ప్రతి పాఠశాలలో..‘సీఏఎంసీ’ ఏర్పాటు చేయాలి
సాక్షి, సిటీబ్యూరో: బాలికలపై లైంగిక దాడులను నివారించేందుకు ప్రతి పాఠశాలలో చైల్డ్ అబ్యూజు మేనేజింగ్ కమిటీ (సీఏఎంసీ)లు ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ సభ్యురాలు, సీఐడీ ఐజీ చారుసిన్హా సూచించారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం బాలల భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలను ఉద్దేశించి సిన్హా ప్రసంగించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళా, బాలికల భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించిందన్నారు. పాఠశాలలో చదువుతున్న 12 ఏళ ్లలోపు బాలికలను చైతన్య పరిచేందుకు సీఏఎంసీలు దోహదపడుతాయన్నారు. అలాగే స్కూళ్లలో లైంగిక దాడులు నివారించేందుకు ఈ కమిటీలు చాల ముఖ్యమన్నారు. ప్రతి స్కూల్‌లో సీఏఎంసీకి టీచర్‌ను కౌన్సెలర్‌గా నియమిస్తారన్నారు. ఈ కమిటీలకు స్థానిక ఠాణాకు చెందిన ఇన్‌స్పెక్టర్, విద్యాశాఖ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. రక్తసంబంధికులు, బంధువులు, స్నేహితులు తదితర వ్యక్తుల నుంచి ఇంటా బయట ఎదురయ్యే సమస్యలను వెంటనే పసిగట్టేలా బాలికలకు అవగాహన కల్పిస్తారు.
ఈ కమిటీలు ఉన్నట్లు ప్రచారం చేయడం వల్ల నిందితుల్లో భయం పుడుతుందని చారుసిన్హా అభిప్రాయపడ్డారు. బాలికలు ధైర్యంగా ముందుకొచ్చి కమిటీలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉటుందన్నారు. ఈ మేరకు ఈ నెల 18న నెక్లెస్‌రోడ్డులో పెద్ద సంఖ్యలో స్కూల్ పిల్లలతో బాలికల అవగాహన ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంట పోలీసు కమిషనరేట్లకు చెందిన సుమారు 130 మంది ఇన్‌స్పెక్టర్లు, 250 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
సీడీలు, కరపత్రాల ద్వారా..
లైంగిక వేధింపుల బారిన పడకుండా బాలికలను చైతన్య పరిచేందుకు ప్రత్యేకంగా వీడియో సీడీలు, కరపత్రాలు, బుక్‌లెట్‌లను సిద్ధం చేశారు. వీటిని ఇన్‌స్పెక్టర్లకు అందజేశారు. త్వరలో వారి ఏరియాలో ఉన్న స్కూళ్లలో అందజేస్తారు. కమిటీ వీటి ద్వారా బాలికలకు అవగాహన కల్పించడంతోపాటు చైతన్య పరుస్తారు. కమిటీలో ఉంటే టీచర్లకు కూడా త్వరలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.