సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.
ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
కాగా, రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్‌ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment