర్శి చారుసిన్హా వెల్లడి పుట్టపర్తి, న్యూస్‌లైన్: సీమాంధ్ర, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విభజన ఉంటుందని కమిషన్ కార్యదర్శి చారుసిన్హా పేర్కొన్నారు. గురువారం ఆమె అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో 15వేల నుంచి 20వేల వరకు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే సీమాంధ్ర, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తరువాతే వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు అప్పటి ఖాళీలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అదనపు ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా వీఆర్వో పరీక్షలను నిర్వహించి, తక్కువ సమయంలోనే ఫలితాలను ప్రకటించామన్నారు. పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియను సైతం త్వరగా ముగిస్తామని చెప్పారు.