మూడు తరాలుగా కొడవళ్ల తయారీ
నడకుదురులో పలు కుటుంబాలకు ఇదే వృత్తి
ఉమ్మడి తూర్పు గోదావరితో పాటు పలు జిల్లాలకు ఎగుమతులు
వ్యవసాయ సీజన్‌లో రైతుల అడుగులు ఆ గ్రామం వైపే..
కణకణ మండే అగ్ని కీలల నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. పిడికిళ్లు బలంగా బిగించి మలాటు(పెద్ద సుత్తి వంటి సాధనం)లతో ఇనుప కమ్మెలపై కార్మికులు గట్టిగా కొడుతున్న శబ్దాలు ఆ ఊళ్లో సర్వసాధారణం. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌లో రైతన్నకు ఉపయోగపడే కొడవళ్లతో పాటు, ఇతర పనిముట్ల తయారీలో రేయింబవళ్లు శ్రమిస్తూంటుంది నడకుదురు గ్రామం.
కాకినాడ సిటీ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే ఎక్కువ మంది రైతుల అడుగులు నడకుదురు గ్రామం వైపే పడతాయి. కాకినాడ సిటీకి కూతవేటు దూరాన.. కరప మండలంలో ఉన్న ఈ ఊరు పంట కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీకి పెట్టింది పేరు. వరి, మినుముతో పాటు, గడ్డి కోతలకు అవసరమైన కొడవళ్లను, ఇతర పనిముట్లను నడకుదురు గ్రామంలో తయారు చేస్తూంటారు. సుమారు 80 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కొడవళ్ల తయారీ ప్రారంభమైంది.
ప్రస్తుతం నాణ్యమైన కొడవళ్లను నైపుణ్యంతో తయారు చేయడంలో మూడో తరం కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ గ్రామంలో 4 కుటుంబాలకు చెందిన వారు 46 మందికి పైగా ఐదుకు పైగా కొలుముల్లో పని చేస్తున్నారు. నడకుదురులో తయారైన కొడవళ్లు తెలుగు రాష్ట్రాల నలుమూలలకూ సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు సైతం ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతున్నాయి.
గిట్టుబాటు కాక..
కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్ బద్దలను రాజమహేంద్రవరం, మండపేట, విశాఖపట్నంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలోల లెక్కన కొనుగోలు చేసి, దిగుమతి చేసుకుంటారు. ఏటా ముడి సరకు ధరలు పెరుగుతున్నా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. బేల్ బద్దల లోడు గత ఏడాది రూ.58 వేల నుంచి రూ.60 వేలు ఉండగా ఈ సంవత్సరం రూ.65 వేలకు పెరిగింది. దీంతో పాటు కొడవలి తయారీకి అవసరమైన బొగ్గులు, చెక్కతో పాటు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి.
తమ శ్రమ వృథా అవుతోందని, వస్తున్న డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తయారైన కొడవళ్లకు అమర్చేందుకు చెక్కతో చేసిన పిడులు అవసరమవుతాయి. ఈ పిడులు తయారు చేసేందుకు గతంలో గ్రామంలోనే ప్రత్యేకంగా కార్మికులుండేవారు. వేరే ఉపాధి అవకాశాలతో కొంత మంది, శ్రమకు తగిన ఫలితం దక్కక మరి కొంతమంది ఈ వృత్తికి దూరమయ్యారు.
కొలిమిలో కాలి.. కొడవలిగా మారి..
కొడవళ్లు తయారు చేసే కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుంటూంటారు. తొలుత ముడి ఇనుప బద్దీలను కొలిమిలో ఎర్రగా కాలుస్తారు. అనంతరం, ఆ ఇనుప బద్దలను మలాటులతో బలంగా కొట్టి, కొడవలి ఆకృతిలోకి మలుస్తారు. ఆ తర్వాత దానికి సాన పట్టి, నొక్కులు కొట్టి, చెక్క పిడులు అమరుస్తారు. ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లు తయారు చేస్తూంటారు. వీటిని రూ.40, రూ.60, రూ.80, రూ.120 ధరల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తారు.
గతంలో నడకుదురు గ్రామంలో సీజన్‌లో 80 వేలకు పైగా కొడవళ్లు తయారు చేసేవారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో కొడవళ్లకు గిరాకీ తగ్గింది. దీంతో ఈ కార్మికులు వ్యవసాయ, ఇంటి పనులకు ఉపయోగించే గునపాలు, పారలు, కత్తిపీటల వంటి వాటితో పాటు పంచాయతీ కార్మికులు వినియోగించే వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
యాంత్రీకరణతో తగ్గిన డిమాండ్
వ్యవసాయంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న యాంత్రీకరణ కొడవళ్ల తయారీపై కొంత మేర ప్రభావం చూపింది. గతంలో నడకుదురు నుంచి వేలాదిగా కొడవళ్ల అమ్మకాలు జరిగేవి. ప్రస్తుత్తం వీటికి డిమాండ్ బాగా తగ్గిందని, దీంతో పని వారు కూడా రావడం లేదని తయారీదార్లు చెబుతున్నారు. తమ కార్ఖానాల్లో ఏడాదంతా కొడవళ్లు తయారు చేసినా.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నాలుగు నెలలూ పని ఒత్తిడి అధికంగా ఉండేదని అంటున్నారు.
ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందని, దీంతో ఉపాధి తగ్గి, తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు వివిధ రకాల సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ఆదుకొనేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆవిధంగా ఆదుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు.
సబ్సిడీపై రుణాలివ్వాలి
గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. నాటికి, నేటికి ముడి సరకుల ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. మేము చేసే కొడవళ్లకు గిరాకీ ఉన్నా.. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మాపై దృష్టి సారించి, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలి. సబ్సిడీపై రుణాలు అందించడంతో పాటు ముడి వస్తువులకు సబ్సిడీ కూడా ఇవ్వాలి.
– కణిత నాగేశ్వరరావు, కొడవళ్ల తయారీదారు, నడకుదురు
నాణ్యత పాటిస్తాం
నడకుదురులో మా మూడు కుటుంబాలకు చెందిన వారు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తూంటారు. నాణ్యమైన ముడి ఇనుమును ఉపయోగించటంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కొడవళ్లు తయారు చేస్తాం. దీంతో అవి ఎక్కువ కాలం రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లనే మా నడకుదురు కొడవళ్లకు మంచి పేరు ఉంది. పంట కోత యంత్రాలు రావడంతో కొన్నాళ్లుగా కొడవళ్లకు డిమాండ్ తగ్గింది.
– కణితి రాంబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు, నడకుదురు
Comments
Please login to add a commentAdd a comment