కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి మెయిన్ బ్రాంచ్‌లో సోదాలు
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో డిపాజిటర్ల సొమ్మును దారి మళ్లించి నట్టేటముంచిన జయలక్ష్మీ సొసైటీ లిమిటెడ్ గత పాలకవర్గ అవినీతి, అవకతవకలపై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. సొసైటీ పాలకవర్గంలోని కీలకమైన గత చైర్మన్, వైస్ చైర్మన్ దంపతులతో పాటు వారి కుమారుడిని ఇప్పటికే జైలుకు పంపిన సీఐడీ అధికారులు..మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మరో వైపు జయలక్ష్మీ సొసైటీకి కొత్త పాలకవర్గం అందుబాటులోకి వచ్చింది.
కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తాళాలు తెరవాలని సీఐడీ అధికారులను కోరుతూ మహాజన సభ వేదిక ద్వారా ఈ పాలకవర్గం తీర్మానించింది. కాగా, రాష్ట్రంలోని 29 బ్రాంచ్‌లలో అధికారులు సోదాలకు దిగారు. సోమవారం పిఠాపురం బ్రాంచ్‌లో తనిఖీలు ప్రారంభించిన అధికారులు మంగళవారం అన్ని బ్రాంచ్‌లకు తిరుగుతున్నారు.
సర్పవరం వద్ద మెయిన్ కార్యాలయంలో మంగళవారం సీఐడీ అడిషనల్ ఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు బుచ్చిరాజు, రమణమూర్తి, సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. బ్రాంచ్ మేనేజరు టి.పద్మావతి, సీఏవో లీలాప్రసాద్‌తో అడిషనల్ ఎస్పీ రవివర్మ మాట్లాడారు.కాగా, ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ముగ్గురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment