సాక్షి, అమరావతి: రైతన్నలకు సాగు వ్యయాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలను అందించడమే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఏపీలో రసాయన పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గింది. రసాయన క్రిమి సంహారకాల వాడకం నుంచి మన రైతన్నలు దూరం జరుగుతున్నారు. రాష్ట్రంలో విషపూరిత పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గింది. జాతీయ స్థాయి గణాంకాల్లో ఇది ప్రతిబింబించింది. అయితే దేశవ్యాప్తంగా మాత్రం రసాయన పురుగు మందుల వినియోగం పెరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక – 22 వెల్లడించింది.
చదవండి👉 పథకాలు ఆపేయాలట!
ఏకంగా 22.63 శాతం తగ్గుదల
ఆంధ్రప్రదేశ్‌లో రసాయన పురుగు మందుల వినియోగం 2016–17తో పోల్చితే 2020–21 నాటికి ఏకంగా 22.63% మేర తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీటి వాడకం 6.06% మేర పెరిగింది. 2016–17లో ఆంధ్రప్రదేశ్‌లో 2,015 మెట్రిక్ టన్నుల రసాయన పురుగు మందులను వినియోగించగా 2020–21 నాటికి 1,559 మెట్రిక్ టన్నులకు తగ్గింది. అంటే 456 మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీటి వాడకం 58,634 మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా 62,193 మెట్రిక్ టన్నులకు పెరిగింది. బిహార్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రసాయన పురుగు మందుల వాడకం క్రమంగా పెరుగుతుండగా ఏపీతోపాటు గుజరాత్, తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో తగ్గుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
ఆరోగ్యం.. పెట్టుబడి ఆదా
అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో సేంద్రీయ సాగు విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా ఆర్బీకేల ద్వారా విస్త్రృత అవగాహన కల్పిస్తూ ప్రకృతి సాగు విధానాలను అనుసరించే రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో రెండేళ్లుగా రసాయన పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గిపోవటాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రతి గ్రామంలో ప్రకృతి సేద్యమే లక్ష్యం. సహజ సాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకుండా రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో సేంద్రియ సాగు పెద్ద ఎత్తున చేపట్టేలా, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సహజ సాగును ప్రోత్సహిస్తోంది.
ప్రత్యేక వర్సిటీ.. ఉత్పత్తులకు సర్టిఫికేషన్
హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత సాధించడం, కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములను సారవంతంగా మార్చడం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ కల్పించడం తదితర అంశాలపై గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చర్చించిన విషయం తెలిసిందే.
రసాయనాల వాడకం ద్వారా పండించే ఆహార ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ లాంటి వ్యాధులకు దారి తీస్తోందని సీఎం పేర్కొన్నారు. సహజ సాగు విధానాలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా క్షేత్రస్ధాయిలో అమలు కావాలన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు సహజసాగులో గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించినట్లు తెలిపారు. సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు వీటికి సర్టిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
విస్తరిస్తున్న ప్రకృతి సాగు..
రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు విస్తరిస్తోంది. 2016–17 సీజన్‌లో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్‌ఎఫ్) కింద 40 వేల మంది రైతులు 20 వేల ఎకరాల్లో ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టగా ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్‌ఎఫ్)గా అమలవుతోంది. 2020–21 సీజన్‌లో 3,730 గ్రామాల్లో 5.92 లక్షల మంది రైతులు 6.71 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగును అనుసరించారు.
అవసరానికి మించి వాడకంతో..
గతంలో పంటకు చీడపీడలొచ్చాయని డీలర్ల వద్దకు వెళ్తే బలవంతంగా ఖరీదైన పురుగు మందులను అంటగట్టేవారు. అవసరానికి మించి వాడటంతో సాగు వ్యయం విపరీతంగా పెరిగి రైతన్నలు అప్పుల పాలయ్యేవారు. ఇప్పుడు అలాంటి వాటికి తావులేకుండా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన పురుగుల మందులను అందుబాటులోకి తేవడంతోపాటు చీడపీడల నివారణకు శాస్త్రవేత్తలు తగిన సూచనలు అందిస్తున్నారు. ఫలితంగా రసాయన క్రిమి సంహారకాల వాడకం గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment