pantam nanaji
-
జనసేన MLA పంతం నానాజీ అనుచరుల దాష్టీకం
-
జనసేన ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం.. షాపులు కూల్చివేత
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచక పాలన పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలనే కాకుండా సామాన్యులను కూడా కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో, బాధితులు ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.తమ షాపులు కూల్చివేయడంతో ఆవేదనకు గురైన మత్స్యకారుడు మల్లాడి సింహాద్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సింహాద్రిని వెంటనే ఆసుపత్రి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సింహాద్రికి చికిత్స కొనసాగుతోంది. అయితే, రోడ్డు ప్రమాదాలకు ఇన్ని రోజులు లేని ఆంక్షలు ఇప్పుడే వచ్చాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
‘పంతం’ నెగ్గింది.. నిందితుల వైపే కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ వివాదాన్ని కంచికి చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటనపై నాలుగు రోజుల్లో నాలుగు మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్నివర్గాలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఆదినుంచీ అదే ప్రయత్నం వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెరవెనుక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంతపాటిల్ నేరుగా రంగంలోకి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ.. ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ నరసింహం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీస్ యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీస్ యంత్రాంగం మొదటినుంచీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. ప్రాయశ్చిత దీక్ష చేస్తే సరిపోతుందా? అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుడిని బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తానంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే నానాజీ నాటకీయంగా క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చితమంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్యవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ముకాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బెయిల్‌బుల్ సెక్షన్లతో సరి చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిల్‌బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్ 292 బీఎన్ఎస్ (భారత న్యాయసంహిత) పబ్లిక్ న్యూసెన్స్ (రూ.200 జరిమానా), 115(2) బీఎన్ఎస్ స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం (ఏడాది జైలు, రూ.1,000 జరిమానా) 351 బీఎన్ఎస్ వ్యక్తి పరువు తీయడం, శారీరకంగా, మానసికంగా బెదిరించడం (126(2) రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం నెల జైలు, రూ.500 జరిమానా) వంటి సెక్షన్లతో సరిపెట్టారు. ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన ఈ సెక్షన్లన్నీ బెయిల్‌కు అవకాశం ఉన్నవే కావడం గమనార్హం. దళితుడైన వైద్యుడిని తీవ్రంగా అవమానించి.. చంపేస్తానని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా ప్రభుత్వ ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా బెయిల్‌కు అవకాశం ఉన్న సెక్షన్లతో కేసును నీరుగార్చేశారు. -
దళిత సంఘాల కన్నెర్ర
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు. విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.డీజీపీకి మెమోరాండం అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
డాక్టర్‌పై దాడి.. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడికాగా, రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. -
ఏపీలో రౌడీ రాజ్యం: జూపూడి ప్రభాకర్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రౌడీరాజ్యం కొనసాగుతోందని, రౌడీలు,రాజకీయ నాయకులు కలిసి జనానికి చుక్కలు చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జూపూడి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కాకినాడ టౌన్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే నానాజి రాద్దాంతం చేశారు.నానాజీ మీద పదకొండు కేసులున్నాయి.అలాంటి రౌడీని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?రంగరాయ మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.అలాంటి కాలేజీలో ప్రొఫెసర్లను,అమ్మాయిలను ఎమ్మెల్యే మనుషులు వేధిస్తున్నారు.దీనిపై ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తే ఆయనపై దాడి చేశారు.రౌడీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు స్టూడెండ్స్ డిమాండ్ చేస్తున్నారు.ఒక ఎస్సీ డాక్టర్‌ను పచ్చి బూతులతో ఎమ్మెల్యే దూషించారు.దళితులు కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు జాగ్రత్త.కలెక్టర్,ఎస్పీ కలిసి ఈ కేసును రాజీ చేస్తున్నారు.ఆ అధికారులు ఇలాంటి పనులు చేయడడానికే ఉన్నారా?దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఏం చేస్తున్నారు?మంత్రి సత్యకుమార్ కూడా ఒకప్పుడు రౌడీనే.డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆత్మగౌరవానికి భంగం కలిగింది.దానికి తిరిగి ఎవరు తెచ్చిస్తారు? ప్రజలు ఆగ్రహిస్తే నానాజీ లాంటి తురుమ్ఖాన్లు కనుమరుగు అవుతారు.జనం నిలదీసేసరికి ప్రాయచ్చితదీక్ష చేస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చేసే ఉద్యమానికి దళిత సంఘాలు మద్దతిస్తాయి.రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని తగులపెట్టారు.రఘురామకృష్ణంరాజు దళితులకు క్షమాపణలు చెప్పాలి.దళితులంతా ఇప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్నారు.దళితులంతా వైసీపికి మద్దతు ఇస్తున్నందుకు కక్ష కట్టారు.ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు.ఏం సాధించారని వంద రోజుల పండుగ చేసుకుంటున్నారు?ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు కేసును సుమోటోగా తీసుకుని విచారించాలి.దళిత ఉద్యోగులకు సరైన పోస్టింగులు కూడా ఇవ్వడం లేదు.టీటీడీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది’అని జూపూడి హెచ్చరించారు.ఇదీ చదవండి: పవన్ ప్రాయశ్చిత్తం అసలు దేనికోసం -
‘పంతం’పై కేసు నమోదుకు మీనమేషాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై 24 గంటలు దాటినా కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది. దశలవారీ ఉద్యమాలకు ప్రభుత్వ వైద్యుల సంఘం సమాయత్తమవుతోంది. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును శనివారం ఎమ్మెల్యే నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.పవన్‌కళ్యాణ్‌కు బాధ్యత లేదా?కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆవరణలోని వాలీబాల్ కోర్టుకు వైద్య విద్యార్థినులు సైతం ఆడుకోవడానికి వస్తుంటారు. ఇందులో కొంతకాలంగా ఎమ్మెల్యే అనుచరులు వాలీబాల్ ఆడుతూ బహిరంగంగా బెట్టింగ్‌లు వేస్తున్నారని, వైద్య విద్యార్థినులతోపాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికోలు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు గతంలోనే తెలియచేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు రంగరాయ కళాశాల యాజమాన్యంతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బెట్టింగ్‌రాయుళ్లను వెనకేసుకువస్తూ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుడిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధిత ప్రొఫెసర్ఎమ్మెల్యే, అతని అనుచరులు బెదిరింపులు, దాడితో ఫోరెన్సిక్ హెచ్‌వోడీ ఉమామహేశ్వరరావు మానసిక ఆందోళనతో ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్యసంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావును కలిసి సంఘీభావం తెలిపారు. కాగా, ఎమ్మెల్యే నానాజీ తీరును గర్హిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఆదివారం ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది. వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంఘ అధ్యక్షుడు డాక్టర్ జయధీర్‌బాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీ ఆందోళనకు ఉపక్రమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక న్యాయ సాధన సమితి డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్షులు డాక్టర్ భానుమతి, ప్రధాన కార్యదర్శి నవీన్‌రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోకా పవన్‌కుమార్, ముఖ్య సలహాదారులు అడ్వకేట్ జవహర్ అలీ, అయితాబత్తుల రామేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి జి.ఆస్కార్‌రావు, జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు డాక్టర్ ఉమామహేశ్వరరావును పరామర్శించారు. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ మొక్కుబడిగా స్పందించారు. వైద్యులకు, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేనూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా‘ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించాను. నేనేదో తగువు సెటిల్ చేద్దామని ఆర్ఎంసీ హాస్టల్‌కు వెళ్లాను. అక్కడ నేనే తగువులో పడిపోయాను. దానికి ఇప్పుడు సభాముఖంగా డాక్టర్‌కు సారీ చెబుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న అలా ఉన్నాను. తిరుపతి లడ్డూ విషయంలో ఎవరో చేసిన తప్పునకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆయనే దీక్ష చేపడుతున్నప్పుడు ఆయన పార్టీలో ఉండి, నేను తప్పు చేసి నేను ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదని భావించి సోమవారం కాకినాడ గొడారిగుంట ఇంటి వద్ద దీక్ష చేపడుతున్నాను’ అని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అయితే ఈ ప్రకటనపై పార్టీనేతలు విస్తుపోతున్నారు. నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు అన్నట్టుగా ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి: కురసాల కన్నబాబుజనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచిత ప్రవర్తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష్యుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. వైద్యుడిపై ఎమ్మెల్యే, అతని అనుచరుల దురుసు ప్రవర్తన, వ్యవహారశైలి, దాడి జనమంతా వీడియోల్లో చూశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాల్సిందే. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రాయశ్చితం అంటూ దీక్షలు చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదన్నారు.ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా..ఈ ఘటనపై శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం జిల్లా ఎస్పీ విక్రాంతపాటిల్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారు అందుబాటులో లేదు. దీంతో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీరామకోటేశ్వరరావు, సర్పవరం సీఐ బొక్కా పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. రెండుచోట్లా ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఆదివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.మరోవైపు కేసు విషయంలో వితండ వాదన జరుగుతోంది. వైద్యుడు స్వయంగా ఫిర్యాదు చేయలేదు, ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ పృథ్వీ చెబుతున్నారు. వైద్యుడిని చంపుతానని బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ఎందుకు కేసు నమోదు చేయలేదని వైద్యులు, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనప్రభుత్వ వైద్యుల సంఘంసాక్షి, అమరావతి: ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ను ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశం వివరాలను అధ్యక్షుడు డాక్టర్ జయ«దీర్ మీడియాకు విడుదల చేశారు. సోమవారం నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ప్రకటించారు.ప్రొఫెసర్‌పై దాడి హేయందాడికి పాల్పడ్డ జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబుసాక్షి, అమరావతి: మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హామీలు అమలు చేయలేక దాడులతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నాయకులను దాడులకు ప్రేరేపించడం, ఆ తర్వాత వారే క్షమాపణలు చెబుతున్నట్టు డ్రామా చేయడం నిత్యకృత్యమైందన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్, కాలేజీ స్పోర్ట్స్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అసభ్య పదజాలంతో దూషించి చెంప దెబ్బకొట్టడం, జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఇందుకు తార్కాణమన్నారు. దళిత అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు వైఎస్సార్ïÜపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళిత అధికారిని అసభ్యంగా దూషించి దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెబితే చాలా!ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు సురేష్చల్లపల్లి (అవనిగడ్డ): విధి నిర్వహణలో ఉన్న దళిత ప్రొఫెసర్‌పై అందరూ చూస్తుండగా దాడి చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు ప్రశ్నించారు. ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసే ప్రజాప్రతినిధులు, వ్యక్తులపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులు అధికారులపై దాడులు పరిపాటిగా మారాయని చర్యకు ప్రతిచర్య ఉండాలన్నారు. దాడిని ఖండించిన జూడాలుసాక్షి, అమరావతి: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడటాన్ని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) తీవ్రంగా ఖండించింది. ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడి, దుర్భాషలాడిన ఘటన ఆరోగ్య సంరక్షకులను అగౌరవపరచడమేనని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన భద్రతా వైఫల్యానికి నిదర్శనమని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రొఫెసర్‌పై దాడి హేయం ఏపీ ఏఎఫ్‌ఎంటీ అధ్యక్షుడు సాయిసుదీర్కర్నూలు (హాస్పిటల్): ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి హేయమైన చర్య అని ఏపీ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ (ఏపీ ఏఎఫ్‌ఎంటీ) అధ్యక్షుడు డాక్టర్ టి.సాయిసుధీర్ ఖండించారు. ఏపీ ఏఎఫ్‌ఎంటీ, ఏపీ జీడీఏ, ఏపీ జేయూడీఏ, ఐఎంఏ సంస్థలను సంప్రదించి తదనంతర కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దాడి సిగ్గుచేటువైఎస్సార్సీపీ వైద్య విభాగం ఉపాధ్యక్షుడు మెహబూబ్లబ్బీపేట (విజయవాడ తూర్పు): విధుల్లో ఉన్న మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ బండబూతులు తిడుతూ దాడికి పాల్పడటం దుర్మార్గమని, సిగ్గుపడాల్సిన అంశమని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఇదే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్ట్æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్ట్‌కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్‌చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు చేశారు. అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురూ ఫోన్లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆటలాడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ విష్ణువర్ధన్, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌తో కలసి ఆర్ఎంసీ గ్రౌండ్‌కి చేరుకున్నారు.కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట బెట్టుకుని గ్రౌండ్‌కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బండ బూతులు మొదలుపెట్టి.. ఆ డాక్టర్ ముఖానికి మాస్క్‌ను బలవంతంగా లాగేసి పిడిగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.నేటి నుంచి జూడాల నిరసన..ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్ఏ నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్ఎమ్సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.క్రిమినల్ కేసు నమోదు చేయాలిడా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. -
దళిత మహిళ పై దాడి హేయమైన చర్య
కాకినాడ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ గూండాలతో కలిసి కాంగ్రెస్ సీటీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కొప్పుల విజయ్‌కుమారి ఇంటిపై దాడి చేయడం, కులంపేరుతో దూషించడం దారుణమని ఎస్సీనేతలు విమర్శించారు. ఈ మేరకు స్థానిక సాంబమూర్తినగర్‌లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొప్పుల విజయకుమారి మాట్లాడుతూ బుధవారం పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ గూండాలు వ్యవహరించిన తీరును వివరించారు. ఆరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు నానాజీ ఆధ్వర్యంలో కొందరు మద్యం సేవించిన యువకులు తన ఇంటిని చుట్టుముట్టి బీభత్సం చేశారన్నారు. ఇంటిలోకి చొరబడి తమ కుటుంబ సభ్యులపై దుర్భాషలాడుతూ సామగ్రిని చిందరవందర చేశారన్నారు. కులంపేరుతో దూషించి నెట్టివేశారని ఆరోపించారు. పోలింగ్‌స్టేషన్ సమీపంలోనే ఇదంతా జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. కార్పొరేటర్‌గా పనిచేసిన తనపై కనీస మర్యాద చూపించలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అర్ధరాత్రి వరకూ పట్టించుకోలేదని, చివరకు తాను గట్టిగా గొడవ చేస్తే కేసు పెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ జస్టీస్ సంస్థ ప్రధాన కార్యదర్శి జయంత్, నాయకులు పువ్వల భాస్కరరావు, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంగలపూడి నూకరాజు, గూడపాటి రాజు, మాజీకౌన్సిలర్లు ముద్దండ నాగేశ్వర్రావు, సిగల మధు తదితరులు మాట్లాడుతూ ఎస్సీ మహిళపై బహిరంగంగానే ఇలాంటి దౌర్జన్యాలకు దిగిన పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. 24 గంటల్లో ఆయనపై చర్య తీసుకోని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతామన్నారు. సమావేశంలో నాయకులు నురుకుర్తి నాగరాజు, వైఎస్ఆర్సీపీ మైనార్టీసెల్ కన్వీనర్ అక్బర్అజామ్ తదితరులు పాల్గొన్నారు. పంతం నానాజీపై అట్రాసిటీ కేసు కాకినాడ క్రైం : కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీపై త్రీ టౌ న్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పంతం నానాజీ, అతడి అనుచరుడు పీటీ శివ తదితరులు పోలింగ్ రోజైన బుధవా రం మధ్యాహ్నం విజయ కుమారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిం చి, కులం పేరుతో ధూషించారు. ఇంట్లో డబ్బు, మ ద్యం దాచారంటూ ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. దీంతో విజయ కుమారి బుధవారం మధ్యాహ్నం త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ అదేరోజు రాత్రి 11 గంటల వరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు పోలీసులు పంతం నానాజీ, పీటీ శివ తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విజయ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.సతీష్ బాబు తెలిపారు.