Jayalakshmi Mutually Aided Multipurpose Cooperative Society Is Ready To Seize, See Details Inside - Sakshi
Sakshi News home page

‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం

Published Sat, Jun 3 2023 4:03 AM | Last Updated on Sat, Jun 3 2023 10:54 AM

Prepared ground for seizure of Jayalakshmi Society assets - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లను నిలువునా ముంచేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసిన జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ గత పాలకవర్గ సభ్యుల ఆస్తులను సీజ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. సీఐడీ ఆ దిశగా దూకుడు పెంచింది. నిన్న మొన్నటివరకు మార్గదర్శి కుంభకోణాన్ని ఛేదించడంలో నిమగ్నమైన సీఐడీ ఇప్పుడు తాజాగా ‘జయలక్ష్మి’పై దృష్టిపెట్టింది. కాకినాడ సర్పవరంలోని జయలక్ష్మి మెయిన్‌ బ్రాంచిలో రెండ్రోజులుగా సీఐడీ బృందం పాత పాలకవర్గ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ సహా డైరెక్టర్లు వ్యూహాత్మకంగా ముందుగానే అమ్మేసిన ఆస్తుల సీజ్‌కు రికార్డులను సిద్ధంచేసింది.

జామీను దొరక్కపోవడంతో జైలులోనే..
ఏప్రిల్‌లో కాకినాడ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి మ్యూ­చువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొ­సైటీ లిమిటెడ్‌ బోర్డు తిప్పేసి 19,911 మందికి చెంది­న రూ.520 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టేసిన సంగతి తె­లి­సిందే. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల్లో 29 బ్రాంచీలను ఏర్పాటుచేసి ఈ మోసానికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరి డిపాజిటర్‌ వరకు న్యాయం చేసేందుకు ఏర్పాట్లుచేస్తోంది.

ఇందులో భాగంగా సీఐడీని రంగంలోకి దించడంతో చైర్మన్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్‌పర్సన్‌ విశాలాక్షి, 11 మంది సహా డైరెక్టర్లపై కేసులు నమోదుచేయడానికి, ముగ్గురు మినహా అందరినీ అరెస్టుచేయించడానికి వీలు చిక్కింది. ఆంజనేయులు, విశాలాక్షి, డైరెక్టర్లకు బెయిల్‌ మంజూరైనప్పటికీ జామీను ఇవ్వడానికి ఎవరు ముందుకురాకపోవడంతో వారంతా ప్రస్తుతం విశాఖ సెంట్రల్‌ జైలులోనే ఉన్నారు.

ఆస్తులు సీజ్‌ చేస్తున్న సీఐడీ
ఈ క్రమంలో.. గత పాలకవర్గ చైర్మన్, వైస్‌ చైర్‌పర్సన్‌ సహా డైరెక్టర్ల పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను సీజ్‌ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పాలకవర్గ చైర్మన్‌ గంగిరెడ్డి త్రినాథ్‌రావు సమక్షంలో సీఐడీ బృందం గురు, శుక్రవారాల్లో కాకినాడ మెయిన్‌ బ్రాంచిలో రికార్డులను పరిశీలించింది. ఒక్క కాకినాడ జిల్లాలోని ఎనిమిది బ్రాంచీల వివరాలు సేకరిస్తేనే కోట్ల విలువైన చర, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు తేలింది.

సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సీఐడీ సీఐ పైడప్ప నాయుడు, ఆరుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం రికార్డులు, గత పాలకవర్గ సభ్యుల పేరుతో ఉన్న డాక్యుమెంట్లను సేకరించి ఆస్తులను సీజ్‌ చేసే పనిలో నిమగ్నమైంది. వీటిపై చట్టపరంగా ఆంజనేయులు, విశాలాక్షి సహా డైరెక్టర్లకు ఎటువంటి హక్కుల్లేవని సీఐడీ తేల్చింది.

ఆర్నెల్ల ముందు నుంచే అమ్మకానికి ఆస్తులు..
ఇక విశాలాక్షి, భర్త, కుమారులు కలిసి బ్యాంకు బోర్డు తిప్పేయడానికి ఆర్నెల్ల ముందునుంచే తమ పేరుతో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టేశారు. కాకినాడలో ఒక మార్ట్‌.. రామారావుపేట, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర, స్థిరాస్తులతో పాటు ఎనిమిది ఎకరాల భూమిని కూడా ఆమె విక్రయించినట్లుగా గుర్తించారు. అలాగే, విశాలాక్షి పేరుతో వి­విధ జిల్లాల్లో ఉన్న మొత్తం 64 ఆస్తులనూ సీజ్‌ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది.

సుమారు రూ.120 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేసినట్లు తేలింది. వా­టి­లో కాకినాడ ఎస్‌ఈజడ్‌లో 30 ఎకరాలు ఉంది. ఇలా కొ­నుగోలుచేసి తిరిగి అమ్మేసిన ఆస్తులను సీజ్‌ చే­యడంపై సీఐడీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఆస్తులను కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు సిద్ధంచేస్తోంది. వారిపై చార్జిషీట్లు కూడా వేయనుంది.

సీఐడీ దూకుడుతో వారంతా బయటకు..
బ్యాంకు నుంచి రూ.120 కోట్లు వరకు రుణాలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉన్న వారంతా ఇప్పుడు సీఐడీ దూకుడుతో బయటకొస్తున్నారు. నోటీసులు తీసుకుని 50 రోజులు దాటినా స్పందించని వారు సీఐడీ జోరుతో రుణాలు జమచేసేందుకు రుణగ్రహీతలు ముందుకొస్తున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా రుణగ్రస్తుల ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లుగా లెక్కతేలింది. 

30శాతం తిరిగి చెల్లింపు?
ఇక డిపాజిటర్లకు తొలి విడతగా మొత్తం డిపా­జిట్లలో 30 శాతం తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకల్లా బాధితు­లకు రూ.100 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు 3 కోట్లు వసూలయ్యాయి. డిపాజి­టర్ల­లో 14వేల మంది రూ.లక్ష నుంచి రూ.4 లక్షలలోపు డిపాజిట్‌ చేసిన వారే. రూ.26 కోట్లు తిరిగి ఇచ్చేస్తే మూడొంతులు మంది బాధితులు జయలక్ష్మి కుంభకోణం నుంచి బయటపడతారు. మరోవైపు.. సివి­ల్, అండ్‌ క్రిమినల్‌ కేసుల ప్రకారం ముందుకెళ్లే అ­వ­కాశముండడంతో జూలై 10 నాటికి జమచేస్తామని రుణాలు తీసుకున్న వారు చెబుతున్నారు.
– గంగిరెడ్డి త్రినాథ్‌రావు, చైర్మన్, కాకినాడ జయలక్ష్మి సొసైటీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement