సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచక పాలన పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలనే కాకుండా సామాన్యులను కూడా కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో, బాధితులు ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.
అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.
తమ షాపులు కూల్చివేయడంతో ఆవేదనకు గురైన మత్స్యకారుడు మల్లాడి సింహాద్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సింహాద్రిని వెంటనే ఆసుపత్రి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సింహాద్రికి చికిత్స కొనసాగుతోంది. అయితే, రోడ్డు ప్రమాదాలకు ఇన్ని రోజులు లేని ఆంక్షలు ఇప్పుడే వచ్చాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment